
అనంతరం : పేరు తండ్రిది... ప్రఖ్యాతి తనది!
వస్తాయని చెప్పవచ్చు. కానీ పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, మొదటిది జీన్స్‌ని బట్టి జరుగుతుంది.
తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు
వస్తాయని చెప్పవచ్చు. కానీ పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, మొదటిది జీన్స్‌ని బట్టి జరుగుతుంది. రెండోది వాళ్లు పెరిగే పరిస్థితులు, పరిసరాలు, పెంచుకున్న ఆసక్తులను బట్టి జరుగుతుంది. ప్రముఖ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ పిల్లల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
దిలీప్ వెంగ్‌సర్కార్... ఒకప్పుడు దేశమంతా మోగిపోయిన పేరు. క్రికెట్ క్రీడకు వన్నె తెచ్చినవాళ్లలో ఈయన స్థానం ప్రముఖమైనదే. అంత గొప్ప ఆటగాడికి కొడుకు పుడితే... మరో గొప్ప క్రీడాకారుడు పుట్టాడు అన్నారంతా. ఆ మాటలకు వెంగ్‌సర్కార్ మురిసిపోయారు. అన్నాళ్లూ క్రికెట్ బ్యాట్‌ని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్న ఆయన... తన వారసుడిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు. కానీ ఆయన అప్పుడు ఊహించి ఉండరు... తన కొడుకు చేతిలో క్రికెట్ బ్యాట్ కాదు, కెమెరా ఉంటుందని.
తన పేరు వెనుక వెంగ్‌సర్కార్ అనే ఓ గొప్ప క్రీడాకారుడి పేరు ఉన్నా... ఆ పేరును, ఆ పేరు గల వ్యక్తిని తప్ప ఆ క్రీడను ప్రేమించలేకపోయాడు నకుల్. అలాగని తనకి ఆటలంటే అనాసక్తి ఏమీ లేదు. స్కూల్లో గోల్ఫ్, బాస్కెట్‌బాల్, క్రికెట్ ఆడేవాడు. అయితే క్రికెట్ మీద దృష్టి కేంద్రీకరించాలన్న ఆలోచన మాత్రం అతడికెప్పుడూ రాలేదు. ఎందుకు అంటే చాలా స్పష్టమైన సమాధానం చెబుతారు నకుల్. ‘‘మారుమూల గల్లీలోకి వెళ్లినా, క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంటారంతా. ప్రతి కుర్రాడూ దేశం తరఫున ఆడేయాలని కలలు కంటూ ఉంటాడు. నాకూ క్రికెట్ అంటే ఇష్టమే. కానీ దాన్నే జీవితంగా మార్చుకునేంత ఇష్టం మాత్రం లేదు’’... ఇదీ నకుల్ సమాధానం.
వెంగ్‌సర్కార్‌కి కొడుకు బ్యాట్ పట్టుకుంటే చూడాలన్న ఆశ అంతర్లీనంగా ఉన్నా... ఆ ఆశ తన కొడుక్కి బలహీనత కాకూడదని అనుకున్నారు. అందుకే అతడు ఆర్కిటెక్ట్ అవుతానంటే సరే అన్నారు. ఇటలీ వెళ్లి, ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాడు నకుల్. కానీ అక్కడ అతడికెందుకో ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. కనిపించిన ప్రతి దృశ్యాన్నీ లెన్సులో బంధించడం మొదలుపెట్టాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేసి ముంబై వచ్చినా... ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా... అతడి మనసంతా ఫొటోగ్రఫీ మీదే. దాంతో తను తీసిన నలభై మూడు ఛాయాచిత్రాలతో ప్రదర్శన నిర్వహించాడు. వచ్చిన స్పందన అతడి తండ్రిని ఆశ్చర్యపరిచింది.
‘‘ఆ రోజు నాకింకా గుర్తుంది. వచ్చినవాళ్లంతా నా చిత్రాలను, నా ఫొటోగ్రఫీని పొగుడుతుంటే నాన్న కళ్లలో గర్వం! అప్పుడే అర్థమైంది... నేను ఎంచుకున్న మార్గం సరైనదేనని’’ అని చెబుతాడు నకుల్. ఒకవేళ తాను క్రికెటర్ కాలేదని నాన్నలో ఎక్కడైనా కాస్త బాధ ఉండి ఉంటే ఆ రోజు పూర్తిగా తొలగిపోయి ఉంటుంది అంటాడు. కానీ ఆయన అలా బాధపడే వ్యక్తి కాదు అన్నది వెంగ్‌సర్కార్ కూతురు పల్లవి అభిప్రాయం. పల్లవి కూడా తన సోదరుడు నకుల్‌లాగే వైవిధ్యంగా ఆలోచించింది. తండ్రి పేరుతో గుర్తింపు పొందడం కాదు, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని తపన పడిందామె. మోడల్ అయ్యి ఇంట్లోవాళ్లను ఆశ్చర్యపర్చింది. నాన్న తమ మనసు తెలుసుకునే నడుచుకున్నారు తప్ప, ఇది చెయ్యండి, ఇలా అవ్వండి అని ఏ రోజూ బలవంతపెట్టలేదు అంటుందామె.
ఎవరి జీవితం ఎప్పుడే మలుపు తీసుకుంటుందో, ఎవరినెక్కడికి చేరుస్తుందో చెప్పలేమనడానికి నకుల్, పల్లవిలే మంచి ఉదాహరణ. బ్యాట్, బంతి, పిచ్, నెట్ ప్రాక్టీస్ అన్న పదాలే వింటూ పెరిగినా... వారినవి ఆకర్షించలేకపోయాయి. కానీ పెద్దయ్యాక పరిచయమైన ఆర్కిటెక్చర్, ఫొటోగ్రఫీ, మోడలింగ్ లాంటివి పెద్ద ప్రభావమే చూపాయి. వారిని సొంతగా ఎదిగేలా చేశాయి. తన ఇష్టాన్ని వారి మీద రుద్దకుండా, వారి నిర్ణయాలను గౌరవించిన వెంగ్‌సర్కార్ ఇప్పుడు తన బిడ్డల్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. వాళ్లు తన బాటలో నడవకపోయినా, తన పేరు నిలబెట్టారంటూ పొంగిపోతున్నారు!
- సమీర నేలపూడి