సంపాదకీయం
ఒకప్పుడు ఒకే దేశంగా, ఇప్పుడు రెండు ఇరుగుపొరుగు దేశాలుగా మనుగడ సాగిస్తున్న భారత, పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలు వెల్లివిరిస్తే అది ఉభయుల ప్రగతికి దోహదపడుతుందని ప్రగాఢంగా విశ్వసించేవారు రెండు ప్రాంతాల్లోనూ ఉన్నారు. ప్రజలమధ్య రాకపో కలుంటే సాంస్కృతిక బంధం గట్టిపడుతుందని... అది అపోహలనూ, అపార్థాలనూ దూరం చేస్తుందని అలాంటివారంతా ఆశిస్తారు. అయితే, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు పాత్రికేయులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తీరు ఇలాంటి ఆశలపై నీళ్లు జల్లే పరిణామం. ఈ ఇద్దరు పాత్రికేయుల్లో ఒకరు ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ విలేకరి మీనా మీనన్ కాగా, మరొకరు పీటీఐ వార్తాసంస్థ విలేకరి స్నేహేష్ అలెక్స్ ఫిలిప్.
వీరిద్దరికీ వారం క్రితమే ఫోన్‌చేసి స్వస్థలాలకు వెళ్లిపొ మ్మని మౌఖికంగా ఆదేశించారు. ఆ సంగతిని లిఖితపూర్వకంగా ఇవ్వా లని ఆ పాత్రికేయులిద్దరూ కోరినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు పాకి స్థాన్ ప్రభుత్వం ఆ పని కూడా చేసింది. అందులో సైతం కారణాలే మిటని చెప్పలేదు. కారణాలేమైనా కావొచ్చుగానీ... అందుకు ఎంచు కున్న సమయం సరైందికాదని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇప్పుడున్న యూపీఏ ప్రభుత్వం స్థానంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కవచ్చు నన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
భారత్‌తో స్నేహసంబంధాల పెంపునకు తాను కృషి చేస్తానని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిరుడు గద్దెనెక్కినప్పుడు చెప్పిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు సంబంధిం చినంతవరకూ ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా కీలకమైనవి. తన మాటల్లో చిత్తశుద్ధి ఉంటే, అందుకు కట్టుబడాలన్న సంకల్పం ఆయనలో ఉంటే నవాజ్ ప్రభుత్వం ఇలాంటి సమయాన్ని ఎంచుకునేది కాదు. ఇరుదేశాలమధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం మన పాత్రికేయులిద్దరు పాకిస్థాన్‌లోనూ... ఆ దేశానికి చెందిన ఇద్దరు పాత్రికేయులు ఇక్కడా పనిచేయాల్సి ఉంది.
అందుకు అనుగుణంగా మన పాత్రికేయులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకనో మూడేళ్లుగా పాకిస్థాన్ మాత్రం తమ పాత్రికేయులను ఇక్కడకు పంపలేదు. నవాజ్ గద్దెనెక్కి ఏడాదవుతున్నా ఇందుకు కారణమేమిటో ఆరా తీసి సరిచేయడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. సరిగదా ఇప్పుడు ఈ చర్యకు పూనుకున్నారు. పక్కపక్కనే ఉన్నా రెండు దేశాలమధ్యా అనంతమైన అగాథం ఉన్నది. దేశ విభజన సమయంలో వేలాదిమందిని బలితీసుకున్న విషాదకర ఘటనలు కావొచ్చు... అపరిష్కృతంగా మిగిలిపోయిన సరిహద్దు వివాదంకావొచ్చు రెండు దేశాలమధ్యా శత్రుపూరిత వైఖరిని పెంచింది.
నాలుగుసార్లు వచ్చిన యుద్ధాలు, వాటితోపాటే విస్తరి స్తున్న ఆయుధపోటీ భారత, పాక్‌ల అభివృద్ధిని గణనీయంగా ప్రభా వితంచేశాయి. ఇతరేతర అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించాల్సిన వేల కోట్ల రూపాయలు ఈ పోటీకి మళ్లించవలసి వస్తున్నది. రెండు దేశాల వైషమ్యాల్లోనే తమ మనుగడ ఉన్నదని భావించిన అగ్ర రాజ్యాలు ఈ ఆయుధ పోటీని, పరస్పర వైషమ్యాలకు ఊపిరులూ దాయి. వీటిని ఆసరా చేసుకుని పాక్‌లోని కొన్ని శక్తులు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశంపైకి ఉసిగొల్పుతున్నాయి. ఆ ఉగ్రవాదం ఇప్పుడు పాకిస్థాన్‌ను కూడా కబళించే స్థితికి చేరుకుంది.
2008లో ముంబై నగరాన్ని గడగడలాడించిన ఉగ్రవాదులు శూన్యంనుంచి ఊడిపడలేదు. పాకిస్థాన్‌లో శిక్షణపొంది, ముంబై నగరం ఆనుపాను లన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఆ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టిం చారు. దీనికితోడు రెండు దేశాలమధ్యా కార్యదర్శుల స్థాయి చర్చలో, మరొకటో జరిగినప్పుడల్లా, శాంతి ప్రయత్నాల ఛాయలు కనబడుతు న్నప్పుడల్లా పాకిస్థాన్ సైన్యం అధీనరేఖవద్ద కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుంటుంది. ఇరుదేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాల పెంపు నకు కృషిచేస్తానని, సరిహద్దు తగాదాలను శాంతియుత పద్ధతిలో పరి ష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని ప్రధాని కాకమునుపూ, తర్వాతా కూడా నవాజ్ పలు సందర్భాల్లో చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక గత నేతల తీరుకు భిన్నంగా ఆయన మన పాత్రికేయులను పిలిపించుకుని ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.
తీరా ఆచరణకొచ్చేసరికి పాకిస్థాన్‌లోని గత పాలకుల నడవడికి ఆయన ఏమాత్రం భిన్నంగా వ్యవహరించడంలేదని భారత పాత్రికేయులను అకారణంగా వెళ్లగొడుతున్న తీరునిబట్టి అర్థమవుతుంది. రెండు దేశాలమధ్య బలమైన స్నేహసంబంధాలు నెలకొనాలంటే దేశాధినేతల పర్యటనలూ, కార్యదర్శుల స్థాయి చర్చలు మాత్రమే సరిపోవు. ఇరుదేశాల పౌరులమధ్యా రాకపోకలుండాలి. వారి మధ్య సదవగాహన పెంపొందాలి. సాంస్కృతిక సంబంధాలు పెరగాలి. పరస్పరం పాత్రికేయులను నియమించుకోవడం అందుకు ఎంత గానో తోడ్పడుతుంది.
పాకిస్థాన్‌లో చాపకింది నీరులా సైన్యం ప్రాబల్యం పెంచుకుంటూ విదేశాంగ విధానాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకున్న సూచనలు చాలాకాలంక్రితమే కనబడ్డాయి. ఆమధ్య మన దేశానికి ‘అత్యంత అనుకూల దేశం’ ప్రతిపత్తిని ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడినప్పుడు పాక్ సైన్యం దాన్ని అడ్డుకుంది. ఆ వరసలోనిదే తాజా చర్య కూడా. ఇలాంటి ధోరణి శాంతియుత వాతావరణం పెంపునకుగానీ, సత్సంబంధాలు నెలకొల్పుకోవడా నికిగానీ ఏమాత్రం దోహదపడదని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తెలుసుకోవాలి.
పాక్ వింత వైఖరి!
Published Fri, May 16 2014 12:49 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement