అమెరికా ఒత్తిళ్లు | G 20 Summit Start In Osaka | Sakshi
Sakshi News home page

అమెరికా ఒత్తిళ్లు

Published Sat, Jun 29 2019 12:47 AM | Last Updated on Sat, Jun 29 2019 12:47 AM

G 20 Summit Start In Osaka - Sakshi

తమ సరుకులపై భారత్‌ సుంకాలు టారిఫ్‌లు సమ్మతం కాదని, వాటిని ఉపసంహరించుకు తీరాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీటర్‌ ద్వారా హెచ్చరించిన 24 గంటల తర్వాత జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ–20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఎటూ మోదీతో ఒసాకాలో భేటీ ఉంది కదా అని ఆయన మౌనంగా ఉండలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరు అధినేతలూ సమావేశమయ్యారు. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడాన్ని, ఆయన పార్టీ సాధించిన విజయాన్ని ట్రంప్‌ కీర్తించారు. ఇలాంటివి దౌత్య మర్యాదల్లో భాగం. కీలకమైన, సమస్యాత్మక అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ఇరుపక్షాలూ ఎంతవరకూ ప్రదర్శి స్తాయన్నది ముఖ్యం. సమస్యల విషయంలో ట్రంప్‌ తీరుతెన్నులెలా ఉంటాయో ఎవరికీ తెలియ నిది కాదు. తన అభిప్రాయాలను సవరించుకోవడానికీ, అవతలి పక్షం మనోభావాలు తెలుసు కోవడానికీ ఆయన పెద్దగా ప్రయత్నించరు. మోదీ అఖండ విజయం సాధించి రెండో దఫా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారు. కానీ ట్రంప్‌కు వచ్చే ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలున్నాయి. అందులో విజయం సాధించడం ఆయనకు ముఖ్యం. అంతకన్నా ముందు అందుకు పార్టీ అభ్యర్థిత్వాన్ని సాధించడం ప్రధానం. 2016నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి ఓటర్లకు ఆయన చాలా వాగ్దానాలిచ్చారు. విదేశాలకు తరలిపోతున్న ఉపాధిని సరిహద్దులు దాటనీయనని ఊరించారు. వలసల వల్ల అట్టడుగు శ్వేతజాతీయుల ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి గనుక... కఠిన నిబంధనలతో వలసలను అరికడతామని చెప్పారు. మన ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాలు అమెరికా ‘మెతకవైఖరి’ని ఆసరా చేసుకుని ఇక్కడ తక్కువ టారిఫ్‌లతో లాభాలు గడిస్తున్నాయని ఆరోపించారు. వాణిజ్యపరంగా ఉన్న ఈ అసమతుల్యతను సరిచేస్తానని వాగ్దానం చేశారు. ‘అమెరికాను గొప్పగా చేద్దామ’న్న నినాదంతో క్రితంసారి విజయం సాధించిన ట్రంప్‌ ఇప్పుడు ‘మరోసారి అమెరికాను గొప్పగా చేద్దామ’ంటూ నినదిస్తున్నారు. 


వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గాలంటే ఇవన్నీ చేసినట్టు కనబడటమే కాదు...వాటి ఫలితం కళ్లముందుండేలా చూడాలి. అందుకే ప్రపంచ దేశాలను ఆయన వివిధ మార్గాల్లో బెదిరిస్తున్నారు. హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌లపై విధిస్తున్న వందశాతం సుంకాలు తగ్గించమని మన దేశంపై ఒత్తిళ్తు తెచ్చారు. వాటిని సగానికి తగ్గించినా ఆయనకు సంతృప్తి లేదు. మరింతగా తగ్గించాలంటున్నారు. మనకు అయిదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) వెసు లుబాటును ఈనెల మొదటివారం నుంచి రద్దుచేశారు. దానికి ప్రతిగా మన దేశం కూడా 28 రకాల అమెరికా సరుకులపై అదనపు సుంకాలు విధిస్తే వాటిని ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే 5జీ స్పెక్ట్రమ్‌ విషయంలో తమకు దీటైన పోటీనిస్తున్న చైనా టెలికాం సంస్థ హువీని కాక తమ సంస్థలనే ఆదరించాలంటున్నారు. హెచ్‌–1బీ వీసా జారీ నిబంధనలను కఠినం చేయడం మన దేశానికి తలనొప్పిగా మారింది. ఈ–కామర్స్‌ విషయంలో మన ప్రభుత్వ వైఖరిని ట్రంప్‌ తప్పుపడుతున్నారు. ఇరాన్‌తో అమెరికాకూ, మరో ఆరు దేశాలకూ 2015లో కుదిరిన అణు ఒప్పందంనుంచి బయటికొచ్చి ఏ దేశమూ దాంతో లావాదేవీలు సాగించకూడదని ఆంక్షలు విధించారు. కొన్ని ఇతర దేశాలతోపాటు మనకు కూడా గత నెల 2 వరకూ ఇరాన్‌ చమురు కొను గోలుకు అనుమతినిచ్చారు. ట్రంప్‌ అభీష్టం మేరకు మన దేశం ఇరాన్‌ నుంచి చమురు కొను గోలును నిలిపివేసింది. ఇలా ప్రపంచ దేశాలన్నిటిపైనా ఒత్తిళ్లు తెచ్చి ఏదోరకంగా దేశానికి లబ్ధి చేకూర్చి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అయితే అందుకోసం ఆయన అనుసరించే విధానాల వల్ల వేరే దేశాలతోపాటు మనకూ సమస్యలు ఎదురవుతున్నాయి. రష్యా రూపొందించిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఎస్‌–400 కొనుగోలుకు ఆ దేశంతో మనం కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా గుర్రుగా ఉంది. దాన్ని రద్దు చేసుకోవాలని కోరుతోంది. తమ మాట వినకపోతే మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది. 

ఇలా ఇరు దేశాలమధ్యా ఉన్న ఈ విభేదాలు ఒకటి రెండు సమావేశాలతో ముగిసిపోవు. అందుకు సమయం పడుతుంది. వాణిజ్య రంగంలో తలెత్తిన విభేదాలపై ఇంతవరకూ ఇరు దేశాల వాణిజ్యమంత్రుల మధ్యా చర్చలు జరగలేదు. రక్షణ కొనుగోళ్లు, భద్రత వగైరా అంశాలపై పాంపియో మన విదేశాంగ మంత్రితో చర్చించిన అంశాలు మోదీ, ట్రంప్‌ సమావేశంలో కూడా చర్చకొచ్చే ఉంటాయి. రష్యాతో ఎస్‌–440 ఒప్పందం కుదుర్చుకున్న కారణంతో మన దేశాన్ని దూరం చేసుకోవాలనుకుంటే అధికంగా నష్టపోయేది అమెరికాయే. వందలకోట్ల విలువ చేసే అపాచే సైనిక హెలికాప్టర్లు, శత్రువును వేటాడటానికి ఉపయోగపడే గార్డియన్‌ ద్రోన్‌ల కొను గోలుకు ఇప్పటికే మన దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మన సహకారాన్ని తీసుకుంటేనే చైనాకు చెక్‌ పెట్టడం సాధ్యమవుతుందన్న సంగతి దానికి తెలుసు. వీటిద్వారా నెరవేరే ప్రయోజనాలను వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. కనుక ఒక స్థాయికి మించి అది ఒత్తిళ్లు తీసుకురావడం అసాధ్యం. జీ–20 సంస్థలో సభ్యత్వమున్న బ్రిక్స్‌(బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణాఫ్రికా) దేశాలు శుక్రవారం విడిగా సమావేశమయ్యాక విడు దల చేసిన సంయుక్త ప్రకటనను  ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధంగా ఆత్మరక్షణ విధానాలు అవలంబించే ధోరణులను ఆ సమా వేశం నిరసించింది. వాణిజ్యమనేది పారదర్శకంగా, వివక్షారహితంగాఉండాలని కోరింది. ఇదంతా అమెరికాను ఉద్దేశించిందే. ఏతావాతా వర్తమాన పరిస్థితుల్లో ఏ దేశమూ మరో దేశాన్ని శాసించ లేదు. ఆచితూచి అడుగులేస్తే మన ప్రయోజనాలను పరిరక్షించుకోవడం అసాధ్యం కాదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement