ఖషోగ్గీ హంతకులెవరు? | Editorial On Khashoggi Issue In Saudi Arabia | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 20 2018 12:19 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial On Khashoggi Issue In Saudi Arabia - Sakshi

అసమ్మతి ఎక్కడ తలెత్తినా అణిచేయడం, విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో చంపేయడం ఒక అలవాటుగా చేసుకున్న సౌదీ అరేబియా... దేశం వెలుపల కూడా అదే బాణీ కొనసాగించి అడ్డంగా దొరికిపోయింది. పైగా తనకు అసలే పడని టర్కీ భూభాగంపై ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడవలసి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన పాత్రికేయుడు జమాల్‌ ఖషోగ్గీని సౌదీ నుంచి ప్రత్యేకించి వచ్చిన 15మంది సభ్యుల హంతక ముఠా చంపి, ఆయన శరీరాన్ని ముక్కలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసింది. మొదట్లో ఖషోగ్గీ గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ ఇప్పుడి ప్పుడే దారికొస్తోంది. ఈ పాపం తమ దేశం నుంచి వెళ్లినవారి పనేనని అది ఒప్పుకోవచ్చునని మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ప్రస్తుత సౌదీ పాలకుడు యువరాజు సల్మాన్‌ అత్యంత ఆప్తుడు. అందుకే మొదట్లో ట్రంప్‌ అయోమయంలో పడ్డారు. తొంద రపడి మాట్లాడటం సరికాదంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఖషోగ్గీ బహుశా మర ణించే ఉంటాడని, అది రుజువైతే సౌదీ నేతలకు చిక్కులు తప్పవని ఇప్పుడు చెబుతున్నారు. అంతేకాదు, వచ్చేవారం సౌదీ రాజధాని రియాద్‌లో జరగనున్న కీలకమైన పెట్టుబడుల సదస్సుకు వెళ్లొద్దని దేశంలో ఒత్తిళ్లు రావడంతో అంగీకరించక తప్పలేదు. అమెరికాతో పాటు తాము కూడా సదస్సును బహిష్కరిస్తున్నామని బ్రిటన్‌ తెలిపింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ సైతం ఇలాగే ప్రకటించాయి.

సౌదీలో ఏం జరిగినా పాశ్చాత్య దేశాలు పట్టనట్టు ఉండేవి. భౌగోళికంగా పశ్చిమాసియా వాటికి అత్యంత కీలకమైన ప్రాంతం కావడం ఇందుకొక కారణం. అలాగే గల్ఫ్‌ దేశాల్లో అపారంగా ఉన్న చమురు నిక్షేపాలు వాటికి అవసరం. అందుకే అక్కడ నియంతృత్వ పోకడలున్నా, మానవ హక్కుల ఉల్లంఘన సాగుతున్నా అమెరికా మొదలుకొని ఏ అగ్రరాజ్యమూ నోరెత్తదు. ఏడాదిక్రితం అధికారం పగ్గాలు అందుకున్న యువరాజు సల్మాన్‌ సౌదీ విజన్‌–2030 పేరిట డాక్యుమెంటు విడు దల చేసి దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు, అభ్యర్థులుగా నిలిచేందుకు మహిళలకు అవకాశం ఇచ్చారు.  అలాగే మొన్న జూన్‌లో మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతినిచ్చారు. వీటన్నిటినీ చూపి ప్రిన్స్‌ సల్మాన్‌ గొప్ప సంస్కర్తగా పాశ్చాత్య దేశాలు కీర్తించాయి. కానీ నిరుడు అవినీతి వ్యతిరేక చర్యల పేరిట గంపగుత్తగా యువరాజులను, మంత్రులను, వ్యాపారులను ఎడాపెడా అరెస్టు చేసి జైళ్లలో పెడితే ఈ దేశాలు నోరెత్తలేదు. మహిళా ఉద్యమనేతలను అరెస్టుచేసి వారిలో అనేకులను మరణదండన పేరిట అడ్డుతొలగించుకోవడానికి ప్రిన్స్‌ సల్మాన్‌ ప్రయత్నిస్తున్నాడు.

అన్నిటికన్నా ఘోరమేమంటే నిరుడు సౌదీ పర్యటనకొచ్చిన లెబనాన్‌ ప్రధాని సాద్‌ హరిరిని రెండు వారాలు బంధించి లెబనాన్‌కు వ్యతిరేకంగా ఆయనతో ప్రకటనలు ఇప్పించారు. చివరికాయన ఆ దేశం చక్రబంధంలోంచి బయటపడి నిజాలేమిటో బయటి ప్రపంచానికి చాటాడు. మొన్న మార్చిలో సౌదీ మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్‌ అల్‌–హత్‌ను అబూదాబీలో అపహరించి విమానంలో సౌదీ తరలించి కటకటాల వెనక్కు నెట్టారు. తనకు నచ్చని దేశాలను ధూర్త దేశాలుగా ముద్రేసి ఆ దేశాలపై ఏకపక్షంగా దాడులకు దిగడం అమెరికాకు అలవాటు. తన అనుకూలురు ఏం చేసినా, ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నా దానికి పట్టదు. మూడేళ్లుగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో బాంబు దాడులు చేస్తున్నాయి. తిరుగుబాటుదార్లను అణిచే పేరిట సాధారణ పౌరు లను పొట్టనబెట్టుకుంటున్నాయి. అయినా ఎవరూ ప్రశ్నించకపోవడాన్ని యువరాజు సల్మాన్‌ అలు సుగా తీసుకున్నారు. బహుశా అందుకే తన ప్రత్యర్థి దేశమైన టర్కీకి హంతకముఠాను పంపే స్థాయికి తెగించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ నియంత పోకడల్లో యువరాజు సల్మాన్‌కి ఏమాత్రం తీసిపోరు. ఆయన కూడా అసమ్మతివాదులను రకరకాల సాకులతో జైళ్లపాలు చేస్తు న్నారు. అయితే వారిద్దరికీ బద్ధవైరం. తాను కత్తిగట్టిన ఖతార్‌కు టర్కీ మద్దతుగా నిలుస్తున్నదన్న దుగ్ధ సౌదీకి ఉంది. అలాగే దేశం విడిచిపారిపోయిన తన వ్యతిరేకులకు అది ఆశ్రయమిస్తున్నదన్న ఆగ్రహం ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఖషోగ్గీ వ్యవహారం బయటికొచ్చింది.

ఇంతకూ ఖషోగ్గీ సౌదీలో సాగుతున్న రాచరికానికి వ్యతిరేకి కాదు. కాకపోతే సల్మాన్‌ అను సరిస్తున్న విధానాలు మారాలని ఆయన వాదించేవారు. అలాగే యెమెన్‌లో సాగిస్తున్న అధర్మ యుద్ధాన్ని మానుకోవాలని సూచించేవారు. ఇలా విమర్శించడం యువరాజుకు నచ్చలేదు. ఆయన గారికి తన రాతలు ఆగ్రహం తెప్పిస్తున్నాయని, దేశంలో ఉంటే ప్రమాదమని భావించి ఖషోగ్గీ నిరుడు అమెరికా వెళ్లిపోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి నిర్ణయించుకుని అందుకవసర మైన పత్రాల కోసం ఆయన ఈ నెల మొదట్లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లడం, ఆ తర్వాత 15మంది వ్యక్తులు ఆ కార్యాలయంలోకి ప్రవేశించడం సీసీటీవీ దృశ్యాల్లో నమో దైంది. అనంతరం ఆ 15మంది అక్కడినుంచి నిష్క్రమించిన దృశ్యాలున్నాయి తప్ప ఖషోగ్గీ జాడ లేదు. ఇదే టర్కీకి పెద్ద ఆయుధమైంది. ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, ప్రయో జనాలే పునాది. విలువల గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఈ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విమర్శలతో అమెరికా ఇప్పటికైతే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోంది. కానీ పూర్తిగా నమ్మడానికి లేదు. అది మున్ముందు టర్కీ, సౌదీలకు రాజీ కుదిర్చి దీన్ని కప్పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. విలువలు వదిలి నిరంకుశ, అనాగరిక వ్యవస్థల్ని భుజాన వేసుకుని ఊరేగే దేశాలు న్నంత కాలం ఖషోగ్గీలాంటివారు మాయమవుతూనే ఉంటారు. అందుకే ఈ కేసులోని సూత్ర ధారులకూ, పాత్రధారులకూ శిక్ష పడేవరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement