హేమంత్ సోరెన్
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో బీజేపీ పాలనకు జనం చరమగీతం పాడారు. వేర్వేరు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ సోమవారం అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మహారాష్ట్ర భంగపాటు జరిగి రెణ్నెల్లు తిరక్కుండానే జార్ఖండ్‌లో బీజేపీకి తగిలిన రెండో గాయమిది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటినుంచీ కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని స్థానాల్లోనూ ఈ ధోరణి కనబడింది. చెప్పాలంటే మొదట్లో బీజేపీ ఎంతో కొంత మెరుగైన స్థితి కనబరిచింది.
కానీ లెక్కింపు కొనసాగుతున్నకొద్దీ అది క్రమేపీ క్షీణించింది. ఆఖరికి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సైతం తన నియోజకవర్గంలో ఆదినుంచీ వెనకబడివున్నారంటే జనాగ్రహం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇది నూరు శాతం బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. రఘువర్ దాస్ ఓడింది చెప్పుకోదగ్గ నాయకుడిపై కాదు. నిన్న మొన్నటివరకూ తమ పార్టీలో, తన అను చరుడిగావున్న వ్యక్తి చేతుల్లోనే ఆయనకు ఓటమి తప్పలేదు. వాస్తవానికి జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కి చెప్పుకోదగ్గ బలమంటూ లేదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల మాదిరే ఇక్కడ కూడా ఆ పార్టీ నిస్తేజంగా ఉంది.
రాహుల్‌గాంధీ అయిదు ప్రచారసభల్లో, ఆయన సోదరి ప్రియాంక ఒక సభలో మాత్రమే మాట్లాడారు. ఇందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెరో తొమ్మిది సభల్లో ప్రసంగించారు. బీజేపీకి చెందిన ఇతర నేతలు సరేసరి. అటు కాంగ్రెస్‌కు పార్టీ శ్రేణుల్ని సమరానికి సమాయత్తం చేయగల సత్తాగానీ, ప్రజల్ని ఒప్పించగల నేర్పరితనంగానీ ఉన్న నాయకుడు లేరు. మహారాష్ట్ర మాదిరి గెలుపు గుర్రంతో చెలిమి చేయడం ఆ పార్టీకి కలిసొచ్చిన ఏకైక ఎత్తుగడ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బీజేపీకి గట్టి సవాలు ఇవ్వగల పార్టీయే అయినా ఆ పార్టీ నాయకుడు హేమంత్ సోరెన్ శరద్ పవార్ స్థాయి నాయకుడు కాదు.
ఆయనలా కాంగ్రెస్ నాయకత్వ లేమిని పూడ్చగలిగినవాడు కాదు. రాష్ట్రానికి మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌పై జనంలోవున్న అనుకూలత హేమంత్‌కు కలిసొచ్చింది. అయితే తమ పార్టీకి మొదట్నించీ పునాదిగావున్న ఆదివాసీలనూ, కుర్మీలనూ కూడగట్టుకోవడంలోనే ఆయన అధిక సమయాన్ని వెచ్చించాల్సివచ్చింది. ఎందుకంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)కి కూడా కుర్మీలలో చెప్పుకోదగ్గ పలుకుబడివుంది. జార్ఖండ్ జనాభాలో ఆదివాసీ, కుర్మీలు దాదాపు సగభాగం ఉంటారు.
మొదటినుంచీ అంచనాలకు భిన్నమైన ఫలితాలు అందించడం జార్ఖండ్ ప్రత్యేకత. అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు తప్పని రుజువయ్యాయి. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న 14 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు జారవిడుచుకోక తప్పదని ఎన్నికల ముందు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి. కానీ బీజేపీ మాత్రం అంతకుముందు మాదిరే 12 స్థానాలు సాధించగా, ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ(ఏజేఎస్‌యూపీ) ఒక స్థానాన్ని గెల్చు కుంది.
బీజేపీ ఓటుబ్యాంకు 40 శాతం య«థాతథంగావుంది. కానీ ఆర్నెల్లు గడిచేసరికల్లా ఆ ఓటు బ్యాంకు గల్లంతయింది. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తొలిసారి వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. 81మంది సభ్యులుగల ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీకి 37 రాగా, ఆ పార్టీ మిత్ర పక్షం ఏజేఎస్‌యూపీకి 5 లభించాయి. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) 8 స్థానాలు సాధించినా అందులో ఆరుగురు 2015లో బీజేపీ శిబిరంలో చేరారు. అప్పట్లో జేఎంఎంకు 19, కాంగ్రెస్‌కు 6 వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావా ల్సిన కనీస మెజారిటీ 41 కనుక బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వగలిగింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తూ 1973లో ఆవిర్భవించిన జేఎంఎం పోరాటం ఫలితంగా 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడింది.
గత ఎన్నికల్లో బీజేపీతో చెలిమి చేసి 8 చోట్ల పోటీచేసి అయిదుచోట్ల గెలుపొందిన ఏజేఎస్‌యూ, ఈసారి తమకు 17 నుంచి 19 కేటాయించాలని డిమాండ్‌చేసింది. మహారాష్ట్ర, హరి యాణా ఎన్నికల ఫలితాలు రావడం, ఆ రెండుచోట్లా బీజేపీకి ఆదరణ గతంతో పోలిస్తే క్షీణించడం చూశాక ఏజేఎస్‌యూ తన డిమాండ్‌పై మరింత పట్టుబట్టడం మొదలెట్టింది. చివరికది దూరం కావడంతో బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. 24 జిల్లాలున్న జార్ఖండ్‌లో 19చోట్ల మావోయిస్టుల ప్రాబల్యంవుంది. కనుకనే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించారు.
ఆదివాసీ జనాభా అధికంగావున్న జార్ఖండ్‌లో 2014లో తొలిసారి ఆదివాసీయేతరుడైన రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడం బీజేపీ సాహసమే. ఇది చాలదన్నట్టు కౌలు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల్ని, భూసేకరణ విధానాల్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ భూములపై తమకుండే హక్కును ఇవి దెబ్బతీస్తాయని వారు ఆందోళనపడ్డారు. బ్రిటిష్‌వారిపై పోరాడి ప్రాణాలర్పించిన ముండా తెగ ఆదివాసీల స్మృతికి నివాళులర్పించేందుకు లోక్‌సభ ఎన్నికల సమయంలో రఘుబర్‌దాస్ కుంతి ప్రాంతానికెళ్లినప్పుడు ఆదివాసీలు ఆయనపై చెప్పులు విసిరి నిరసన ప్రకటించారు. అయినా అప్పట్లో బీజేపీ అభ్యర్థే గెలిచారు. బీజేపీ విధానాలు తీవ్రంగా దెబ్బ తీస్తాయని ప్రచారం చేయడంలో విపక్షాలు ఈసారి విజయం సాధించాయి.
తాము అధికారంలోకొస్తే ఆదివాసీల భూములకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశాయి. అలాగే సీఏఏ, ఎన్నార్సీలు జార్ఖండ్ ముస్లింలపై కూడా ప్రభావం చూపాయి. బీజేపీ తన ప్రచారాన్ని ప్రధానంగా అభివృద్ధిపై కేంద్రీ కరించింది. సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలది దుష్ప్రచారమని కొట్టిపారేసింది. ఎన్నికల ఫలితాలు పార్టీలు స్వీయ సమీక్ష చేసుకోవడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా మరో రాష్ట్రాన్ని చేజార్చుకున్న పార్టీగా బీజేపీ రాష్ట్రంతోపాటు కేంద్రంలో అనుసరిస్తున్న విధానాల్లోని తప్పొప్పులపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం నాడి తెలిశాక అయినా వాటిని సవరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment