షరీఫ్‌ పేల్చిన బాంబు! | Editorial Article On Pakistan Former PM Nawaz Sharif | Sakshi
Sakshi News home page

షరీఫ్‌ పేల్చిన బాంబు!

Published Sat, May 19 2018 1:34 AM | Last Updated on Sat, May 19 2018 1:36 AM

Editorial Article On Pakistan Former PM Nawaz Sharif - Sakshi

నవాజ్‌ షరీఫ్‌

అందరికీ తెలిసిన కథే. తొమ్మిదేళ్లక్రితం అమెరికా పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ చెప్పిన సంగతే. ముంబై మహా నగరంపై 2008 నవంబర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడి 166మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం వెనక పాకిస్తాన్‌ ప్రమేయం ఉన్నదని ప్రపంచ దేశా లన్నిటికీ అర్ధమైన విషయమే. అయిదు రోజులక్రితం పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా పరోక్షంగా అదే చెప్పారు. ఎన్నాళ్లు పాక్‌ గడ్డపై  ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ పొరుగుదేశంపై దాడులకు పంపుతామని ఆయన ప్రశ్నించారు. అంతే...అక్కడ వ్యవస్థలన్నీ వణికిపోతున్నాయి. సొంత పార్టీ పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (పీఎంఎల్‌)–ఎన్‌తో సహా అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో షరీఫ్‌ స్వరం మార్చి తన మాటల్ని  మీడియా వక్రీకరించిందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాకిస్తాన్‌ సైన్యం ప్రధాని షహీద్‌ ఖాకాన్‌ అబ్బాసీని హడావుడిపెట్టి జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. షరీఫ్‌ అపార్ధం చేసుకుని ఉండొచ్చు లేదా ఆయనకు దురభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చునని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలి షరీఫ్‌ మాటల్ని ఖండించ లేదని, మీడియా వక్రీకరించిందని మాత్రమే అభిప్రాయపడిందని పీఎంఎల్‌–ఎన్‌ చెబుతోంది.

నవాజ్‌ షరీఫ్‌ తన మాటల్లో ఎక్కడా సైన్యం గురించి నేరుగా మాట్లాడలేదు. ఉగ్రవాద సంస్థలకు సైన్యం తోడ్పాటునిస్తున్నదని చెప్పలేదు. అయినా ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ పాక్‌ సైన్యానికి కంగారు ఎక్కువైంది. బహుశా తనకూ, సైన్యానికీ మధ్య విభేదాలు రాకుండా ఉంటే షరీఫ్‌ ఇంత బాహాటంగా పాక్‌ తప్పిదాన్ని అంగీకరించేవారు కాదేమో! ఆయన ప్రధానిగా ఉండగా ముంబై దాడుల ప్రస్తావన వస్తే  తమకేమీ సంబంధం లేదనే చెప్పేవారు. పైగా ఆ దాడులపై పాక్‌లో సాగుతున్న విచారణకు భారత్‌ సహకరించడం లేదని ఆరోపించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, ఆ తర్వాత అనర్హత వేటు వేయడానికి సైన్యం లోపాయికారీగా సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చిన తీరు చూశాక ఆయన ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పని చేశారు కాబట్టి ఆయనకు మొదటి నుంచీ సైన్యం వేస్తున్న వేషాలన్నీ తెలుసు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్రవాద ముఠాలకు డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న తీరు గురించిన సమస్త సమాచారమూ ఆయన వద్ద ఉంటుంది. కారణాలేమైనా కావొచ్చుగానీ షరీఫ్‌కూ, సైన్యానికీ మొదటినుంచీ పడటం లేదు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో అప్పటి సైనిక దళాల చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ తర్వాత ఖైదు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సౌదీ అరేబియా వెళ్లిపోతానని హామీ ఇచ్చాకే ఆయనకు విముక్తి లభించింది. 2013లో షరీఫ్‌ తిరిగి ప్రధాని కాగానే ముషార్రఫ్‌ పాలనాకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారు. 1999నాటి సైనిక కుట్ర గురించి కూడా విచారించి అందుకు ఆయన్ను శిక్షించాలని పట్టుబట్టారు. ఇదంతా సైన్యానికి నచ్చలేదు. 

పాకిస్తాన్‌లో మూడు అధికార కేంద్రాలుంటాయి. అవి సమాంతరంగా, స్వతంత్రంగా పని చేస్తుంటాయి. అందులో మొదటిది పౌర ప్రభుత్వం. రెండోది సైన్యం. మూడోది సుప్రీంకోర్టు. ఏ దేశంలోనైనా సైన్యం పౌర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. అది తీసుకునే నిర్ణయాలకూ, రూపొందించే విధానాలకూ కట్టుబడి ఉంటుంది. కానీ పాకిస్తాన్‌లో దీనికి విరుద్ధంగా జరుగు తుంది. సైన్యం స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటుంది. ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తుంది. అదును దొరికితే దాన్ని చాప చుట్టి తానే ఏలాలని చూస్తుంది. పాకిస్తాన్‌ అవతరణ నాటినుంచి ఆ దేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే నడిచింది. పదేళ్లుగా సైన్యం ఇలాంటి కుట్రలకు దూరంగా ఉన్నా తెరవెనకనుంచి పౌర ప్రభుత్వాలను శాసించే ధోరణి మానుకోలేదు. మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) వంటి పార్టీల ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తూనే ఉంది. నాలు గేళ్లక్రితం నవాజ్‌ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ పార్లమెంటును ముట్టడించిన ఇమ్రాన్‌ ఖాన్‌కు సైన్యమే అండదండలిచ్చింది. ఆయనకు జనంలో అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ ముట్టడి కార్యక్రమం నవ్వులపాలైంది. ఈలోగా 2016లో పనామా పత్రాలు వెల్లడై అందులో నవాజ్‌ షరీఫ్‌ కుటుంబసభ్యుల పేర్లున్నాయని తెలిశాక సైన్యం ఆయన అడ్డు తొలగించుకునే పని మొదలుబెట్టింది. సుప్రీంకోర్టును ప్రభావితం చేసి ఆయనపై విచారణ తంతు నడిపించి ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఆ తర్వాత రాజకీయాలకే ఆయన అనర్హుడంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిణామాల పర్యవసానంగానే నవాజ్‌ షరీఫ్‌ గళం విప్పారు. పరోక్షంగా సైన్యం సాగిస్తున్న కుట్రలను ప్రపంచానికి వెల్లడించారు. 
పాకిస్తాన్‌లో సాగుతున్న అంతర్గత కుమ్ములాటల మాట అలా ఉంచి ఉగ్రవాదానికి అక్కడి సైన్యం అందిస్తున్న తోడ్పాటుపై అమెరికా మాత్రమే కాదు... చైనా,  సౌదీ అరేబియా వంటి సన్నిహిత దేశాలు సైతం అసహనంతో ఉన్నాయి. ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఈ గండం నుంచి గట్టెక్కుదామని ప్రయత్నిస్తుండగా షరీఫ్‌ ఉన్నట్టుండి ఈ బాంబు పేల్చడంతో సైన్యానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఈ ఉలికిపాటు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఉగ్రవాద ముఠాలకు తోడ్పాటునిస్తున్న ధోరణులపై సాక్షాత్తూ మాజీ ప్రధానే మాట్లాడటం ఒక రకంగా మంచిదే. ప్రపంచం నలుమూలలనుంచీ పాక్‌పైఒత్తిళ్లు పెరుగుతాయి. సైన్యం కుటిల ధోరణులకు కళ్లెం పడేందుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంలో పౌర ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. ఇరు దేశాల మధ్యా సామరస్య సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement