వరదల్లో చిక్కుకున్న ముంబై మహానగరం (ఫైల్ ఫొటో)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరం వరసగా పదిరోజులపాటు కురిసిన వర్షాలతో నీట ముని గింది. ముఖ్యంగా చివరి నాలుగురోజులూ కుంభవృష్టి కురిసింది. బుధవారం కాస్త తెరిపి ఇవ్వడంతో పరిస్థితి కొద్దిగా కుదుటపడింది. గత నాలుగురోజులుగా రైలు, రోడ్డు మార్గాల్లో మూడు నుంచి అయి దడుగుల నీరు నిలిచి రవాణా స్తంభించిపోగా రన్‌వేపై నీళ్లు చేరడంతో విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. ఏటా వర్షాకాలం వచ్చేసరికి ఒక్క ముంబై మాత్రమే కాదు... దేశంలో ఏ నగరం పరిస్థితి అయినా ఇలాగే ఉంటోంది. నైరుతి రుతుపవనాల తీరు చాన్నాళ్లుగా మారిపోయింది.
అయితే అతివృష్టి లేదా అనావృష్టి తప్ప సాధారణ వర్షపాతం అనే మాటే ఉండటం లేదు. వర్షాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వంద మిల్లీ మీటర్ల వర్షం కురుస్తుంటే మరికొన్నిచోట్ల చినుకు జాడే కనబడదు. ముంబైలో గత పది రోజుల్లో 864.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదంతా నెలరోజుల్లో పడే వర్షంతో సమానమని వాతావరణ విభాగం చెబుతోంది. ఏడాది మొత్తం కురిసే వర్షంలో 60 శాతం ఇప్పటికే పడిందని ఆ విభాగం అంటున్నది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి వీలుగా చాలా ముందుగానే అవ సరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ప్రభుత్వాలకుండాలి. అది లేకపోబట్టే జనజీవనం అస్త వ్యస్థమవుతోంది.
నగరాల్లో కళ్లు చెదిరేలా ఆకాశహర్మ్యాలు నిర్మించాలని, అక్కడికి పెద్ద పెద్ద సంస్థలను ఆహ్వా నించి వాటికి సదుపాయాలు కల్పించి ముమ్మరంగా వ్యాపారం, వాణిజ్యం సాగేలా చూడాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. కానీ ఆ సంస్థలతోపాటే వేలాదిమంది ఉపాధి కోసం అక్కడికొస్తారు. ఫలితంగా నగరాలు నానాటికీ విస్తరిస్తుంటాయి. దానికి తగినట్టుగా పౌర సదుపాయాలు మెరుగు పడవు. ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థ, చెత్త తొలగింపు వగైరా సమస్యలు అపరిష్కృతంగా ఉండి పోతాయి. వాటిని ఎలా సరిదిద్దాలో, అందుకేం చేయాలో మున్సిపల్ అధికారులకుగానీ, ప్రభు త్వంలో ఉన్నవారికిగానీ అర్ధం కాదు. చివరకు పారిశుద్ధ్యం సరిగాలేక అంటువ్యాధులు ప్రబలడం రివాజుగా మారుతోంది.
నగరాలను కాంక్రీటు కీకారణ్యాలుగా మార్చడమే అభివృద్ధి అని విశ్వసించే పాలకుల వల్లే ఈ సమస్య వస్తోంది. కురిసిన వర్షపు నీరు ఎటూపోయే దారిలేక రహదారులు, వాటికి అటూ ఇటూ ఉండే భవనాలు మునుగుతున్నాయి. మురుగునీటి వ్యవస్థ ఆసరాతోనే కురిసిన వర్షపు నీటినంతటినీ వెళ్లగొట్టవచ్చునన్న తప్పుడు అవగాహన దీనికి దారితీస్తోంది. ముంబైలో ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా గోరెగావ్, చెంబూర్, దాదర్ వగైరాలన్నీ నీటమునుగుతుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో కొత్తగా ఏర్పాటైన వాసై, విరార్ వంటి శివారు పట్టణాలు కూడా భారీవర్షాలు కురిసి నప్పుడు మహానదుల్ని తలపిస్తున్నాయి.
కాస్త దృష్టి పెడితే నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో వరద నీరు తరచుగా నిలిచిపోతున్నదో గుర్తించడం పెద్ద కష్టం కాదు. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ నీరు పోవడానికి అనువైన కాల్వల నిర్మాణం ప్రారంభిస్తే సమస్యే తలెత్తదు. అలా చేయాలని సంకల్పించిన చోట సైతం డిజైన్ల రూపకల్పనలో, టెండర్ల ఖరారులో, నిధుల మంజూరులో ఎడతెగని జాప్యం చోటు చేసుకోవటం వల్ల పురోగతి ఉండటం లేదు. ముంబైలో 8 పంపింగ్ కేంద్రాలను నిర్మించాలని, వందేళ్ల నాటి పైప్‌లైన్లను మార్చడానికి 58 ప్రాజెక్టుల్ని చేపట్టాలని 2005లో నిర్ణయించారు.
పదమూడేళ్ల తర్వాత చూస్తే ఇప్పటికి అందులో సగం కన్నా తక్కువే పూర్తయ్యాయి. ముంబై మహానగరాన్ని అధ్య యనం చేసిన ముంబై ఐఐటీ, గాంధీనగర్ ఐఐటీ బృందాలు ఆ నగరానికి ఇప్పుడున్న డ్రెయినేజీ వ్యవస్థ ఏమాత్రం సరిపోదని తేల్చిచెప్పాయి. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్న పర్య వసానంగా తరచు భారీ వర్షాలు కురుస్తున్నందున, నగర జనాభా దాదాపు రెండున్నర కోట్లకు చేరు కోవడంవల్లా తాజాగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని నిరుడు సూచించాయి. అయినా చర్యలు అంతంతమాత్రమే.
వానాకాలం సమీపిస్తున్నా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదని, ఆ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు విచారించినప్పుడు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనడానికి సంసిద్ధులమై ఉన్నా మని బీఎంసీ గత నెల 21న హామీ ఇచ్చింది. నగరంలో వరద వెల్లువెత్తే 186 ప్రాంతాలను గుర్తిం చామని, అక్కడ చేరే వరదనీటిని తొలగించడానికి అవసరమైన పంపులు ఏర్పాటు చేశామని తెలి పింది. తీరా భారీవర్షాలొచ్చేసరికి నిస్సహాయంగా మిగిలిపోయింది. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
రోడ్లపై చాలాచోట్ల గుంతలు ఏర్పడి ద్విచక్రవాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. వాహనాలు, లోకల్ రైళ్లు నిలిచిపోవడంతో ఇళ్లకు వెళ్లే దారి లేక వేలమంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సెల్‌ఫోన్లు పనిచేయక, విద్యుత్‌లేక, నిత్యావసరాలు దొరక్క సమస్యలు ఎదుర్కొ న్నారు. శతాబ్ది, వడోదర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చిక్కుకుని ఎటూ కదల్లేక ఉండిపోయిన 2,000మంది ప్రయాణికులను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుని పనిచేయడానికి బదులు ఎవరి పరిధులేమిటన్న అంశంలోనే పరస్పరం కలహించుకుంటున్నాయి.
ఫలానాచోట పని తమ పరిధిలోకి రాదని తప్పించుకుంటున్నాయి. చివరకు అన్ని శాఖలూ నిర్లక్ష్యంగా వ్యవహరించి నగరాలను ముంచు తున్నాయి. అంతా జరిగాక ఎవరికి వారు బాధ్యతను అవతలివారిపై నెట్టేస్తున్నారు. ఈ సమన్వయ లేమి వల్ల తలెత్తుతున్న సమస్యలు చూశాకైనా వాటినుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. వచ్చే వర్షాకాలం నాటికైనా ఇటువంటి సమస్యలు పునరావృతం కానీయరాదన్న దృక్పథాన్ని ప్రదర్శించటం లేదు. జనం తిరగబడి నిలదీస్తే తప్ప ఈ దుస్థితి మారదు.
Comments
Please login to add a commentAdd a comment