
అమరగాన స్మరణ
మూడు తరాల పాటు తెలుగుదేశంలోని ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింపచేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. చందమామకు చల్లదనం నేర్పినా, తేటతెలుగుకు తియ్య దనం అందించినా అది అయనకే చెల్లించిం దనటం అతిశయోక్తి కాదు. జన్మతః కాకున్నా అభ్యాసగతంగా తండ్రినుంచి గురువునుంచి ఆయన నేర్చుకున్న సంగీత జ్ఞానం తెలుగు లలిత సంగీతానికి, చలనచిత్ర సంగీతానికి ప్రాణప్రతిష్ట పోసింది. ఆ గళ గంధర్వహేల ప్రతి తెలుగువారి మదిలో నిలిచింది.
తెలుగుపాట, పద్యం ఉన్నంత వరకు ప్రతి ఇంటా, ప్రతి నిమిషం ఆయన గొంతు మారుమోగుతూనే ఉంటుంది. ఘంటారావంలా ఖంగున మ్రోగే కంచుకంఠంతో ప్రపంచ తెలుగు శ్రోతల్ని ముగ్ధులను గావించిన గానగంధర్వుడు ఘంటసాల. మానవుడే మహనీయుడన్న సుభాషి తానికి ప్రత్యక్ష సాక్షిగా, పాటతో సాగిన గానధీమం తుడాయన. భగవద్గీతని, భారతజాతికి అపూర్వ మైన వరంగా వదిలి వెడలిన భక్త శిఖామణి. వెండివెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలీ అంటూ తీయని పాటలు పాడుతూ తెలుగు స్వరకీర్తిని అజరా మరం చేసిన విశిష్టగాయకుడు.
అందుకే పరమపదించి నాలుగు దశాబ్దాలు దాటినా బహుదూరపు బాటసారీ ఇటు రావో ఒక్కసారీ అంటూ ఆయనను తెలుగు జాతి స్మరించుకుంటూనే ఉంది. తెలుగు సినిమా పాటల కు అర్ధశతాబ్దంపాటు గాత్రదానం చేసిన తొలి తరం నేపథ్య గాయకులలో ప్రముఖుడు. మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని నేపథ్యగాన చరిత్ర లో చెరిగిపోని సంతకంలా రూపొందించి తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారు. పాటను, పద్యాన్ని హిమవన్నగ శిఖరాలపై నిలిపిన ఆ గాన విశారదుడికి నిండు నీరాజనాలు.
(నేడు ఘంటసాల వెంకటేశ్వరరావు 41వ వర్థంతి)
-డా. సయ్యద్ రహంతుల్లా అపోలో, సికింద్రాబాద్
-ఎం లక్ష్మయ్య హైదరాబాద్