తప్పిన పెను ముప్పు
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సాగించిన దారుణ నరమేధాన్ని చూసి నివ్వెరపోయిన దేశ ప్రజలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలు అదే ఉగ్రవాద సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రచించిన ఉగ్ర బీభత్స కుట్రను తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఎస్‌ఐ) జాగరూకతతో, చురుకుగా వ్యవహరించడంతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లకు, దేశంలోని ఇతర ప్రాంతాలకూ ముప్పు తప్పింది. ఒకదశలో ఇరాక్, సిరియాలలోని విశాల ప్రాంతాలను ఆక్రమించి ప్రపంచానికే పీడగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్ లేదా ఐఎస్) మన దేశంలో కూడా వివిధ పేర్లతో వాటి శాఖలను ఏర్పాటు చేస్తున్నదనీ, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ద్వారా అది ప్రచారం చేస్తున్న అసత్య కథనాలు, భ్రమలు, ఉన్మాదం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొందరు యువతీ యువకులు ఐఎస్‌లో చేరడానికి వెళ్లారు, వెళ్లే ప్రయత్నాల్లో పట్టుబడ్డారు కూడా.
భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ఐఎస్ చేసిన వీడియో ప్రకటన అమె రికన్ ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఇటీవలనే వెలుగు చూసింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఐఎస్ కాటు వేయడానికి ముందే కోరలు పీకిన ఎన్‌ఎస్‌ఐ కృషి ప్రశంసనీయం. అది గత ఏడాది ఐఎస్‌తో సంబంధం ఉన్న ఏడు రాష్ట్రాలకు చెందిన 16 మందిని అరెస్టు చేసింది. ఐఎస్ తరఫున మన దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్న షఫీ ఆర్మర్ ఏర్పాటు చేసిన అన్సార్ అల్ తవ్విద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) నిర్మిస్తున్న మాడ్యూల్స్ లేదా యూనిట్లలో ఒకటి అలా విచ్ఛిన్నమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో అరెస్టయిన 11 మందిలో ఎలాంటి అను మానాస్పద గత చరిత్ర లేనివారే ఎక్కువ. దేశంలో ఐఎస్ చాపకింద నీరులా విస్తరించడానికి చేస్తున్న కృషిని అది సూచిస్తుంది. ఐఎస్ వివిధ దేశాల్లో నిర్మిస్తున్న యూనిట్లన్నీ ఇలాగే ఒక యూనిట్‌కు మరొక యూనిట్‌కు ఎలాంటి సంబంధమూ లేకుండా, అసలు తెలియనే తెలియకుండా స్వతంత్రంగా పనిచేసేవే. అందువల్లే వాటి ఆనుపానులను పసిగట్టడం కష్టమౌతోంది.
హఠాత్తుగా ఎప్పుడో ఎక్కడో విరుచుకుపడి బీభత్సాన్ని సృష్టించాకగానీ తరచుగా వాటి ఉనికి తెలియడం లేదు. 2014లో ఐఎస్ తన ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇంత వరకు ఇరాక్, సిరియాలలోగాక 21 దేశాల్లో 90 దాడులకు పాల్పడి 1,400 మందిని హతమా ర్చింది. మార్చిలో జరిగిన బ్రసెల్స్ ఉగ్ర దాడి నుంచి తాజాగా జరిగిన ఇస్తాంబుల్ అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి వరకు ప్రతి చోటా ఐఎస్ ఒకే పద్ధతులను ప్రయోగిస్తోంది. ఇప్పటికే పాక్ కేంద్రంగా పనిచేస్తున్న వివిధ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న మన దేశానికి ఐఎస్ నుంచి ఉన్న ముప్పును తక్కువగా అంచనా వేయలేం. సీమాంతర ఉగ్రవాదుల స్వర్గ సీమగా పేరు మోసిన పాకిస్తాన్‌లో సైతం ఐఎస్ స్థావరాలను ఏర్పరచుకున్న దృష్ట్యా దాని నుంచి ముప్పును మనం ఉపేక్షించలేం.
ఐఎస్‌కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో అమెరికా, రష్యాలు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టడంతో సిరియాలో దాని సేనలు రక్షణ స్థితిలో పడ్డాయి. దీంతో అది వివిధ దేశాలలోని తమ రహస్య యూనిట్లను ఉగ్రదాడులకు ప్రేరే పిస్తోంది. రంజాన్ పవిత్ర మాసంలో దాడులను ఉధృతం చేయాల్సిందని ఐఎస్ అధికార ప్రతినిధి అబూ అహ్మద్ అల్ అద్నానీ వివిధ దేశాలలోని ఐస్ ఉగ్ర వాదులకు పంపిన ఆడియా సందేశం మే నెల చివర్లో బహిర్గతమైంది. హైదరాబాద్ ఉగ్ర ముఠా రంజాన్ సందర్భంగా దాడులకు పథకం పన్నిందనే కథనాలు వినవస్తున్నా అవి రూఢికాలేదు. కానీ టర్కీలోని ఇస్తాంబుల్ అటాటర్క్ అంతర్జా తీయ విమానాశ్రయంపై జరిగిన ఆత్మాహుతి దాడి ఈ సందర్భంగా జరిగినదేనని భావించవచ్చు. 41 మంది అమాయకులను బలిగొని, దాదాపు 240 మందిని తీవ్రంగా గాయపరచిన ఆ ఉగ్రదాడి హేయమైనది. టర్కీ ఎదుర్కొంటున్న ఐఎస్ ఉగ్రవాదం సమస్య భారత్‌కు పూర్తిగా భిన్నమైనది. ఒకవిధంగా చెప్పాలంటే అది టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఎర్డోగాన్ ఐఎస్ సహా నానా రకాల ఉగ్రవాద సంస్థలకు ఇరాక్, సిరియా సరిహద్దులలో ఆశ్రయం కల్పించారు. అటు ఇరాక్‌లోకి, ఇటు సిరియాలోకి స్వేచ్ఛగా వెళ్లి రావడానికి అవ కాశం కల్పించారు. మన దేశంలో దొరికే ఉగ్రవాదుల ఆనవాళ్లన్నీ పాక్‌ను సూచించేట్టే, సిరియాలో హతమౌతున్న ఐఎస్ ఉగ్రవాదులలో చాలా మంది వద్ద సిరియా పాస్‌పోర్టులు లభిస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే టర్కీ తీరు పాక్ వైఖరిని పోలినది. రష్యా దురాక్రమణకు ముందు నుంచి పాక్ అటు అఫ్ఘాన్‌కు, ఇటు భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించింది. అయితే తాలిబన్ కు ఆశ్రయం కల్పించిన తదుపరి ఆ దేశమే స్వయంగా ఉగ్రవాద దాడులకు గురై, నిత్యం నెత్తురోడాల్సిన స్థితికి చేరింది. ఎర్డోగాన్ తమ దేశంలోని కుర్దుల వేర్పాటువాద ధోరణికి మూల కారణమైన జాతి వివక్షకు స్వస్తి పలికి వారికి స్వయంప్రతిపత్తిని కల్పించడానికి బదులుగా వారితో కుదిరిన శాంతి ఒప్పందాన్ని కాలరాచి, వారిపైకి ఐఎస్ ఉగ్రవాదులను ఉసిగొలిపారు. అటు ఇరాక్‌లోనూ, ఇటు సిరియాలోనూ ఐఎస్‌ను కుర్దులు తీవ్రంగా ప్రతిఘటించారు.
చిట్టచివరకు అమెరికా తీవ్ర ఒత్తిడి మేరకు గత ఏడాది ఆయన ఐఎస్‌పై యుద్ధానికి మద్దతు పలికారు, అయిష్టంగానే కొన్ని దాడులు, అరెస్టులు చేశారు. ఈ విషయంలోనూ ఎర్డోగాన్ వైఖరి పాక్ వైఖరి వంటిదే. 9/11 ఉగ్రదాడుల తదుపరి అమెరికా ఒత్తిడికి లొంగి పేరుకు పాక్, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో అయిష్టంగా చేరినా ఇంటా, బయటా కూడా అది ఉగ్రవాద సంస్థలను పోషిస్తూ వచ్చింది. ఉగ్రవాదం దేశాలకు, జాతు లకు, మతాలకు అతీతమైన ఉన్మాదం, మూర్ఖత్వం అనడంలో సందేహం లేదు. కానీ ఉగ్రవాదాన్నీ, ఉగ్రవాద సంస్థలనూ పోషించి, ప్రోత్సహించి, చెప్పుచేతుల్లో ఉంచుకునిసంకుచిత స్వార్థ ప్రయోజనాలకు వాడుకోగలమని భావించడాన్ని మించిన మూర్ఖత్వం ఉండదు. తాలిబన్, ఆల్‌కాయిదాల నుంచి ఐఎస్ వరకు ఉగ్ర నాగులన్నీ పాలు పోసి పెంచిన వారిని కాటువేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదం కంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మరింత ప్రమాదకరమని తాజా ఉగ్ర ఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి.