ఎవరూ మాట్లాడలేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక ‘విషాదకర దశ’ను దేశం చూస్తున్న దని బొంబాయి హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాగ్రహ ప్రకటనగా భావించాలి. అయిదేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణేలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌నూ, మూడేళ్లక్రితం అదే రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో మరో హేతువాది గోవింద్ పన్సారేనూ కాల్చిచంపిన ఉదంతాలపై దర్యాప్తుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ కేసుల దర్యాప్తును ఎడతెగకుండా సాగదీస్తున్న సీబీఐ, ఆ రాష్ట్ర సీఐడీ సంస్థలు ఉన్నత న్యాయస్థానానికి ఈ పరిస్థితిని కల్పించాయి. ఇవి దర్యాప్తును పూర్తి చేసి, నేరగాళ్లను బంధించే ఉద్దేశంలో లేవని, న్యాయస్థానం స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తే తప్ప తమకు న్యాయం దక్కదని ఆ పిటిషనర్లు విన్నవించుకున్నారు. వారికి మణిపూర్ ఎన్‌కౌంటర్ల కేసులకు పడుతున్న గతి తెలియదనుకోవాలి.
అక్కడ జరిగిన 1,500కుపైగా ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు కోరుతూ ఏడేళ్లక్రితం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి నిరుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీబీఐ డైరెక్టర్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పటికి కేవలం నాలుగు కేసుల్లో రెండు చార్జిషీట్లు మాత్రమే సిట్ దాఖలు చేయగలిగింది. ఆ కేసు ల్లోని నిందితులనైనా ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేకపోయారన్న ధర్మాసనం ప్రశ్నకు సీబీఐ దగ్గర జవాబు లేదు. సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినందుకు కాబోలు మేజర్ విజయ్ సింగ్ బల్హారా అనే సైనిక అధికారిపై సీబీఐ కేసు దాఖలు చేసింది. 2009లో పన్నెండేళ్ల కుర్రవాడిని అతని తల్లిదండ్రుల కళ్లముందే ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపిన ఉదంతమిది.
దేశంలో అడపా దడపా సాగే ఎన్‌కౌంటర్లు, లాకప్ డెత్‌లు మన దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. మణిపూర్ ఎన్‌కౌంటర్ల గురించి సుప్రీంకోర్టు మాత్రమే కాదు... ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొన్న జూన్‌లో సమితి మానవ హక్కుల మండలి ‘కావాలని, అనుచితంగా, అకారణంగా’ ఈ కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని కటువుగా విమర్శించింది. దేశంలో ఎన్‌కౌంటర్లు, లాకప్‌డెత్‌లు లేని రాష్ట్రాలు దాదాపు ఉండవు. కానీ 2008–09లో మణిపూర్ అన్ని రాష్ట్రాలనూ తలదన్నిందని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత స్థానం ఉత్తరప్రదేశ్‌ది. 89 ఎన్‌కౌంటర్ కేసులపై నిరుడు డిసెంబర్ ఆఖరికి దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు గడువునిస్తే ఆ సమయానికి దర్యాప్తు సంగతలా ఉంచి, కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఆ తర్వాత ఆ గడువు మొన్న ఫిబ్రవరికి మారింది. కానీ మార్చి 12 నాటికి 42 కేసుల నమోదు మాత్రమే పూర్తయింది. కనీసం జూన్ నెలాఖరుకు 50 కేసుల్లో అయినా దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే జూలై 2న హాజరైన సీబీఐ అధికా రులు కేవలం నాలుగు కేసుల్లో దర్యాప్తు పూర్తిచేశామని విన్నవించారు. ఆ కేసుల్లో ఏ ఒక్కరూ అరెస్టు కాలేదని తాజాగా వెల్లడైంది. లాకప్ డెత్‌ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నిరుడు ఏప్రిల్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ దేశంలో మొత్తం 1,674 లాకప్ మరణాలు సంభవించాయని ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్(ఏసీహెచ్‌ఆర్) గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్‌లో రోజుకు సగటున అయిదు లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని సంస్థ లెక్కే సింది. చిత్రమేమంటే మన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసే గణాం కాల్లో ఈమధ్యవరకూ లాకప్ మరణాల ప్రస్తావన ఉండేది కాదు. అవి సర్వసాధారణంగా అనా రోగ్యం, ఆత్మహత్య, కస్టడీనుంచి అదృశ్యం కావటం, నిందితుణ్ణి తరలిస్తుండగా చనిపోవటం వంటి ఖాతాల్లో పడటం ఆనవాయితీ.
ఎన్‌కౌంటర్ మరణాలైతే హక్కుల సంఘాల దృష్టికొస్తాయి. చివరకు ఏమవుతాయన్న సంగతలా ఉంచి కనీసం న్యాయస్థానాల్లో ఆ మరణాలపై విచారణ కోరుతూ పిటిషన్లు దాఖ లవుతాయి. కానీ లాకప్ డెత్‌లు అలా కాదు. మరీ ప్రాముఖ్యత సంతరించుకున్న కేసులైతే చెప్పలేంగానీ చాలా కేసుల్లో చివరివరకూ పట్టుదలగా పోరాడేవారుండరు. ఎందుకంటే వీటిల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు పూటకు గతి లేని, రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగు కులాలకు చెందినవారే. వారి తల్లిదండ్రులైనా, బంధువులైనా కూలి పనులు మానుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితిలో ఉండరు. ఉన్నా వారికి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుంటాయి. కేరళలో ప్రభావతి అనే ఒక తల్లి తన కుమారుడి లాకప్ మరణంపై పట్టుదలగా పోరాడి నిందితులకు సీబీఐ కోర్టులో ఈమధ్యే ఉరిశిక్ష పడేలా చూసిన ఉదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తల్లి పట్టుదలగా పోరాడిన వైనం గమనిస్తే అదే రాష్ట్రంలో 1976లో ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పోలీసుల చేతుల్లో అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్, అతని ఆచూకీ చెప్పాలంటూ 2006లో తుది శ్వాస విడిచేవరకూ పోరాడిన అతని తండ్రి ప్రొఫెసర్ ఎచెరా వారియర్ గుర్తుకొస్తారు.
అంతం తమాత్రం చదువుకొని ఆయాగా పనిచేస్తున్న ఒంటరి మహిళ ప్రభావతి 2005లో తన ఒక్కగానొక్క బిడ్డను పోలీసులు కొట్టి చంపారని తెలిసినప్పటినుంచీ మొండిగా పోరాడింది. గూండాల నుంచి బెదిరింపులొచ్చినా, రోడ్డు ప్రమాదంలో హతమార్చే ప్రయత్నం జరిగినా, డబ్బు ముట్టజెబుతా మని ఆశ చూపినా తన సంకల్పం వీడలేదు. కానీ ఇంత సాహసికంగా, ఇంత నిర్భీతితో పోరాడటం అందరికీ సాధ్యమయ్యే పనేనా? ఈ ఎన్‌కౌంటర్లు, లాకప్ మరణాలు అంతర్జాతీయంగా మనల్ని నగుబాటుపాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ఈ ఉదంతాలను పాలకులు నివారించలేకపోతే పోయారు... ఇప్పటికైనా మేల్కొని కనీసం త్వరితగతిన దర్యాప్తు పూర్తయ్యేలా, నిందితులకు శిక్షలు పడేలా చూడకపోతే ఈ ఘటనలకు వారి పరోక్ష ఆమోద మున్నదనే అభి ప్రాయం బలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment