అమెరికా నిందలో నిజమెంత? | Sakshi Editorial On USA CIA | Sakshi
Sakshi News home page

అమెరికా నిందలో నిజమెంత?

Published Fri, Dec 1 2023 12:30 AM | Last Updated on Fri, Dec 1 2023 8:42 AM

Sakshi Editorial On USA CIA

ఖండాంతరాలు దాటి వెళ్లి శత్రువుగా భావించినవారిని చడీచప్పుడూ లేకుండా అంతం చేయటం అంతర్జాతీయంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న కథే. ఈ విషయంలో తరచుగా ఇజ్రాయెల్, రష్యాల పేర్లు వస్తుంటాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఎక్కువగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పేరు వినబడేది. దాని లక్ష్యాలన్నీ దేశాధినేతలే. అది సాగించిన హత్యలపై ఆ సంస్థనుంచి రిటైరైనవారు ఎన్నో పుస్తకాలు రాశారు. సీఐఏ సాగించిన ఆపరేషన్లు ఇతివృత్తంగా 30కి పైగా చలనచిత్రాలొ చ్చాయి. టీవీ సీరియల్స్‌ కూడా తక్కువేం కాదు.

చిత్రమేమంటే ఈమధ్య కొత్తగా వెలుగులోకొచ్చిన సీఐఏ ఫైళ్ల ఆధారంగా ‘ది లుముంబా ప్లాట్‌’ అనే పేరుతో అప్పటి కాంగో ప్రధాని పాట్రిస్‌ లుముంబాను 1961లో హతమార్చిన తీరుపై స్టువార్ట్‌ ఏ. రీడ్‌ అనే ఆయన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అలాంటి అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉద్యమకారుణ్ణి హతమార్చటానికి జరిగిన కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం వున్నదని అమెరికా ఆరోపిస్తోంది. మొన్న జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించిన తర్వాత ఈ కుట్ర గురించి మన ప్రభుత్వాన్ని అమెరికా హెచ్చరించిందని నవంబర్‌ 22న బ్రిటన్‌కు చెందిన ‘ద ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వెల్లడించింది.

బుధవారం న్యూయార్క్‌ సిటీ కోర్టులో ప్రభుత్వ అటార్నీ విలియన్స్‌ 15 పేజీల అభియోగపత్రాన్ని కూడా దాఖలు చేశారు. అందులో ఈ కుట్ర లక్ష్యం ఎవరన్న పేరు ప్రస్తావించికపోయినా సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నాయకుడు పత్వంత్‌సింగ్‌ పన్నూన్‌ అని అక్కడి మీడియా అంటున్నది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సైతం ఇటువంటి ఆరోపణే చేశారు. అక్కడ దుండగుల కాల్పుల్లో మరణించిన ఖలిస్తాన్‌ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ పాత్ర వున్నదని ఆయన అభియోగం.

ఇందుకు సంబంధించి మన దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. నిరాధారమైన ఆరోపణ చేయడాన్ని మన దేశం తప్పుబట్టి ప్రతీకారంగా ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోమని కెనడాను కోరింది. ఆ అంకం ముగియకుండానే తాజాగా అమెరికా సైతం ఆ మాదిరి ఆరోపణే చేయటం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

సాధారణంగా మిత్ర దేశాలమధ్య ఈ తరహా పొరపొచ్చాలు రావు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో మనం సోవియెట్‌ యూనియన్‌తో సన్నిహితంగా వుండటాన్ని జీర్ణించుకోలేక అమెరికా పాకిస్తాన్‌కు అండదండలందించేది. ప్రపంచీకరణ తర్వాత అంతా మారింది. ఇప్పుడు మనకు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా వున్నాయి.ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు భారత్‌ సహాయసహకారాలు అవసరమని అమెరికా విశ్వసిస్తోంది. తన ఆరోపణను నిర్ద్వంద్వంగా రుజువుచేసే సాక్ష్యాధారాలు అమెరికా దగ్గరున్నాయా?  భారత ప్రభుత్వ అధికారి ఒకరు నిఖిల్‌ గుప్తా అనే భారత పౌరుడి ద్వారా ఒక కిరాయి హంతకుణ్ణి వినియోగించి పన్నూన్‌ను హతమార్చటానికి కుట్ర చేశారని అటార్నీ దాఖలు చేసిన అభియోగపత్రం చెబుతోంది.

అయితే నిఖిల్‌ గుప్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక సంస్థ తాలూకు ఏజెంట్‌ను కిరాయి హంతకుడిగా పొరబడి పన్నూన్‌ హత్యకు లక్షన్నర డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అడ్వాన్స్‌గా 15,000 డాలర్లు అంద జేశాడని అటార్నీ ఆరోపణ. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అభియోగపత్రానికి జత చేశారు.

ఈ హత్య చేయించగలిగితే అతనిపై గుజరాత్‌లో వున్న క్రిమినల్‌ కేసును రద్దు చేయిస్తానని భారత అధికారి వాగ్దానం చేశారని ఎఫ్‌బీఐ చెబుతోంది. మాదకద్రవ్యాలు, మారణాయుధాల విక్రయం కేసులో నిందితుడైన నిఖిల్‌ గుప్తా చెక్‌ రిపబ్లిక్‌కు వెళ్లిన సమయంలో అతన్ని అరెస్టు చేయాలంటూ ఎఫ్‌బీఐ కోరటంతో మొన్న జూన్‌ 30న అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకుని అమెరికాకు అప్పజెప్పారు. కెనడాలో జరిగిన నిజ్జార్‌ హత్యలో తమ హస్తమున్నదని గుప్తా ఎఫ్‌బీఐ ఏజెంట్‌ దగ్గర అంగీకరించాడంటున్నారు. 

ఖలిస్తాన్‌పై రిఫరెండమ్‌ జరగాలని పత్వంత్‌ సింగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఆయనకు అమెరికా, కెనడా పౌరసత్వాలున్నాయి. ఖలిస్తాన్‌ వాదాన్ని మన ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. 80, 90 దశకాల్లో ఖలిస్తాన్‌ పేరిట పంజాబ్‌లో ఉగ్రవాదులు సాగించిన మారణకాండను కఠినంగా అణి చేసింది. 1985 జూన్‌ 23న 329మంది ప్రయాణికులతో కెనడానుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చివేశారు. ఆ విషయంలో కెనడా ప్రభుత్వం భారత్‌కు ఎలాంటి సహకారమూ అందించలేదు సరిగదా...కీలకమైన సాక్ష్యాధారాలను పోలీసులు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలొచ్చాయి.

ఈనాటికీ ఈ కేసు అతీగతీ లేకుండాపోయింది. అమెరికా చేసిన ఆరోపణలపై మన దేశం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. అది అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిఖిల్‌ గుప్తాతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి నిజంగానే ప్రభుత్వాధికారా? అధికారే అయితే అత్యుత్సాహంతో అతను పరిధి దాటి ప్రవర్తించాడా? వేరే దేశాల్లో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం తమ విధానం కాదని నిజ్జార్‌ కేసు సందర్భంగా మన దేశం చెప్పింది.

పైగా పకడ్బందీ వ్యవస్థలు అమల్లోవున్న అమెరికాలో అలాంటి పనికి ఎవరైనా సాహసిస్తారా అన్నది సందేహాస్పదం. పంజాబ్‌లో కనుమరుగైన ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని మన దేశం ఇంత సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది కూడా అనుమానమే. అమెరికా దగ్గరున్న సాక్ష్యాలు నిజంగా అంత బలంగా వున్నాయా, వుంటే దీన్ని తెగేదాకా లాగుతుందా అన్నది చూడాలి. ఈ కేసు సంగతెలావున్నా మన ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మాదిరి ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement