
ఇంత దురన్యాయమా!
దళితులపై అఘాయిత్యాలు సాగించడంలో అపకీర్తి గడించిన హరియాణాలో మూడు రోజులక్రితం అర్ధరాత్రి వేళ ఓ ఇంటికి నిప్పుపెట్టి ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకున్న వైనం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ముక్కుపచ్చలారని ఆ పిల్లలిద్దరూ లోకమంటే ఏమిటో తెలియనివారు. ఇక్కడ కుల వివక్ష ఉన్నదని, అది ప్రాణాలు తోడేసేంత ప్రమాదకరమైనదని వారికి అసలే తెలియదు.
ఫరీదాబాద్ జిల్లా సంపేడ్ అనే గ్రామంలో వారిద్దరూ అమ్మానాన్నలతో కలిసి ఆదమరిచి నిద్రపోతున్న వేళ దుండగులు కొందరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. క్షణాల్లోనే వారిద్దరూ మంటలంటుకుని ఆనవాళ్లు మిగలకుండా బూడిదైపోయారు. అక్కడకు దగ్గర్లో ఉన్న పౌరులు ఆ ఇంట చెలరేగుతున్న మంటల్ని గమనించి పరుగున వెళ్లి తలుపుల్ని బద్దలకొట్టకపోయి ఉంటే వారి అమ్మానాన్నలు కూడా దహనమైపోయేవారు. వారిప్పుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు.
ఒక కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టడానికి జరిగిన ఈ ప్రయత్నం వెనకున్న కారణమేమిటి? ఆ కుటుంబ పెద్ద జితేందర్ గూండానో, రౌడీనో కాదు. ఆయనపై ఎలాంటి నేరారోపణలూ కూడా లేవు. కనుక ఎవరికైనా ఆయనపై కక్ష ఉండటానికి వీల్లేదు. ఆర్‌ఎంపీగా పనిచేస్తూ జబ్బు పడిన నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్నాడాయన. ఆ గ్రామంలో కొన్ని రోజులక్రితం జరిగిన రెండు హత్యలకు సంబంధించిన కేసులో అతని సోదరుడు ముద్దాయి. ఆ ఒక్క కారణాన్నీ ఆసరా చేసుకుని జితేందర్ కుటుంబంపై దుండగులు దాడి చేశారు.
సంబంధం లేని వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమే కాదు...అతని కుటుంబాన్ని మొత్తం అంతమొందించడానికి వారు తెగించారు. దళితులపై ఆధిపత్యం చలాయించాలని చూడటం, ఆ పోకడల్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం సంపేడ్ గ్రామంలో ఎప్పటినుంచో సాగుతున్నదే. కొన్ని రోజులనాడు ఠాకూర్ కులానికి చెందిన ఒకరు మురికి కాల్వలో సెల్‌ఫోన్ జారవిడ్చుకుని దాన్ని తీసివ్వమని దళితుల్ని కోరడంతో వివాదం మొదలైంది.
ఆ పని తాము చేయబోమని వారన్నందుకు ఠాకూర్ కులస్తులు ఆగ్రహించి అవమానించడం...అందుకు దళితులు కూడా దీటుగా జవాబివ్వడంతో రాజుకున్న వివాదం చివరకు ఇద్దరు ఠాకూర్ కులస్తుల హత్యకు దారితీసిందంటున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పోలీసులు అత్యంత జాగురూకతతో వ్యవహరించి ఉండాలి. ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఠాకూర్‌లు దళితులపై దాడి చేస్తారన్న స్పృహ ఉండాలి. కానీ అది కొరవడటం మూలంగా వివాదంతో సంబంధమే లేని కుటుంబం దుండగుల దాడిలో అన్యాయమైపోయింది.
సంపేడ్‌లో దళితులు ఆగ్రహించి, జాతీయ రహదారి దిగ్బంధించాక హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు అంగీకరించింది. బాధిత కుటుంబానికి అన్నివిధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. నిందితుల్లో దాదాపు అందరినీ అరెస్టు చేశారు కూడా. బిహార్ ఎన్నికల అవసరం తెచ్చిన ఒత్తిడి ఉండకపోతే ఇంత వేగంగా స్పందన ఉండేదా అన్నది అనుమానమే. ఎందుకంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లాగే హరియాణాలో కూడా దళితులు దారుణమైన కుల వివక్షనూ, దానిని అనుసరించి ఉండే హింసనూ ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర జనాభాలో 20 శాతంగా...అంకెల్లో చెప్పుకోవాలంటే రెండున్నర కోట్లుగా ఉన్న దళిత జనాభా ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితులున్నాయి. అక్కడ గత పదిహేనేళ్లలో దళితులపై అఘాయిత్యాలు ఏడు రెట్లు పెరిగాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2000 సంవత్సరంలో దళితులపై 117 దాడులు జరిగినట్టు నమోదైతే నిరుడు వాటి సంఖ్య 830. ఇవన్నీ...దళితులకు ఎంతో కొంత ఆసరా దొరికి ఫిర్యాదు చేయడంవల్లా, ఆ కేసుల్ని కప్పెట్టడం పెత్తందార్లకు సాధ్యం కాకపోవడంవల్లా బయటపడినవి మాత్రమే. ఫిర్యాదు చేయడం సాధ్యం కానివీ, చేసినా పోలీసులు పట్టించుకోనివీ ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవాల్సిందే. పోనీ నమోదైన కేసుల్లో కూడా దర్యాప్తులు సక్రమంగా సాగటం లేదు.
నిందితులుగా ఉంటున్నవారు నిర్దోషులుగా బయటపడుతున్నారు. కేవలం 12 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగిలిన 88 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటికొస్తున్నారు. దళితులపై పదే పదే దాడులెందుకు జరుగుతున్నాయో, అలా దాడులకు పాల్పడేవారికుండే ధీమా ఏమిటో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ఒక్క హరియాణా మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నిరుడు వివిధ రాష్ట్రాల్లో దళితులపై నేరాలకు సంబంధించి నమోదైన కేసులు 47,064.
దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులూ, నాయకులు చేసే వ్యాఖ్యానాలూ ఆ దాడుల్ని మరింత ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి.
సంపేడ్ ఉదంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఇది అసలు కుల వివక్షకు సంబంధించిన కేసే కాదని తర్కించారు. మురికి కాల్వలో పడేసుకున్న ఫోన్‌ను దళితులను తీయమనడం, అందుకు నిరాకరించారన్న కోపంతో దాడి చేయడం ఆయనకు కుల వివక్షగా కనబడకపోవడం ఆశ్చర్యకరం. ఆయన తీరే అలా ఉందనుకుంటే కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందన మరింత దారుణం. కుక్కను ఎవరో రాళ్లతో కొడితే అందుకు కూడా ప్రభుత్వానిదే బాధ్యతా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వం వెంటనే మేల్కొని ఆయనతో సారీ చెప్పించింది. సమస్య అది కాదు. దళితులపై దాడులకు సంబంధించి మన నేతల ఆలోచనా విధానం ఇంత నేలబారుగా ఉండటంవల్లే ఈ బాపతు దాడులు పదే పదే చోటు చేసుకుంటున్నాయి.
ఎంతో పరిమిత స్థాయిలోనైనా దళితులు తమ హక్కుల గురించి చైతన్యం తెచ్చుకోవడం, సంఘటితం కావడానికి ప్రయత్నించడం, సవాళ్లు ఎదురైనప్పుడు నిలదీయడానికి ధైర్యం చేయడం వంటివి పెత్తందారీ కులాలకు కంటగింపుగా ఉంటున్నాయన్నది వాస్తవం. దళితులకు ఉద్యోగాల్లో, అధికార పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వంటివి కొంతమేరకు ఉపయోగపడుతున్నా...అవి మాత్రమే ఆ వర్గాలవారి ఉన్నతికి దోహదపడలేవు. సామాజికంగా ఎదుర్కొనే వివక్ష అంతం కావాలంటే ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోతున్న అలసత్వం వదలగొట్టాలి. పెత్తందారీ కులాలకు అండదండలందించే పోకడలను పాలకులు వదులుకోవాలి. అవి జరగనంతవరకూ సంపేడ్ ఉదంతాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.