మోదీకి స్వాగతం పలికేందుకు సిలికాన్ వ్యాలీ ప్రోటోకాల్ అధికారులు ప్రత్యేకంగా తయారుచేయించిన రెడ్ కార్పెట్ ఇదే.
అక్కడ రోజులు, విషయాలు సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. సీఈవోల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు క్యాజువల్ టీషర్ట్స్ ధరించి..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన టెక్ సాధనాలను నడిపించేపనిలో ఉంటారు. ఒక్క ఉద్యోగులనే కాదు నాన్ టెక్నికల్ స్టాఫ్, ఉద్యోగులకు భోజనాలు తయారు చేసే చెఫ్ లు, ఆఫీస్ బాయ్ లు లక్షల మందికి అసలు డ్రస్ కోడ్ అనేదే లేదు. కానీ శనివారం మాత్రం పరిస్థితి తలకిందులైంది. వీకెండ్ అయినప్పటికీ విశిష్ట వ్యక్తి వస్తున్నందున తమంతట తామే క్యాజువల్ నుంచి ఫార్మల్స్ లోకి మారిపోయారు సిలికాన్ టెక్కీలు.. ఆయా కంపెనీల సీఈవోలూ! 'అవును భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం క్యాజువల్ సిలికాన్ వ్యాలీ ఫార్మల్ గా మారిపోయింది' అంటూ అమెరికా మీడియాలో ఒకటే వార్తలు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కాలిఫోర్నియాలోని మినేటా శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి అరుదైన ఘన స్వాగతం లభించింది. 33 ఏళ్ల తర్వాత అక్కడ అడుగుపెడుతోన్న భారత ప్రధానిని సగర్వంగా ఆహ్వానిస్తూ 30 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పులతో ప్రత్యేకంగా తయారుచేయించిన రెడ్ కార్పెట్ ను పరిచారు సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ అధికారులు. 'హాలీవుడ్ నటుడు జోయ్ పెస్కి('ర్యాగింగ్ బుల్' ఫేమ్) సలహామేరకు న్యూజెర్సీకి చెందిన రెడ్ కార్పెట్ స్లోర్స్ డాట్ కామ్ వారిచే ప్రత్యేక రెడ్ కార్పెట్ ను తయారుచేయించాం' అని సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ చీఫ్ డియాన్నా ట్రయాన్ తెలిపారు. కాగా, తొలిసారిగా అమెరికాకు వచ్చిన పోప్ ప్రాన్సెస్ కు ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన స్వాగత వేడుకలోనూ ఇదే కంపెనీ తయారుచేసిన తెలుపు రంగు కార్పెట్ ను వినియోగించినట్లు చెప్పారు.