ఈ ప్రపంచంలో మూడింటిని దాచిపెట్టడం అసాధ్యమని బుద్ధుడు చెబుతాడు. అవి–సూర్యుడు, చంద్రుడు, సత్యం! ఏ దేశమైనా అంతర్జాతీయంగా తనవారెవరో, కానివారెవరో తెలుసుకోవటానికి నిత్యం ప్రయత్నిస్తుంటుంది. ఎలాంటి వ్యూహాలు పన్నాలో, ఏ ఎత్తుగడలతో స్వీయప్రయోజనాలు కాపాడుకోవాలో అంచనా వేసుకుంటుంది. అందుకు తన వేగుల్ని ఉపయోగిస్తుంది. పరస్పర దౌత్య మర్యాదలకు భంగం లేకుండా చాపకింద నీరులా ఈ పని సాగిపోతుంటుంది. ఈ విషయంలో అమె రికాది అందె వేసిన చేయి.
నిఘా నిజమైనప్పుడు అది ఎన్నాళ్లు దాగుతుంది? తాజాగా బజారున పడిన అత్యంత రహస్యమైన పత్రాలు అమెరికాను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేశాయి. శత్రువులు సరే...దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లాంటి దేశాలు సైతం తమపై అమెరికా నిఘా పెట్టిందన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక దాని ప్రధాన ప్రత్యర్థి రష్యా గురించి చెప్పేదేముంది? ఆ దేశ రక్షణశాఖలోకి అమెరికా నిఘా విభాగం ఎలా చొచ్చుకుపోయిందో ప్రస్తుతం వెల్లడైన రహస్యపత్రాలు తెలియజెబుతున్నాయి.
అలా సేకరించిన సమాచారం ఆధారంగా ఉక్రెయి న్‌కు సలహాలిస్తూ రష్యాపై దాని యుద్ధవ్యూహాలను పదునెక్కిస్తున్న వైనం బయట పడింది. ఉక్రె యిన్ వ్యూహాలపై, అది తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాకు ఎలాంటి అభి ప్రాయాలున్నాయో ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యాకు వరస అపజయాలు ఎదురయ్యాయి. గతంలో స్వాధీనమైన నగరాల నుంచి అది తప్పుకోక తప్పనిస్థితి ఏర్పడింది. వీటన్నిటి వెనుక అమెరికా మార్గదర్శకం ఉన్నదని పత్రాలు చెబుతున్నాయి.
ఇవన్నీ నకిలీ పత్రాలని ఉక్రెయిన్ సైని కాధికారులు దబాయిస్తున్నా పెంటగాన్ మాత్రం ఆ పని చేయలేకపోతోంది. ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతంపై ఏ రోజున ఎన్ని గంటలకు రష్యా సైన్యం దాడి చేయదల్చుకున్నదో అమెరికా నిఘా సంస్థ ఎప్పటికప్పుడు ఆ దేశాన్ని హెచ్చరించిన వైనాన్ని ఈ పత్రాలు బయటపెట్టాయి. అయితే సందట్లో సడేమియాలా లీకైన ఈ పత్రాల్లో ఫొటోషాప్ ద్వారా తనకు అనుకూలమైన మార్పులు చేర్పులూ చేసి ప్రత్యర్థులను గందరగోళపరచడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ఎవరి ప్రయోజనం వారిది!
సరిగ్గా పదమూడేళ్లక్రితం జూలియన్ అసాంజ్ వికీలీక్స్ ద్వారా అమెరికాకు సంబంధించిన లక్షలాది కీలకపత్రాలు వెల్లడించాడు. ఆ తర్వాత సైతం ఆ సంస్థ అడపా దడపా రహస్య పత్రాలు వెల్లడిస్తూ అమెరికాకు దడపుట్టిస్తోంది. తాజా లీక్‌లు ఎవరి పుణ్యమో ఇంకా తేలాల్సివుంది. సాధా రణ పరిస్థితుల్లో ఇలాంటి లీక్‌లు పెద్దగా సమస్యలు సృష్టించవు. గతంలో అసాంజ్ బయటపెట్టిన పత్రాలు అంతక్రితం నాలుగైదేళ్లనాటివి. అవి గతించిన కాలానివి కనుక నిఘా బారిన పడిన దేశం చడీచప్పుడూ లేకుండా తన వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసుకుంటుంది.
ఆ పత్రాల్లో ప్రస్తావనకొచ్చిన ఉదంతాల తీవ్రత కూడా చల్లబడుతుంది. కానీ ఈ పత్రాలు ఇటీవల కాలానివి. కేవలం 40 రోజులనాటివి. ఉక్రెయిన్ ఇంకా రష్యాతో పోరు సాగిస్తూనే ఉంది. సైన్యం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అది తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలూ, అందుకోసం అనుసరిస్తున్న వ్యూహాలూ ఇంత వెనువెంటనే బట్టబయలు కావటం దాన్ని దెబ్బతీస్తాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా వైమానిక యుద్ధంలో ఉక్రెయిన్ బలహీనంగా ఉన్న వైనం బయటపడటం ఆ దేశానికి ముప్పు కలిగించేదే.
అమెరికా నిఘా సంస్థ సీఐఏ పనితీరు కూడా ఈ పత్రాల ద్వారా బయటపడింది. రష్యా రక్షణ శాఖలోని ముఖ్యవ్యక్తుల ఫోన్ సంభాషణలు ఆ సంస్థ వేగులు వింటున్నారని, వారి మధ్య బట్వాటా అయ్యే సందేశాలు సంగ్రహిస్తున్నారని, వీటి ఆధారంగానే దాని రోజువారీ నివేదికలు రూపొందుతున్నాయని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి. అయితే ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగుతున్న యుద్ధంలో పెద్దగా పైచేయి సాధించలేకపోయిన రష్యాకూ ఈ లీక్‌లు తోడ్పడతాయి.
ఉక్రెయిన్ విజయం సాధించటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో, ఇందులో తమ వైపు జరుగుతున్న లోపాలేమిటో తెలి యటం వల్ల రష్యా తన వ్యూహాలను మార్చుకోవటం సులభమవుతుంది. అంతేకాదు...తన రక్షణ వ్యవస్థలోని ఏయే విభాగాల్లో అమెరికా నిఘా నేత్రాలు చొరబడ్డాయో ఈ లీక్‌లద్వారా గ్రహించి సొంతింటిని చక్కదిద్దుకునేందుకు రష్యాకు అవకాశం దొరికింది. అయితే అదే సమయంలో తల్చుకుంటే ప్రత్యర్థి శిబిరంలోకి అమెరికా ఎంత చురుగ్గా చొచ్చుకు పోగలదో, ఎలాంటి కీలక సమాచారం సేకరించగలదో ఈ వ్యవహారం తేటతెల్లం చేసింది.
దాని సంగతెలావున్నా ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహూ తలపెట్టిన న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా పెల్లుబికిన ఉద్యమం వెనుక ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ హస్తమున్నదని అమెరికా అంచనా కొచ్చిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అభిప్రాయం తప్పని ఇజ్రాయెల్ చెబుతున్నా నిజమేమిటో మున్ముందు బయటపడక తప్పదు.
కానీ నిఘాలో ఇంతటి చాకచక్యాన్ని ప్రదర్శించే అమెరికాను సైతం బోల్తా కొట్టించగల అరివీర భయంకరులున్నారని తాజా లీకులు చెప్పకనే చెబుతున్నాయి. ఇవి ఎక్కడినుంచో కాదు...సాక్షాత్తూ పెంటగాన్ కార్యాలయం నుంచే బయటికొచ్చాయని పత్రాల్లోని సమాచారం చూస్తే అర్థమవుతుంది.
ఇతర దేశాలపై నిఘా మాట అటుంచి స్వగృహ ప్రక్షాళనకు నడుం కట్టకతప్పదని అమెరికాను తాజా లీకులు హెచ్చరిస్తున్నాయి. అభిప్రాయాలు, అంచనాలు ఏవైనా...మస్తిష్కంలో ఉన్నంత వరకే వాటికి రక్షణ. అవి రహస్యపత్రాలుగా అవతారమెత్తిన మరుక్షణం ఎక్కడెక్కడికి ఎగురుకుంటూ పోతాయో చెప్పటం అసాధ్యమని తాజా వ్యవహారం తేటతెల్లం చేస్తోంది. అగ్రరాజ్యం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకతప్పదు.
లీకుల సుడిగుండంలో అమెరికా
Published Tue, Apr 11 2023 1:04 AM | Last Updated on Tue, Apr 11 2023 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment