ప్రపంచంలో ఎవరి ఉన్నత వ్యక్తిత్వాన్నయినా చెప్పడానికీ, ఏ సమస్య తీవ్రతనైనా అర్ధం చేయించడానికీ, ఎవరైనా సాధించిన అసమాన విజయాన్ని అభివర్ణించడానికీ ఎవరెస్టుకు మించిన కొలత లేదు. శతాబ్దాలుగా మనిషిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న ఆ శిఖరాన్ని అధిరోహించడంద్వారా ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులున్నారు. 2001లో ఆ శిఖరాగ్రానికి చేరుకున్న ఎరిక్ వీన్‌మేయర్ పుట్టు అంధుడు. 2008లో ఎక్కిన మిన్ బహదూర్ షెర్చాన్ 76ఏళ్ల వృద్ధుడైతే, 2012లో చేరుకున్న వాతన్‌బీ 73 ఏళ్ల వృద్ధురాలు. 2010లో అధిరోహించిన జోర్డాన్ రొమేరో 13 ఏళ్ల బాలుడు. ఇంకా...వాలీబాల్ క్రీడలో జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణించిన అరుణిమ రైల్లో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయినప్పుడు...ఆ ఘటన తన ఆత్మస్థైరాన్ని దెబ్బతీయలేదని ప్రకటించడానికి ఆమె ఎన్నుకున్న మార్గం ఎవరెస్టు శిఖరారోహణ. ఇలాంటివారి అడుగులో అడుగేస్తూ, ఆపద్బాంధవుల్లా నిలుస్తూ...ఆ క్రమంలో తమ ప్రాణాలు కోల్పోయేవారు షెర్పా తెగవారు. ఎవరెస్టు శిఖరారోహణే ఏకకాలంలో వారికి బతుకుతెరువు, మృత్యుమార్గం కూడా. ఆరోహకులకు దారి చూపడమేకాదు...వారికి అవసరమైన భారీ సరంజామాను మోసుకెళ్లే పనికూడా వారిదే. కూలడానికి సిద్ధంగా ఉండే అత్యంత ప్రమాదకరమైన మంచు ఖండాలను గుర్తించడం, వాటిని ఒడుపుగా దాటుకెళ్లడమెలాగో అంచనా వేసుకోవడం వారి నిత్యకృత్యం. చావుకు తెగిస్తేనే వారి బతుకు బండి నడుస్తుంది. మృత్యువును నిత్యం పరిహసిస్తేనే వారి జీవితం చివురుతొడుగుతుంటుంది. కాదనుకున్న మరుక్షణం అంతా తలకిందులవుతుంది. 29,029 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరంగా నిలిచిన ఎవరెస్టును జయించడం అంత సులభం కాదు. అటువైపు అడుగులేయాలని నిర్ణయించుకున్నాక అందుకోసం వేలాది డాలర్లు వెచ్చించి శిక్షణ తీసుకుంటారు. శిక్షణంతా పూర్తయ్యాక మాత్రమే బేస్ క్యాంపులోకి ప్రవేశం. ఎవరెస్టు దిశగా కదలినప్పుడు ప్రతి అడుగుకూ ఆక్సిజన్ తగ్గిపోతూ వెళ్లేకొద్దీ ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది. దానికితోడు మనిషిని నిలువునా గడ్డకట్టించే చలి. ఎటునుంచి హిమఖండం విరిగిపడుతుందో తెలియదు. ఇలాంటి ఘటనల్లో గాయపడినవారిని మోసుకురావడం కూడా ఒక్కోసారి అసాధ్యం. హెలికాప్టర్ అక్కడికి చేరడం అత్యంత దుర్లభం. మృతదేహంగా మిగిలిపోతే చాలా సందర్భాల్లో కిందకు తీసుకురావడం కూడా సాధ్యంకాదు. టన్నులకొద్దీ హిమ సమూహంకింద ఉండిపోయే మృతదేహాలను అసలు గాలించడమే కష్టం. ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరడానికి 15 మార్గాలను గుర్తిస్తే అందులో రెండు మాత్రమే కొద్దో గొప్పో సురక్షితమైనవి. డెత్ జోన్‌గా పేరున్నా, మృత్యువు పొంచివుంటుందని అర్ధమైనా అక్కడికి చేరేందుకు తహతహలాడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఏడాదికి 2,000మంది వరకూ ఎవరెస్టును పలకరించేందుకు ఉత్సాహపడతారు. గత ఏడాది దాదాపు 700మంది శిఖరారోహణ చేశారు. ఇలాంటివారందరికీ ప్రధానమైన ఆధారం షెర్పాలే.
ఎన్నడూ ఏ రికార్డునూ బద్దలు కొట్టినట్టుగా గుర్తింపుపొందని షెర్పా తెగవారు ఇప్పుడు అలిగారు. అలిగి ఆ శిఖరం జోలికి ఇకపై వెళ్లబోమన్నారు. గతవారం మంచుఖండం విరిగిపడిన ఘటనలో 16మంది షెర్పా యువకులు ప్రాణాలు కోల్పోవడం ఈ అలకకు కారణం. ఎవరెస్టు శిఖరంపై మరణాలు వారికి కొత్త కాదు. అడపా దడపా అలాంటివి సంభవిస్తూనే ఉంటాయి. కానీ, ఇంతమంది ఒకే ఘటనలో మరణించడం ఇదే ప్రథమం. ఇంత జరిగినా వారి అలక ఎవరెస్టుపై కాదు...తమను గడ్డిపోచల్లా చూస్తున్న నేపాల్ ప్రభుత్వంపై. ఏడాదికి రెండు మూడు నెలలపాటుండే సీజన్‌లో ఆ షెర్పాలు సంపాదించే మొత్తం మన రూపాయిల్లో చూస్తే దాదాపు రెండు లక్షలు మాత్రమే. ఏడాదిపొడవునా ఇంటిల్లిపాదీ దానిపైనే ఆధారపడి బతకాలి. ప్రమాదంలో మరణించిన సందర్భాల్లో నేపాల్ ప్రభుత్వం వారి కుటుంబాలకు చెల్లించే మొత్తం రూ. 40,000. పదేళ్లక్రితం షెర్పాల సంక్షేమానికంటూ చట్టంచేశారు. అయినప్పటికీ వారి బతుకుల్లో మార్పేమీ లేదు. దేశానికి ప్రధాన ఆదాయ వనరైన టూరిజంలో ఎవరెస్టు శిఖరారోహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. ఏటా లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్నది. అందులో షెర్పాలదే ముఖ్య భూమిక. అయినాసరే తమ సంక్షేమానికిగానీ, తమ కుటుంబాల భద్రతకుగానీ నేపాల్ సర్కారు వీసమెత్తు విలువీయడం లేదన్నది వారి అభియోగం.
షెర్పాల అలక ముందు ఇప్పుడు ఎవరెస్టు చిన్నబోయింది. అక్కడంతా అనిశ్చితి అలుముకుంది. ఈ సీజన్‌లో ఇక అడుగు ముందుకేయబోమన్న షెర్పాల నిర్ణయం నేపాల్ ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టింది. వారి ఆందోళనను చల్లార్చడమెలాగో తెలియక అది తలపట్టుకుంది. మూర్ఛవ్యాధితో బాధపడుతూ తన శిఖరారోహణద్వారా అందరికీ స్ఫూర్తిని కలిగిద్దామని చేరుకున్న యువకుడు... బ్యాంకు ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి, ఉన్న ఫ్లాటును కూడా అమ్మేసి, దాచుకున్న మరికొంచెం సొమ్మును కూడా జతచేసి ఎవరెస్టు కోసమని ఖర్చుచేసేందుకు వచ్చిన మరో మధ్యవయస్కుడు, తన సోదరుడి అస్థికలను ఎవరెస్టుపైకి చేర్చాలని వచ్చిన మరొకరు ఈ తాజా పరిణామాలతో ఖిన్నులయ్యారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న షెర్పాలను పట్టించుకోనందువల్లనే ఈ పరిస్థితి. ఉన్నతంగా నిలవడం ఎలాగో, ఆలోచించడమెలాగో తనను చూసి నేర్చుకోమని ఎవరెస్టు చెబుతోంది. నేపాల్ సర్కారు వింటుందా?!
చిన్నబోయిన ఎవరెస్టు!
Published Sun, Apr 27 2014 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement