కార్పొరేట్ దిగ్గజాలను కలవడం దగ్గరనుంచి సిలికాన్ వ్యాలీ సందర్శన వరకూ... సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై జరిగే సదస్సు మొదలుకొని... భద్రతామండలి విస్తరణ అవసరాన్ని తెలియజేయడం వరకూ ఎన్నో అంశాలు ఇమిడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తీరిక లేకుండా సాగుతున్నది. సుస్థిరాభివృద్ధిపై ఐక్య రాజ్యసమితి నిర్వహించిన ప్రత్యేక శిఖరాగ్ర సదస్సులో వాతావరణ కార్యాచరణకు ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కదలాల్సిన అవసరాన్ని తెలియజెబుతూ పునర్వి నియోగ ఇంధన వనరులను నూతన విధానాల ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు వివిధ దేశాల మధ్య సహకారం ఉండాలని మోదీ ప్రతిపాదించారు.
అలాగే పర్యావ రణానికి చేటు కలిగించే జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరమున్నదని పరోక్షంగా పారిశ్రామిక దేశాలకు ఆయన చెప్పిన హితవు కూడా ఎన్నదగినదే. ఈ ప్రత్యేక శిఖరాగ్ర సదస్సు సుస్థిరాభివృద్ధికి సంబంధించి కొత్త సంకల్పాన్ని చెప్పుకుంది. 2030 నాటికల్లా ప్రపంచ రూపురేఖల్ని మార్చేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వెలువరించింది. ఇందులో 17 ప్రధాన లక్ష్యాలు న్నాయి. వాటికి అనుబంధంగా ఉప లక్ష్యాల ప్రకటనా ఉంది. వచ్చే పదిహేనేళ్లలో పేదరికాన్ని రూపుమాపడంతోపాటు ఆకలిని, వ్యాధులనూ తరిమి కొట్టడం, పర్యా వరణ విధ్వంసాన్ని నివారించడం, స్త్రీ-పురుష సమానత్వం, ఆహార భద్రత, నాణ్య మైన విద్య, ఉపాధి కల్పన వరకూ అందులో ఉన్నాయి.
ఈ లక్ష్యాలు, ఉపలక్ష్యాలు సాధించడం సామాన్యమైన విషయం కాదు. ప్రపంచ దేశాలన్నీ చురుగ్గా పాల్గొని ఈ మహా యజ్ఞంలో భాగస్తులైతే తప్ప... ఎక్కడికక్కడ ఇవి రాజకీయ లక్ష్యాలుగా మారితే తప్ప వీటిని సాధించడం సాధ్యం కాదు. ఇందుకోసం మొత్తంగా దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము అవసరమవు తుందన్న అంచనాలున్నాయి. ధనిక దేశాలు పర్యావరణ విధ్వంసంలో తమ పాత్రేమిటో గుర్తించి దాన్ని సవరించుకోవడంతోపాటు పేద దేశాల మనుగడకు, అభివృద్ధికి పూచీ పడాల్సిన బాధ్యత ఉన్నదని తెలుసుకుంటే తప్ప ఇంత విస్తృత మైన కార్యాచరణ ప్రణాళిక నెరవేరదు. భారత్ తన వంతుగా 2022కల్లా పునర్విని యోగ ఇంధన వనరుల ఆధారంగా లక్షా 75 వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నదని...ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచి, నదులను ప్రక్షాళన చేసి పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయదల్చుకున్నామని మోదీ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి.
