పాక్ సేనల దుర్మార్గం
ఎప్పటిలా అధీన రేఖ(ఎల్‌ఓసీ) మళ్లీ రక్తసిక్తం అయింది. మన భూభాగంలోకి 250 మీటర్లు చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ సైనికులు ఇద్దరు భారత జవాన్‌లను కాల్చిచంపడంతోపాటు వారి మృతదేహాలను ఛిద్రం చేశారు. తలలు నరికారు. మరొక జవాన్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఆరు నెలలక్రితం మన దళాలు పాక్ గడ్డపై సర్జికల్ దాడులు చేశాక...ముఖ్యంగా అయిదునెలలక్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా జావేద్ బజ్వా బాధ్యతలు చేపట్టాక మన జవాన్లపై పాక్ సైనికుల క్రౌర్యం హెచ్చింది. మెరుపుదాడులు చేసి మన జవాన్ల ప్రాణాలు తీయడంతోపాటు వారి మృతదేహాలను ఛిద్రం చేసే దుశ్చర్యకు కూడా పూనుకుంటున్నారు. తాజా ఉదంతంపై పాక్ విదేశాంగ శాఖ స్పందన ఎప్పటి తరహాలోనే ఉంది.
అసలు అధీన రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘన ఉదంతమే చోటు చేసుకోలేదని, సైనికుల తలలు నరకడం కూడా తప్పుడు ప్రచారమేనని ఆ శాఖ ప్రతినిధి బుకాయించారు. తమ దేశంలో అస్థిరత ఏర్పడినా, పౌర ప్రభుత్వానికి అంతో ఇంతో సానుకూలత ఉన్నదన్న అనుమానం వచ్చినా, ఇరుదేశాలమధ్యా సామరస్య వాతావరణం ఏర్పడబోతున్నదన్న సంకేతాలు అందినా సరిహద్దుల్లో ఏదో సాకుతో రెచ్చిపోవడం, దాడులకు పాల్పడటం పాక్ సైన్యానికి షరామామూలు. ఇలాంటి దుండగానికి పాల్పడినప్పుడు భారత్ నుంచి గట్టి జవాబు వస్తుందని...అది జరిగితే దేశంలో మళ్లీ తమ వైభవప్రాభవాలు పెరుగుతాయని వారి అంచనా.
ఈసారి చేసిన దాడి వెనక మరో కారణం కూడా ఉండవచ్చు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మన దేశంలో పర్యటిస్తున్న ఈ తరుణంలో దాడి చేస్తే ఇరు దేశాల ఉద్రిక్తతలు ప్రస్తావనకొస్తాయని, కశ్మీర్ సమస్యపై ఆయన ఏదో ఒకటి మాట్లాడతారని పాకిస్తాన్ సైన్యం భావించినట్టు కనబడుతోంది. వారనుకున్నట్టే కశ్మీర్ సమస్యపై బహుళపక్ష చర్చలు జరపాలని, అందులో తాము కూడా పాలుపంచుకుంటామని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయంలో మొదటినుంచీ మన దేశం అనుసరిస్తున్న వైఖరి ఎర్డోగన్‌కు తెలిసే ఉండాలి. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమనీ, ఇరు దేశాల మధ్య మాత్రమే దీనిపై చర్చలు జరగాలని మన దేశం అంటున్నది.
కానీ ఆయన తగుదునమ్మా అని ఇందులో పాలుపంచుకుంటాననడం, ఆ సంగతిని మన దేశ పర్యటనలో ఉండగా చెప్పడం ఇబ్బందికరమైనదే. ఇద్దరు సైనికులను అత్యంత కిరాతకంగా హతమార్చడం ద్వారా ఎర్డోగన్ నోటి వెంట అలాంటి మాట మాట్లాడించగలిగామని పాక్ సైన్యం పొంగిపోతూ ఉండొచ్చు. అయితే టర్కీకి గత ప్రాభవం లేదు. యూరప్, పశ్చిమాసియాల మధ్య సుస్థిరతగల దేశంగా ఒకప్పుడు వెలిగిన టర్కీ ఇప్పుడు అటు సిరియా నుంచి వచ్చి ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్న ఐఎస్ మిలిటెంట్లతో, ఇటు తూర్పున కుర్దిష్ మిలిటెంట్లతో అను నిత్యం పోరాడవలసి వస్తున్నది. ఇవి చాలవన్నట్టు అంతర్గతంగా రాజకీయ అస్థిరత ఉంది. తన ఇంట ఇన్ని సమస్యలుండగా భారత్–పాక్ మధ్య తీర్పరి పాత్ర వహిస్తాననడం తెలివితక్కువతనం.
పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా ఎల్‌ఓసీకి వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. మొన్న మార్చిలో భారీయెత్తున భారత్ భూభాగంలోకి చొరబడబోయిన జిహాదీ మిలిటెంట్లను మన సైన్యం తరిమి తరిమి కొట్టడంతోపాటు అనంతర కాలంలో బీఎస్‌ఎఫ్ గస్తీని ముమ్మరం చేసింది. గత నెల 17న చొరబాటుదార్లకు సాయపడుతున్న పాకిస్తాన్ పోస్టు పోస్టుపై దాడులు కూడా చేసింది. అప్పటినుంచీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ వైఫల్యంపై బజ్వా కన్నెర్ర చేసినందుకే పాక్ సైనికులు రెచ్చిపోయారని మన సైనిక ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎల్‌ఓసీ వద్ద ఎలాగైనా ఆధిక్యత సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పాకిస్తాన్ సైన్యం స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ నుంచి కొందరిని ప్రత్యేకించి ఎన్నుకుని శిక్షణనిచ్చి బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) పేరిట గత కొన్నేళ్లుగా పంపుతోంది.
అందులో ఉగ్రవాదులు సైతం పాలుపంచుకుంటున్నారని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చాన్నాళ్లుగా చెబుతున్నాయి. మూడేళ్లక్రితం ఒక జవాన్‌ను, నిరుడు అక్టోబర్ నుంచి అడపా దడపా ముగ్గురిని పొట్టనబెట్టుకున్నది కూడా బ్యాట్ బృందమే. ఈ సందర్భాలన్నిటా మృతదేహాలను ఛిద్రం చేయడం రివాజుగా మారింది. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలను పాటించే సైన్యం తమదని, ఇలా మృతదేహాలను ఛిద్రం చేసే నైచ్యానికి ఒడిగట్టదని చెప్పే పాక్ విదేశాంగ శాఖ ఈ బ్యాట్ వ్యవహారం గురించి మాత్రం నోరెత్తడం లేదు. సరిహద్దుల్లో కాపలాగా సైన్యాన్ని ఉంచడంతోపాటు మిలిటెంట్లను చేరదీసి, ఆయుధాలివ్వడం, చొరబాటుదార్లను పంపడం ఏ సైనిక ప్రమాణాల ప్రకారం సరైందో చెప్పడం లేదు.
ఈ ఉదంతం తర్వాత భారత్ స్పందన కూడా కఠినంగానే ఉంది. ఆ సైనికుల మరణం వృథా కాబోదని రక్షణ శాఖ కూడా చూస్తున్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదే సమయంలో సైన్యం ఎలాంటి చర్య తీసుకోవాలన్న విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కనుక రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఒకపక్క కశ్మీర్ లోయ ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఇదే సమయాన్ని ఎంచుకుని సరిహద్దుల్లో మంట పెడితే భారత్ కష్టాలు మరింత పెరుగుతాయన్నది పాక్ సైన్యం అంచనా. ఇలాంటి ఉదంతాలతో సమస్యలు సృష్టిస్తే భారత్ దారికొస్తుందని పాకిస్తాన్ భ్రమ పడుతోంది. ఇలాంటి భ్రమలతోనే అది మూడుసార్లు కశ్మీర్ అంశంపై యుద్ధానికి దిగింది. మూడుసార్లూ ఓటమిపాలై అన్నివిధాలా తీవ్రంగా దెబ్బతింది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి చికాకు పరచాలని చూస్తోంది. ఈ క్రమంలో తానే వారి ఆగడాలకు బలైపోతోంది. ఇప్పటికైనా వివేకం తెచ్చుకుని సక్రమంగా ప్రవర్తించడం అవసరమని అది గుర్తించడం అవసరం. లేనట్టయితే అంతిమంగా నష్టపోయేది ఆ దేశమే.