ధనలక్ష్మి తలుపు తట్టింది..
పాడేరు : తాను హీరోగా నటించి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే..’ చిత్రం విజయం సాధించిందని హాస్య నటుడు, హీరో ధన్‌రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులు, చిత్రంలో విలన్‌పాత్రధారి శివతో కలిసి వచ్చి పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మే నెలలో పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలకు హాజరైనప్పుడు అనుకోకుండా అమ్మవారి సన్నిధిలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో విడుదల చేశానని, చిత్రం విజయం సాధిస్తే అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకొని ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు.
‘జబర్‌దస్త్’ కార్యక్రమంతో తనకు ప్రేక్షకాదరణ పెరిగిందని, తాను తీసిన చిత్రం విజయం సాధించడం కూడా ఇందుకొక కారణమని అన్నారు. ఈ విజయాన్ని, తన పట్ల ఉన్న ప్రేక్షకుల ఆదరణను నిలబెట్టుకునే విధంగా మరో 6 మాసాల్లో ఒక మంచి హాస్య చిత్రాన్ని నిర్మించడానికి కథను సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ‘పనిలేని పులిరాజు’ అనే చిత్రంలో హీరోగాను, ‘రాజుగారి గది’, ‘త్రిపుర’, ‘లోఫర్’ చిత్రాల తో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో తాను హాస్య నటుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా నిర్మించే ‘గబ్బర్‌సింగ్ 2’ లో కూడా తాను నటించే అవకాశం ఉందని తెలిపారు.
ఆలయానికి కూలింగ్ వాటర్ మినరల్ ప్లాంట్..
మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి కూలింగ్ వాటర్ మినరల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ధన్‌రాజ్ ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారు మహిమకలిగిన దేవతని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన ధన్‌రాజ్‌కు ఆలయ కమిటీ కార్యదర్శి బూరెడ్డి నాగేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగభూషణరావు అమ్మవారి జ్ఞాపికను అందజేసి సాలువాతో సత్కరించారు. ధన్‌రాజ్ కుటుంబ సభ్యులను సహ నటుడు శివకు ఆలయ కమిటీ నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. ధన్‌రాజ్‌ను అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు తీసుకున్నారు.