‘లేబర్’ సారథి కోర్బిన్ | Labour Saradhi korbhin selection | Sakshi
Sakshi News home page

‘లేబర్’ సారథి కోర్బిన్

Published Mon, Sep 14 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

ఊహకందనిది సంభవించడాన్నే అద్భుతం అంటారు. అలా చూసుకుంటే బ్రిటన్ లేబర్ పార్టీ చీఫ్‌గా జెరెమి కోబిన్ ఎన్నికను అద్భుతమనే అనాలి.

 ఊహకందనిది సంభవించడాన్నే అద్భుతం అంటారు. అలా చూసుకుంటే బ్రిటన్ లేబర్ పార్టీ చీఫ్‌గా జెరెమి కోబిన్ ఎన్నికను అద్భుతమనే అనాలి. ఈ ఎన్నిక రొటీన్‌గా మారకూడదనీ, పార్టీలో అతివాద పక్షానికి కూడా గొంతునివ్వాల్సిన అవసరం ఉన్నదని భావించి నామమాత్రంగా ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు ప్రతి పాదించారు. తీరా కోబిన్ నాయకత్వ పీఠాన్ని కైవసం చేసుకోవడమే కాదు... దాదాపు 60 శాతం ఓట్లు కొల్లగొట్టారు. పోటీపడిన మిగిలిన ముగ్గురిలో కనీసం ఆయన దరిదాపులకు వచ్చిన అభ్యర్థే లేరంటే కోర్బిన్ ఎన్నిక ఎంత ఏకపక్షంగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. లేబర్ పార్టీపై ఒక విమర్శ ఉంది.
 
 అది విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే లేబర్ పార్టీగా ఉంటుందని, అధికారం చేతికందగానే కన్సర్వేటివ్ పార్టీని మించిన మితవాద ధోరణులను ప్రదర్శిస్తుందన్నదే దాని సారాంశం. 115 ఏళ్లక్రితం కార్మికోద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ ఇలాంటి పోకడలకు పోవడం ఆశ్చర్యమనిపించినా అది తప్పనిసరి పరిణామమని దాని తీరుతెన్నుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ ఆ పార్టీలో భిన్న సైద్ధాంతిక విశ్వాసాలున్నవారు చేరారు. తీవ్రవాద సోషలిస్టులు మొదలుకొని సోషల్ డెమొక్రాట్ల వరకూ అందులో చాలా రకాలవారున్నారు. ఫలితంగా లేబర్ పార్టీ తన మౌలిక సూత్రాలైన న్యాయం... ప్రజాస్వామ్యం అనే భావనలనుంచి చాలా దూరం జరిగింది. ఆ పార్టీకొక స్పష్టమైన పంథా కొరవడింది.
 
 ‘న్యూ లేబర్...న్యూ లైఫ్’ అంటూ 1996లో పార్టీ ప్రణాళికకు టోనీ బ్లెయిర్ ఎన్నో మార్పులు చేశారు. ‘ఉత్పత్తి సాధనాలు, దాని పంపిణీ, మారకం వగైరా అంశాల్లో ఉమ్మడి యాజమాన్యం ఉండాల’న్న ఆకాంక్ష కాస్తా... ‘అధికారమూ, సంపద, అవకాశాలు వంటివి కొద్దిమంది చేతుల్లో కాక అనేకులకు అందుబాటులోకి రావలసిన అవసరం ఉన్నద’నే సిద్ధాంతంగా మారింది. ‘బాధ్యతాయుత పెట్టుబడి దారీ విధానం’ అవసరాన్నీ పార్టీ గుర్తించింది. సోషలిస్టు వ్యవస్థ, నయా ఉదార వాదంల మధ్య ‘మూడో మార్గం’ ఉండాలని ‘న్యూ లేబర్’ భావించింది.
 
 ఈ మార్పులు వెనువెంటనే మంచి ఫలితాన్నే ఇచ్చాయి. 1997లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ కన్సర్వేటివ్‌లకన్నా 197 స్థానాలు అధికంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కనీస వేతనం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, వయోజన విద్య, శిక్షణ వంటి అంశాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. వరసగా మూడు దఫాలు అధికారంలో కొనసాగిన లేబర్ పార్టీ క్రమేపీ తప్పటడుగులేయడం ప్రారంభించింది. దేశీయంగా తీసుకున్న నిర్ణయాలు వికటించాయి. సొంత గొంతును మరిచి అంతర్జాతీయంగా దేశం అమెరికా తోకగా మారడం చాలామందికి రుచించలేదు. ముఖ్యంగా ఇరాక్‌పై జరిగిన దురాక్రమణ లో పాలుపంచుకోవడం దగ్గరనుంచి వరసబెట్టి అనుసరించిన విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. దీని పర్యవసానాలు అనంతరకాలం జరిగిన ఎన్ని కల్లో ప్రతిఫలించాయి. వరసగా రెండు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. బ్లెయిర్ విధానాలే పార్టీని పాతి పెట్టాయని అత్యధికులు భావించారు.  
 
  లేబర్ పార్టీ మౌలిక సిద్ధాంతాలను తిరిగి ఆచరించడమే సరైన మార్గమని వాదించే కోర్బిన్‌కు పార్టీలో క్రమేపీ బలం పెరిగింది. మొదట్లో ఆయన్నొక జోకర్‌గా భావించిన రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అయితే వారు సైతం కోర్బిన్ విజయం సాధిస్తాడని అనుకోలేదు. ‘గౌరవప్రదమైన’ పోటీ ఇవ్వొచ్చునని అంచనా వేశారు. కానీ పోలైన ఓట్లలో 59.5 శాతాన్ని సాధించి కోర్బిన్ అందరినీ అబ్బురపరిచారు. పార్టీకి ఆయన నిర్దేశించిన కార్యక్రమం సాధా రణమైనదేమీ కాదు. అందరికీ ఇళ్లు లక్ష్య సాధన కోసం ఇప్పుడున్న గృహ నిర్మాణ అనుమతి మండలుల రూపురేఖల్ని మార్చడం, ప్రైవేటు రంగంలోకి పోయిన రైల్వేలను తిరిగి ప్రభుత్వ రంగానికి మార్చడం, సంపద పెంచేలా, అత్యుత్తమ ఉపాధి అవకాశాలు లభించేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం, హరిత ఇంధనం దిశ గా దేశాన్ని మళ్లించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, సార్వత్రిక శిశు సంరక్షణ, వయోజన విద్యకు నిధుల పెంపు, విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్  ఫీజుల రద్దు, నిర్దిష్టమైన వేతనాలిచ్చే అప్రెంటిస్‌షిప్, వేతనాల చెల్లింపులో లింగ వివక్ష లేకుండా చూడటం వగైరా హామీలు అందులో ఉన్నాయి.
 
 రక్షణ రంగంలో ఉద్యో గాల తగ్గింపు, ఏకపక్షంగా అణు నిరాయుధీకరణ, నాటోనుంచి తప్పుకోవడం వంటి కీలకమైన అంశాలున్నాయి. ఇలాంటి లక్ష్యాలతో 2020 ఎన్నికల్లో జనం ముం దుకు వెళ్తే విజయం తమదేనని లేబర్ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఈలోగా కోర్బిన్ సమర్థవంతమైన విపక్ష నేతగా నిరూపించుకోవాల్సి ఉంది. కోర్బిన్ వాగ్దానాలన్నీ అధికారం కోసమేనా లేక వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పం ఆయనలో ఉన్నాయా అన్న అనుమానాలు చాలామందిలో లేక పోలేదు.
 
 అయితే, పార్టీలో కోర్బిన్‌ది ఎప్పుడూ తిరుగుబాటు చరిత్రే. ఉలిపికట్టె స్వభావమే. ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధాన్ని గట్టిగా వ్యతిరేకించడమే కాదు... ఆ దురాక్రమణపై విచారణ జరిపించాలని అనంతరకాలంలో డిమాండ్ చేసిన కొద్ది మందిలో కోర్బిన్ ఒకరు. ఈ క్రమంలో ఆయన పార్టీ విప్‌ను 500 సార్లు ధిక్కరిం చారు. మన దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆయనకు అవ గాహన ఉంది. ఉన్నత శక్తిగా ఎదగాలని ఆకాంక్షించే భారత్ కుల వివక్ష కొనసాగడాన్ని ఎలా అనుమతిస్తున్నదని ఆయన ఒక సందర్భంలో ప్రశ్నించారు. బ్రిటన్ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఈలోగా పార్టీలో అంద రినీ కలుపుకొని పోగల సత్తా తిరుగుబాటు తత్వమున్న కోర్బిన్‌కు ఉన్నదా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఇప్పటికే ఆయన నేతృత్వంలో తాము పనిచేయ లేమని షాడో కేబినెట్ బాధ్యతలనుంచి పలువురు వైదొలిగారు. కోర్బిన్ సారథ్యం లేబర్ పార్టీ మంచికా, చెడుకా అన్నది రాగలకాలంలో తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement