అప్రమత్తంగా ఉండటం వేరు. భయపడుతూ బతుకీడ్వడం వేరు. అప్రమత్తంగా ఉండేవారు తమకూ, తమ చుట్టూ ఉండేవారికీ ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకోగలుగుతారు. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడగలుగుతారు. నిత్యం భీతిల్లేవారు తమకే కాదు...చుట్టూ ఉన్నవారికీ ముప్పు కలిగిస్తారు. పాశ్చాత్య సమాజం ఈ రెండిటికీ మధ్య ఉండే తేడాను గుర్తించలేని దిశగా పయనిస్తున్నదని ఇటీవల అమెరికా, బ్రిటన్‌లలో జరిగిన రెండు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. తొలి ఉదంతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఇర్వింగ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహమ్మద్‌కు సంబంధించింది.
ఆ కుర్రవాడు చదువులో చురుకు. రేడియోలనూ, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బాగుచేయడం, సొంతంగా రూపొందించడం అతని హాబీ. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ లక్షణాలు అతణ్ణి అందరిలోనూ మెరిపించేవి. స్కూల్‌లో అతడి పేరు మార్మోగేది. పిల్లలందరికీ అతనొక రోల్ మోడల్ అయ్యేవాడు. కానీ జరిగింది వేరు. సొంతంగా తయారుచేసి పాఠశాలకు పట్టుకెళ్లిన గడియారాన్ని చూసి టీచర్లంతా బెంబేలెత్తారు. అతన్నో ఉగ్రవాదిగా అనుమానించారు. వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి పట్టించారు. ‘సెలవిచ్చాం పొమ్మ’ని మిగిలిన పిల్లలందరినీ పంపేశారు.
అంతేకాదు...ఇకపై చదువుకునే పుస్తకాలు, అందుకోసం అవసరమయ్యే కంపాస్ బాక్స్, కాలిక్యులేటర్ వంటివి తప్ప విద్యార్థుల దగ్గర అంతకు మించి ఏమున్నా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తల్లిదండ్రులందరికీ లేఖలు పంపారు. తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించామని టీచర్లు భుజాలు చరుచుకోగా, పోలీసులు కూడా తమ పని తాము చేశారు. ఆ కుర్రవాడి చేతులు వెనక్కి విరిచి సంకెళ్లు వేశారు. జువెనైల్ హోంకు తీసుకుపోయి అయిదుగంటలపాటు ప్రశ్నించారు. బాంబు తయారు చేయడం కోసమే ముందుగా గడియారాన్ని రూపొందించాడని నిర్ణయానికొచ్చారు. ఈ విషయంలో సంతృప్తికరంగా అతను జవాబులివ్వలేకపోయాడని నిర్ధారించుకున్నారు. నేరస్తుడి దగ్గరనుంచి సేకరించినట్టు అరచేతి ముద్రలు మొదలుకొని అన్ని లాంఛనాలూ పూర్తిచేశారు.
చివరకు ఇంటికెళ్లడానికి అనుమతించారుగానీ కేసు మాత్రం కొనసాగింది. ఇదంతా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకొచ్చి మహమ్మద్‌కు ప్రశంసలూ... పోలీసులకు హేళనలూ వెల్లువెత్తాక కేసు కథ ముగిసింది. బ్రిటన్ ఉదంతం ఇంతకన్నా ఘోరమైనది. పర్యావరణంపై తరగతిలో పాఠం చెబుతుండగా జరుగున్న చర్చలో ఒక విద్యార్థి నోట ‘ఇకో టైస్టు’(పర్యావరణ ఉగ్రవాది) అనే పదం వినబడేసరికల్లా టీచర్ కంగారుపడి పోలీసుల్ని పిలిపించాడు. వారొచ్చి ఆ కుర్రవాణ్ణి వేరే గదికి తీసుకెళ్లి అయిదారు గంటలు ప్రశ్నించారట. ‘ఆ పదం ఎలా తెలుసు...ఎక్కడ విన్నావు...ఎవరు ఉపయోగించారు’ అని గుచ్చి గుచ్చి అడిగారట. చివరకు ఐఎస్ ఉగ్రవాదుల గురించి తెలుసా అని అడిగాక గానీ తనను ఇంతవరకూ వారు ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నారో అతని అర్థం కాలేదట. అర్థమయ్యాక భయంతో వణికిపోయానని అతను చెబుతున్నాడు.
ఇలా ఉగ్రవాదులని అనుమానం వచ్చిన పిల్లలిద్దరూ ముస్లింలు కావడం యాదృచ్ఛికం కాదు. అమెరికాలోనైనా, బ్రిటన్‌లోనైనా ముస్లింలు కావడం, వారిని పోలిన పేర్లుండటం ఇప్పుడు ప్రాణాంతకమవుతున్నది. గెడ్డం కారణంగా సిక్కు యువకులను ముస్లింలనుకుని చావబాదుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఈ అనుమాన పిశాచులకు పిల్లల్ని మినహాయిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా కొరవడుతోంది. తమ నీడను చూసి తామే జడుసుకునే స్థితికి ఆ సమాజాలు చేరువవుతున్నాయి. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంకూ, నటులు షారుఖ్ ఖాన్, కమల్ హాసన్‌లకూ ఆ గడ్డపై పరాభవం ఎదురైంది కేవలం వారి పేర్ల వల్లనే. పద్నాలుగేళ్లక్రితం అమెరికా గడ్డపై అల్ కాయిదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను ఢీకొట్టించి దాదాపు 3,000మంది మృతికి కారకులయ్యారు.
అలాంటి దాడులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం అవసరమే. అయితే ఆ క్రమంలో చస్తూ బతికే పరిస్థితులను కల్పించుకోకూడదు. ఏ చిన్న వస్తువును చూసినా భయంతో వణకడం... పసి పిల్లల్ని చూసినా భీతిల్లి గుండె పగలడం దేనికి సంకేతం? ఆనాటి ఉగ్రవాద ఘటనకు బాధ్యులైనవారు ముస్లింలైనంత మాత్రాన ఆ మతానికి చెందినవారందరినీ అనుమానించడం సరైందేనా? అలాగైతే ఈ పద్నాలుగేళ్లలో అమెరికా, బ్రిటన్‌లు ఇరాక్, అఫ్ఘాన్, లిబియా, సోమాలియా, సూడాన్ తదితర దేశాల్లో సృష్టించిన విధ్వంసం ఎంత? ఎన్ని లక్షలమంది ప్రాణాలు అందులో ఆహుతైపోయాయి? ఆ రెండు దేశాలూ, వాటితో అంటకాగిన ఇతర దేశాలూ సంజాయిషీ ఇచ్చుకోవాలి.
ఇప్పుడు అమెరికాలో ఉగ్రవాద అనుమానితుడిగా వేధింపులకు గురైన కుర్రవాడికి దేశాధ్యక్షుడు ఒబామా మొదలుకొని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వరకూ ప్రముఖుల ఊరడింపులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎంఐటీ వంటి అత్యున్నత శ్రేణి విద్యా సంస్థ, సామాజిక మాధ్యమం ట్విటర్ ఎర్ర తివాచీ పరిచి అతణ్ణి ఆహ్వానిస్తున్నాయి. మంచిదే! ఒక పసివాడి పట్ల జరిగిన అపచారాన్ని సరిదిద్దడానికి, గాయపడిన ఆ లేత హృదయాన్ని సాంత్వనపరచడానికి ఇంతమంది పెద్దలు ముందుకు రావడం, స్పందించడం హర్షించదగిందే.
కానీ తమ సమాజాలు ఎందుకిలా చిగురుటాకుల్లా వణుకుతున్నాయో... ఎందుకని జాత్యహంకారమూ, మత అసహనమూ ఇలా వెర్రితలలు వేస్తున్నాయో కూడా వారు ఆలోచించాలి. ఏ విత్తనాలు ఇలా విషవృక్షాలుగా ఎదిగి శాఖోపశాఖలై విస్తరించి సమాజ మనుగడకే ప్రమాదకరంగా మారాయో ఆచూకీ తీయాలి. వాటిని కూకటి వేళ్లతో పెకిలించ డానికి తామేం చేయాలో తెలుసుకోవాలి. అప్పుడు సామాజిక మాధ్యమా లకెక్కకుండా నిత్యం బలవుతున్న వేలాదిమంది మహమ్మద్‌లు సురక్షితంగా, ప్రశాంతంగా బతకగలుగుతారు.
భయమే అసలు శత్రువు
Published Sat, Sep 26 2015 1:10 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
Advertisement