అయితే ఆచరణలో ఇందుకెదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించడంలోనే వాటి విజయం ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పేరిట వర్ధమాన దేశాల ప్రాధాన్యతల్లో ధనిక దేశాలు చొరబడే ప్రయత్నం చేయడాన్ని మోదీ నిర్మొహమాటంగానే ప్రస్తావిం చారు. ఈ సందర్భంగా ఆయన ‘వాతావరణ న్యాయం’ అవసరమని ప్రతిపాదిం చారు. ఇందులో అసంబద్ధమేమీ లేదు. పారిశ్రామిక దేశాలు భారీయెత్తున కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడిచిపెడుతున్నాయి. అదే సమయంలో వర్ధమాన దేశాలను సమాన బాధ్యుల్ని చేయాలని చూస్తున్నాయి. ఈ ధోరణిని మార్చుకోన ట్టయితే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధన సాధ్యంకాదు.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా భారత్‌తోపాటు మరికొన్నిటికి చోటీయాలన్న డిమాండ్‌ను ఈసారి మరింత గట్టిగా వినిపించే ప్రయత్నం జరిగింది. ఇందుకు అలాంటి హోదాను ఆశిస్తున్న జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లను కూడగట్టాలన్న మోదీ సంకల్పం నెరవేరింది. జీ-4 శిఖరాగ్ర సదస్సు పేరిట న్యూయార్క్‌లో నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశం మండలిని అర్ధవంతమైన రీతిలో సంస్కరించాలని, విస్తృతం చేయాలని డిమాండ్‌చేసింది. ఈ డిమాండ్ సాధనకు సభ్యదేశాలన్నిటినీ కూడగట్టాలని తీర్మానించింది. అయితే ఇది నెరవేరడం అంత సులభం కాదు. ఇందుకు రెండు రకాల అడ్డంకులుంటాయి. అయిదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు యథాతథ స్థితిని మార్చడానికి సిద్ధంగా లేవు. అయితే ఆ సంగతిని అవి బహిరంగ పరచడం లేదు. వీటిలో చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ భారత్‌కు శాశ్వత సభ్యత్వం రావడానికి కావలసిన అర్హతలున్నాయని అనడం తప్ప... అది సాకారం కావడానికి అవసరమైన చర్యలకు సిద్ధపడటం లేదు.
సకల దేశాలూ పాల్గొన్న ప్రపంచ శిఖరాగ్ర సదస్సు పదేళ్ల క్రితమే భద్రతామండలి రూపురేఖల్ని మార్చాలని పిలుపునిచ్చినా శాశ్వత సభ్య దేశాలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాయి. మరోపక్క మండలిని సంస్కరించడంవల్ల మనకొచ్చే లాభమేమిటని సమితి సభ్య దేశాలు అనుకుంటున్నాయి. ఆ దేశాలన్నిటినీ కలిసి, తమనూ శాశ్వత సభ్య దేశాలుగా మారిస్తే వాటికొచ్చే ఉపయోగమేమిటన్నది భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లు వివరించి ఒప్పించగలిగితే వేరు. ఈ మొత్తం వ్యవహారం అవాస్తవిక అంచనాలపై ఆధారపడిందన్న మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు కొట్టివేయదగ్గవి కాదు.
ఒకప్పుడు గదర్ పార్టీ వంటి తిరుగుబాటు సంస్థకు పురిటిగడ్డగా, ఇప్పుడు డిజిటల్ ప్రపంచ శాసనకర్తగా ఉన్న సిలికాన్ వ్యాలీలోఆదివారం మోదీ ప్రసంగించి అందరినీ ఆకట్టుకోగలిగారు. డిజిటల్ ఇండియా నిర్మాణంలో పాలుపంచుకోమని కార్పొరేట్ దిగ్గజాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకు వారినుంచి వచ్చిన స్పందనా దీటుగానే ఉంది. సమాచార సాంకేతికతను సామాన్యులకు చేరువచేసి, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆశించాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామాను మంగళవారం కలవడంతో ముగిసే మోదీ పర్యటన ద్వైపాక్షిక, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో...డిజిటల్ ఇండియా నిర్మాణంలో ఏమేరకు దోహదపడిందో రాగలకాలంలో తెలుస్తుంది.
మోదీ అమెరికా పర్యటన
Published Mon, Sep 28 2015 1:35 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement