దేశాల మధ్య ఉండే సంబంధాలు చిత్రమైనవి. పరస్పరం కత్తులు నూరుకునే దేశాలు మాత్రమే కాదు... స్నేహంగా ఉంటున్న దేశాలు సైతం అవతలి పక్షం తీరుతెన్నుల గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయిదేళ్ల క్రితం సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా దశాబ్దాలుగా శత్రు దేశాలపైన మాత్రమే కాదు... సన్నిహిత దేశాలపై కూడా ఎలా నిఘా పెట్టిందో బట్టబయలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బ్రిటన్–రష్యాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ అలాంటి గూఢచార కార్యకలాపాల పర్యవసానమే. రష్యా సైనిక ఇంటెలిజెన్స్ కల్నల్‌గా పనిచేసిన సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియా స్క్రిపాల్ బ్రిటన్‌లోని శాలిస్‌బరీ పట్టణంలో ఒక షాపింగ్ మాల్ వద్ద ఈ నెల 4న అపస్మారకస్థితిలో పడి ఆసుపత్రిపాలైన ఉదంతం బ్రిటన్, రష్యాలమధ్య చిచ్చు రేపింది.
వీరిద్దరిపైనా విష రసాయన ప్రయోగం జరిగిందన్నది ఆరోపణ. పర్యవ సానంగా రష్యా రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 23మంది దౌత్యాధికా రులు తక్షణం దేశం విడిచి వెళ్లాలంటూ బ్రిటన్ హుకుం జారీ చేసింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇలా పరస్పరం దౌత్యాధికారులను బహిష్కరించుకున్న చరిత్ర ఉంది. ఆ సంప్రదాయం మళ్లీ మొదలుకావడం ఆందోళన కలిగిస్తుండగా ఈ గొడ వలో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా కూడా తలదూర్చాయి. ఈ ఉదంతంలో రష్యా తక్షణం సంజాయిషీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఉదంతంతో తమకేమాత్రం సంబంధం లేదని రష్యా అంటున్నది.
సెర్గీ స్క్రిపాల్ రష్యా పౌరుడు, ఆ దేశ సైనిక ఇంటెలిజెన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేసినవాడు. వేరే దేశాలపై నిఘా ఉంచి సమాచారం రాబట్టాల్సిన స్క్రిపాల్ యూరప్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న గూఢచారులు, వారి చిరునామాలు, వారి మారుపేర్లు వగైరాలను పదేళ్లపాటు బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6కు అందజేశాడు. 2003లో పట్టుబడ్డాడు. ఈ కేసు పర్యవసానంగా అతని ఉద్యోగం పోవడంతోపాటు దేశద్రోహ నేరంకింద జైలు శిక్ష కూడా పడింది. 2010లో బ్రిటన్, రష్యాల మధ్య గూఢచారుల మార్పిడి ఒప్పందం కింద స్క్రిపాల్ విడుదలై బ్రిటన్ వెళ్లి పోయాడు. సాధారణంగా అయితే అక్కడితో ఆ వ్యవహారం ముగిసి పోవాల్సింది. కానీ రష్యాకు అలాంటి చరిత్ర లేదు.
అది గతంలో సైతం ఇలా డబుల్ ఏజెంట్లుగా పని చేసిన ‘ద్రోహుల్ని’ వదల్లేదు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో పనిచేస్తూ అనంతర కాలంలో పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారి బ్రిట న్‌కు వెళ్లిపోయిన అలెగ్జాండర్ లిత్వినెంకోను ఇదే తరహాలో 2006లో మట్టుబె ట్టారు. రష్యా వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్‌స్కీని చంపడానికి పుతిన్ ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించి లిత్వినెంకో పుతిన్ ఆగ్రహానికి గురయ్యాడు. లిత్వినెం కోపై గుర్తు తెలియని వ్యక్తులు పొలో నియం–210 అనే అణుధార్మిక పదార్థాన్ని ప్రయోగించారని బ్రిటన్ పోలీసులు నిర్ధా రించారు. తమ భూభాగంలో లిత్వినెం కోపై విషప్రయోగం జరిపిన రష్యా పౌరుణ్ణి బ్రిటన్ గుర్తించి అప్పగించమని కోరినా పుతిన్ ప్రభుత్వం అంగీకరించలేదు.
వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు విదేశాల్లో పర్యటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్నేహసంబంధాలు నెరపడం సర్వసాధారణం. దీనికి సమాంత రంగా ఆ దేశాల్లోనే గూఢచారులను నియమించుకుని వారిద్వారా సొంతంగా సమా చారం రాబట్టుకోవడం ఇంచుమించు ప్రతి దేశమూ చేసే పని. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అమెరికా ఈ విషయంలో ఆరితేరింది. అది ధూర్త దేశాలుగా పరిగణిస్తున్న ఇరాన్, ఉత్తరకొరియా, సిరియా వంటి దేశాలపై మాత్రమే కాదు... తనకు సన్నిహితంగా మెలగుతున్న బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలపై కూడా గూఢచర్యం సాగించింది. ఎడ్వర్డ్ స్నోడెన్ వీటిని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించి అందరినీ నివ్వెరపరిచాడు. అమెరికా నిఘాకు బలైన దేశాల్లో మన దేశం కూడా ఉంది. శత్రు దేశాల ఎత్తుగడలేమిటో, ఆ దేశాల్లో అంతర్గత పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకోవడంలో వింతేమీ లేదు. శత్రుదేశం కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండ టం సాధారణం.
కానీ మిత్ర దేశాలుగా ఉంటూ పరస్పరం సహకరించుకునే దేశాలు సైతం అవతలి దేశం ఏం చేస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రతి దేశమూ తమ సమస్త సమాచారాన్నీ బట్టబయలు చేసుకోదు. ఎంత మిత్రదేశమైనా చెప్పవలసినదేమిటో, చెప్పకూడనిదేమిటో పరిమితులు విధించుకుంటుంది. తమ సమాచారం బయటికిపొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవతలి దేశం గుట్టు లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా ఎవరికి వారు సాగించే నిఘా కార్యకలా పాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. 1971లో భారత్–పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరగడానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహమేమిటో తమకు కేబినెట్ మంత్రి ద్వారా తెలిసేదని అప్పటి సీఐఏ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్ ప్రకటించాడు.
2009లో లండన్‌లో జరిగిన జీ–20 దేశాల సమావేశాలపై అమెరికా నిఘా పెట్టి వివిధ దేశాల ప్రతినిధి బృందాలు తమలో తాము మాట్లాడుకున్న సంభాషణల్ని రికార్డు చేసిందని స్నోడెన్ అయిదేళ్లక్రితం బయటపెట్టాడు. ఏ దేశం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నదో తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసు కోవడం అమెరికా చర్యలోని ఆంతర్యం. జీ–20లో ఒకటి రెండు మినహా అన్నీ అమెరికా మిత్ర దేశాలే. పైగా ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్ అత్యంత సన్నిహిత దేశం. అయినా అమెరికా తన పోకడ మానుకోలేదు.
ఇప్పుడు స్క్రిపాల్, అతని కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వీరిపై ప్రయో గించిన పదార్థం ‘నోవిచోక్’ అయి ఉండొచ్చునంటున్నారు. ఇది నాడుల పనితీరును నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుందని, మనుషుల్ని క్షణాల్లో అశక్తులుగా మారుస్తుందని, ఒకసారి దీని బారిన పడితే కోలుకోవడం అంటూ ఉండదని చెబుతున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఉదంతం రష్యాకూ, యూరప్ దేశాలకూ మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, ఇది ఎటు పోతుందో రాగలరోజుల్లో తెలు స్తుంది. పరస్పర గూఢచర్యం చివరికెలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలి యాలంటే స్క్రిపాల్ ఉదంతమే ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment