ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లింలు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో ఈసారి నెల వ్యవధిలోనే రెండో విషాదం చోటు చేసుకుంది. పక్షం రోజుల క్రితం ఒక క్రేన్ కూలి 115మంది మరణించగా... గురువారం ఉదయం తొక్కిసలాట సంభవించి 700మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900మంది వరకూ గాయపడ్డారని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. 1990లో మక్కానుంచి మినాకు వెళ్లే దారిలో ఈ తరహాలోనే తొక్కిసలాట జరిగి 1,426 మంది కన్నుమూశారు. ఆ తర్వాత కనీసం నాలుగైదుసార్లు ఇలాగే తొక్కిస లాటలు చోటుచేసుకుని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2006లో మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో 364 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏవో చిన్న ఘటనలు మినహా అంతా సవ్యంగా గడిచింది. ఈసారి 20 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. మన దేశం నుంచి వెళ్లినవారి సంఖ్యే దాదాపు లక్షన్నర అని చెబుతున్నారు. మృతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన మహిళగా గుర్తించారు.
జమారత్ స్థూపాల వద్దకు వెళ్లే మార్గాలను మూసేయడం వల్లనే లక్షలాదిమంది యాత్రికులు ఒకచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని ఇరాన్ హజ్ సంస్థ ముఖ్యుడు చెబుతున్నారు. అందుకు భిన్నంగా సైతాన్‌ను రాళ్లతో కొట్టే సందర్భంలో ఇలా జరిగిందని సౌదీ ప్రభుత్వం వివరణనిస్తోంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా పవిత్ర హజ్ ఆరాధనలో పాల్గొనాలని, దైవ ప్రసన్నం పొందాలని ముస్లింలంతా ఉవ్విళ్లూరుతారు. అందుకోసం ప్రత్యేకించి తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తుంటారు.
మనస్సునూ, దేహాన్నీ నిర్మలంగా ఉంచుకుని అన్ని రకాల మనోవాంఛలకూ దూరంగా ఉంటూ నిరంతర దైవ ధ్యానంతో హజ్ యాత్రకు సిద్ధపడతారు. అలాంటి యాత్రలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. లక్షలాదిమంది ఒక చోటకు చేరే ఇలాంటి కార్యక్రమాలను నియంత్రించడం, అందరూ సురక్షితంగా తిరిగి వెళ్లేలా చూడటం సామాన్యమైన విషయం కాదు. ఇదంతా ఎన్నో ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది. హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లే చేసింది. లక్షమందికి పైగా పోలీసు సిబ్బందినీ, దాదాపు 30,000 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించింది.
ఆపత్కాలంలో ఉపయోగించేందుకు వేలాది పడకలతో, అత్యవసర చికిత్సకు అవసరమైన పరికరాలతో ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అగ్నిమాపక దళాలను సిద్ధం చేసింది. 26 లక్షలమందికి సరిపడా గుడారాలను సమకూర్చింది. అవన్నీ అగ్ని ప్రమాదాలకు తావీయనివి. భక్తుల రద్దీ ఏటా పెరగడాన్ని గమనించి ఈసారి ప్రధాన మసీదు వద్ద 4,00,000 చదరపు మీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టింది. నిజానికి అందుకు సంబంధించిన నిర్మాణ పనులు సాగుతుండగానే పదిహేను రోజుల క్రితం క్రేన్ ఒక్కసారిగా కూలి వందమందికి పైగా మరణించారు. రద్దీని తగ్గించడం కోసం ఈసారి సౌదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి.
రిజిస్ట్రేషన్లు, పర్యాటక వీసాల్లో పెట్టిన నిబంధనలన్నీ తొలిసారి యాత్రకొచ్చేవారిని మాత్రమే అనుమతించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్థికంగా స్తోమత ఉండి, దైవ చింతనలో గడపాలనుకునేవారు జీవితంలో ఎన్నిసార్లయినా హజ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటారని, అటువంటివారికి సౌదీ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నదని విమర్శలు వచ్చాయి. అయితే ఏదో రకమైన పరిమితులు విధించకపోతే, అవసరమైన నియంత్రణా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి యాత్రల్లో అపశ్రుతులు దొర్లకుండా చూడటం సాధ్యం కాదన్నది సౌదీ అధికారులిస్తున్న సంజాయిషీ. ఆ వాదనలోని హేతుబద్ధత సంగతలా ఉంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సౌదీ ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న లోపాలను సరిగా పట్టించుకోలేదని, అందువల్లనే ఈ విషాదం చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా రెండు దారులు మూసేయడంవల్ల అటుగా వచ్చేవారికి తోవ లేకుండా పోయిందని చెబుతున్నారు.
తొక్కిసలాటలు జరిగినప్పుడల్లా వినబడే కారణమే ఇది. మొన్న జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట సంభవించి 29మంది మరణించడానికి పుష్కర ఘాట్ వద్ద గేటు మూసి, భక్తుల్ని గంటల తరబడి నిలిపేసి ఒక్కసారిగా అనుమతించడమే కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా సాగించిన పూజ పూర్తయ్యేదాకా వారందరినీ కదలనీయలేదు. భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉండే ఇలాంటి సందర్భాలప్పుడు ప్రభుత్వాలు ప్రతి చిన్న అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రమాదాల నివారణ సాధ్యం కాదు.
తొక్కిసలాటల విషయంలో ఒక అంతర్జాతీయ జర్నల్ ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. మన దేశంలో జరిగే తొక్కిసలాటల్లో 79 శాతం మతపరమైన కూడిక సందర్భంలోనే సంభవిస్తున్నాయని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇందుకు భిన్నంగా క్రీడలు జరిగే స్టేడియంలలో, సంగీత ఉత్సవాల్లో, నైట్ క్లబ్‌లలో చోటుచేసుకుంటాయి. వ్యక్తులుగా ఉన్నప్పటి ప్రవర్తనకూ, సమూహంలో భాగంగా ఉన్నప్పటి ప్రవర్తనకూ ఎంతో తేడా ఉంటుందని...చుట్టూ ఉన్నవారి ప్రవర్తనకు ప్రభావితమై ఎవరైనా అందులో భాగంగా మారిపోతారని, ఈ క్రమంలో తమను తాము మరిచిపోయే తత్వం ఏర్పడుతుందని సమూహ ప్రవర్తనను విశ్లేషించే నిపుణులు చెబుతారు.
కనుక ఈ సందర్భాల్లో ఎంతో అప్రమత్తత అవసరమవుతుంది. హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. 1930లో ఆ యాత్రలో 30,000మంది పాల్గొన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అది ఇప్పుడు దాదాపు 30 లక్షలకు చేరువవుతున్నది. కనుక సౌదీ సర్కారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి సంభవించకుండా చూడాలి. ఒక్క సౌదీకే కాదు... ప్రపంచ దేశాలన్నిటికీ ఈ విషాద ఉదంతం ఒక హెచ్చరిక కావాలి.
హజ్ యాత్రలో విషాదం
Published Fri, Sep 25 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement