అందరూ అంచనా వేసినట్టే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ‘వాయిదాల’ పద్ధతిలో సాగుతున్నాయి. జూలై 21నుంచి ఇంతవరకూ మొత్తంమీద పది రోజులు సమావేశాలు జరగ్గా కనీసం ఒక్కరోజైనా సభలు సజావుగా సాగలేదు. సోమవారం ఇది పతాకస్థాయికి చేరుకుంది. ప్లకార్డుల్ని ప్రదర్శించి సభ మధ్యలోకి దూసుకొచ్చిన 25మంది కాంగ్రెస్ ఎంపీలను అయిదురోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. పార్లమెంటు చరిత్రలో ఈ స్థాయిలో సభనుంచి విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు చర్చకొచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌కే చెందిన 18మంది ఎంపీలను నిరుడు ఫిబ్రవరిలో సస్పెండ్‌చేశారు.
పార్లమెంటులో పరస్పరం తలపడుతున్న పక్షాలు కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికిగానీ, అధికారానికిగానీ కొత్త కాదు. కానీ ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని అపార్థం చేసుకున్నంతగా... అర్థం చేసుకున్నట్టు కనబడదు. తాము ఒక డిమాండుతో సభకు వచ్చి, పట్టుబట్టినప్పుడు దాన్ని ఆమోదించడం మినహా అధికారపక్షానికి గత్యంతరం లేదని కాంగ్రెస్ అనుకుంటున్నది. ఆరోపణలు వచ్చినప్పుడు లేదా ఒక సమస్య విషయంలో చర్యకు విపక్షం పట్టుబట్టినప్పుడు మిన్ను విరిగి మీద పడినా అంగీకరించరాదన్నదే తమ వైఖరిగా ఉండాలని అధికార పక్షం భావిస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక అవసరంగా కాక జాతరగా మార్చి... గెలుపే ధ్యేయంగా ఏమైనా చేయడానికి సిద్ధపడి చట్టసభల మెట్లెక్కే రాజకీయ పక్షాలనుంచి ఇంతకు మించిన ఆచరణను ఆశించడం సాధ్యం కాదేమో!
పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి చాలా ముందే ఇరు పక్షాలూ తమ తమ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో తేల్చిచెప్పాయి. లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలొచ్చిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాలు...వ్యాపం, పీడీఎస్ కుంభకోణాల్లో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పైనా చర్యకు పట్టుబడతామని, వారి రాజీనామాలకు మినహా మరి దేనికీ అంగీకరించబోమని కాంగ్రెస్ చెప్పింది. ఆరోపణలొచ్చిన మొదట్లో ఏం చేయాలో పాలుబోనట్టుగా కనబడిన బీజేపీ రాను రాను తన వైఖరిని దృఢపరుచుకుంది.
ఆరునూరైనా ఆరోపణలు వచ్చిన వారందరినీ కాపాడుకోవాల్సిందేనని నిర్ణయించుకుంది. పర్యవసానంగా చర్చకు సిద్ధమని బీజేపీ...చర్యల తర్వాతే చర్చని కాంగ్రెస్ భీష్మించుకుని కూర్చున్నాయి. ఆరోపణలొచ్చినవారిలో ఒక్క చౌహాన్ మినహా మిగిలినవారెవరూ వాటి గురించి మాట్లాడనే లేదు. చౌహాన్ కనీసం బలహీనమైన వాదనైనా చేశారు. అసలు ఆ కుంభకోణాన్ని బయటపెట్టింది తానేనంటూ దబాయించారు. సుష్మా స్వరాజ్ కేవలం మానవతా దృక్పథంతో లలిత్‌మోదీకి మాట సాయం చేశానని ఒక ట్వీట్‌లో క్లుప్తంగా చెప్పడం మినహా ఏ వేదికపైనా దాన్ని గురించి వివరణనివ్వలేదు. పాత్రికేయులు ఒకటి రెండు సందర్భాల్లో ఆమెను నేరుగా ప్రశ్నించినా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. వసుంధర రాజే మధ్యలో ఒకసారి ఢిల్లీకి వచ్చినా పాత్రికేయులను కలవడానికే ఇష్టపడలేదు. ఇంత గొడవ జరిగాక సుష్మా రాజ్యసభలో సోమవారం ఒక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని వివరణనిచ్చారు. లలిత్ మోదీకి తానసలు సాయమే చేయలేదని చెప్పారు. ఈ ప్రకటన చేసిన తీరుపై కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల మాట అటుంచి... ఇన్నాళ్లుగా ఆమె ఎందుకు మౌనవ్రతం పాటించారో, అందుకు కారణలేమిటో సుష్మా చెప్పాల్సి ఉంది. సుష్మా స్వరాజ్ గడిచిన లోక్‌సభలో విపక్ష నేతగా పనిచేశారు. యూపీఏ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలంటూ ఆమె నాయకత్వంలోనే బీజేపీ పట్టుబట్టింది. కొన్ని సందర్భాల్లో ఆ డిమాండును నెరవేర్చుకుంది. అప్పుడు కూడా విలువైన సభా సమయాలు వృథా అయ్యాయి. అదే పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే బీజేపీకి కంటగింపుగా ఉంది.
మొత్తానికి ప్రధాన పక్షాలు రెండూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయి. అధికారంలో ఉండగా వల్లించే సూక్తులకూ, విపక్షంలో ఉండగా ప్రవర్తించే తీరుకూ పోలిక ఉండటం లేదు. ఎదుటి పక్షం అప్రజాస్వామికంగా ఉంటున్నదని ఆరోపించే వారు తమలోని అప్రజాస్వామికతను గుర్తించడంలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లవుతున్నది. అనుభవం వచ్చిన కొద్దీ మరింతగా పరిణతిని సాధించాల్సిన చట్టసభల తీరు అందుకు విరుద్ధంగా ఉంటున్నది. మొదట్లో ఎంతో అర్ధవంతమైన చర్చలకు వేదికలుగా ఉండే చట్టసభలు ఇప్పుడు గందరగోళానికి మారు పేరవుతున్నాయి. జనం ఒకసారి తమకు మెజారిటీ ఇచ్చారు గనుక ఈ అయిదేళ్లలో తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టు అధికారంలో ఉండేవారు ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణి పార్లమెంటులో మాత్రమే కాదు...అసెంబ్లీల్లోనూ కనబడుతోంది.
ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమైనదే అయినా అదే అన్నిటినీ నిర్ణయిస్తుంది...నిర్ణయించాలనుకోవడం సరికాదు. అధికార, విపక్షాలు రెండూ ప్రజలకు జవాబుదారీగా ఉండటం ముఖ్యం. తమ ప్రతి అడుగూ బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తించడం ముఖ్యం. విపక్షం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, తమవైపుగా జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దుకోవడం తమ మనుగడకు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం మనుగడకు కూడా చాలా అవసరమని అధికారపక్షం గుర్తించాలి. అదే విధంగా చట్టసభలను నెలకొల్పడంలోని ప్రధానోద్దేశం చర్చలే తప్ప రచ్చ కాదని...సభలో తమ ఆచరణ అంతిమంగా ఆరోగ్యవంతమైన చర్చకు దోహదపడాలని, ఆ దిశగా అధికారపక్షాన్ని ఒప్పించాలని విపక్షం గమనించాలి. ఇద్దరికిద్దరూ చిత్తం వచ్చినట్టు వ్యవహరిస్తే చివరకు నవ్వులపాలయ్యేది మన ప్రజాస్వామ్యమే.
ఈ ప్రవర్తన సరికాదు
Published Tue, Aug 4 2015 12:57 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement