చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. ముంబై మహా నగరంలో ఈ నెల పదో తేదీతో మొదలుపెట్టి 13, 17, 18 తేదీల్లో మాంసం అమ్మకూడదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మొన్న 9న ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10, 17 తేదీల్లో మాంసం అమ్మకాలను నిషేధించింది. దాని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రభుత్వమూ, ఈ హడావుడంతా చూసి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ ఇలాంటి నిషేధాలనే విధించాయి. జైనుల పండగ పర్యూషణ్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిషేధాలను అమలు చేస్తున్నట్టు వీరంతా ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూ-కశ్మీర్ హైకోర్టు ఆ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలా తినే తిండిపై నిషేధం విధించడం కొందరంటున్నట్టు కొత్తదేమీ కాదు.
1964లో కూడా ముంబై కార్పొరేషన్‌లో మాంసాహార అమ్మకాలను రెండు రోజులు నిలిపి ఉంచారని చెబుతున్నారు. అక్బర్ చక్రవర్తి ఏడాదిలో ఆర్నెల్లపాటు మాంసాహారాన్ని విడనాడినప్పుడు ఓ తొమ్మిదిరోజులపాటు పరమత సహనంకోసం, ఒక మతాన్ని గౌరవించడం కోసం దానికి దూరంగా ఉండటానికి ఇబ్బందేమిటని జస్టిస్ కట్జూ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కూడా లోగడ ప్రశ్నించింది. గుజరాత్, రాజస్థాన్‌లలో జైనులు ఎక్కువగా ఉంటారు గనుక ఆ రాష్ట్రాల్లో వారితోపాటు కొన్ని రోజులు మాంసాహారాన్ని త్యజించడం నిర్హేతుకమేమీ కాదని సుప్రీంకోర్టు అప్పట్లో అన్నదిగానీ ఇప్పుడా నిషేధం మరో రెండు రాష్ట్రాలకు కూడా పాకింది.
అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించే జైన మత విశ్వాసాలను... పర్యూషణ్ సమయంలో వారు పాటించే నిష్టను అందరూ గౌరవిస్తారు. ముఖ్యంగా జైనుల ఆహారపుటలవాట్లు వారికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశితంగానో మనవల్ల క్రిమికీటకాలకు హాని జరిగినా అది దుష్కర్మేనని ఆ మతం చెబుతుంది. వారి దృష్టిలో శాకాహారమంటే కేవలం మాంసాన్ని తినకపోవడం మాత్రమే కాదు... ఆయా రుతువుల్లో దొరికే కాయగూరలనూ, పండ్లనూ తినడం... వాటిని కూడా తక్కువగా తినడం, ఆ ఆహారాన్ని అందరితో పంచుకోవడం. భూమి, నీరు, అగ్ని, వాయువు, వృక్షాలు వగైరాలను నిర్లక్ష్యం చేసే వ్యక్తి వాటితో పెనవేసుకుని ఉండే తన తన సొంత అస్తిత్వానికి సైతం ముప్పు తెచ్చుకునే స్థితికి చేరుతున్నాడని ఒక సందర్భంలో వర్ధమాన మహావీరుడు చెబుతాడు. ఇలాంటి సిద్ధాంతాలను ప్రబోధించే మతాన్ని గౌరవించడం, దాని భావాలను ఇష్టపడి ఆ మతస్తులతోపాటు కనీసం పర్యూషణ్ పండగ సమయంలోనైనా కలిసి నడవాలనుకోవడం మంచిదే. అలా ఎవరైనా చేస్తామంటే దాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలి.
అయితే, ఈ సిద్ధాంతాలను వివరించి, జైన మతం గొప్పదనాన్ని, అందులోని పర్యావరణ అనుకూల స్పర్శను, దానివల్ల మానవాళికి కలిగే ఉపయోగాలను వివరించడం వేరు... ఏకపక్షంగా ఒక ఉత్తర్వు జారీ చేసి ఫలానా రోజు వరకూ మాంసం అమ్మవద్దని, తినొద్దని నిషేధాలు విధించడం వేరు. మొదటిది ఒక మతంపై అవగాహనను పెంచి, దాంతో సహానుభూతిని కలిగిస్తుంది. వేరొకటి ఎందుకో, ఏమిటో తెలియకుండా బలవంతంగా రుద్ది... ఒక మంచి భావనపై అనవసర దురభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఇలాంటి నిషేధాలెందుకని ప్రశ్నించినవారిని... చాన్నాళ్లుగా ఉన్నదనో, ఫలానా కాలంలో అమలు చేశారనో దబాయించడం సరికాదు.
అలా ఎవరు చెప్పినా-ప్రభుత్వాలైనా, న్యాయస్థానాలైనా- సరికాదు. మన దేశంలో పుట్టుకనేది చాలావాటిని నిర్ణయించినట్టే తినే ఆహారాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎక్కడ పుట్టి పెరిగారన్న అంశాన్నిబట్టి ఎవరి ఆహారపుటలవాట్లయినా ఉంటాయి. మాంసాహారం, శాకాహారాల్లో ఏది మంచిదనే చర్చ చాన్నాళ్లుగా ఉంది. మాంసాహారం తినేవారు కూడా కొన్ని సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు తగ్గించడమో, పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. ఇలా వ్యక్తిగత ఇష్టాయిష్టాలనుబట్టి, అవసరాలనుబట్టి నిర్ణయించుకోవడం సహేతుకమవుతుంది. ఒక చట్టం ద్వారానో, ఒక ఉత్తర్వు ద్వారానో మాన్పించాలని చూడటం నియంతృత్వమవుతుంది.
ఇప్పుడు బృహన్ ముంబై కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారిలో రకరకాల వారున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి మద్దతు పలుకుతున్న శివసేన కూడా ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. దీన్ని ఖండిస్తూ మాంసాహారాన్ని విక్రయించింది. ఆ పార్టీకున్న అభ్యంతరమల్లా ఒక్కటే. చాన్నాళ్లుగా పర్యూషణ్ సందర్భంగా కేవలం రెండు రోజులే ఉంటున్న నిషేధాన్ని ఇప్పుడు ఎందుకు పొడిగించాల్సివచ్చిందని అది ప్రశ్నిస్తోంది.
ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించినప్పుడు బొంబాయి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. ఈ ఉత్తర్వులో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు... అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని అక్కడి అడ్వొకేట్ జనరల్ జవాబిచ్చారు. నిషేధించడానికి ముందు అందుకు సంబంధించి ప్రభుత్వంలో ఏ కసరత్తూ జరగలేదని దీన్నిబట్టే తెలుస్తుంది. చివరకు ఇలాంటి నిషేధం ముంబై వంటి నగరంలో సరికాదని హైకోర్టు తేల్చింది.
మరికొన్నాళ్లలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జైనుల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిషేధానికి దిగిందన్న కొందరు ఆరోపిస్తున్నారు. అది నిజమైనా కావొచ్చు. ఏం చదవాలో, ఏం ఆలోచించాలో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో నిర్దేశించడం మొదలుపెట్టి ఇప్పుడు వంటింట్లో ఏం వండాలో నిర్ణయించే దశకు మన ప్రభుత్వాలు చేరుకున్నాయని ఈ నిషేధ పరంపర తెలియజెబుతోంది. ఇంకా నగుబాటుపాలు కాకముందే ఈ వేలంవెర్రికి స్వస్తి పలకడం మంచిదని పాలకులు తెలుసుకోవాలి.
బ్యాన్... బ్యాన్!
Published Sat, Sep 12 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM
Advertisement