స్టీవ్ జాబ్స్ తరచూ ఇండియా వచ్చింది అందుకే..
ఇండియా కేవలం ఒక విపణే కాదు ప్రపంచానికి ఉద్దీపనం కూడా. అందుకే అక్కడి నుంచి స్ఫూర్తి పొందేందుకు యాపిల్ కంపెనీ దివంగత సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తరచూ ఇండియాకు వచ్చేవారని ప్రస్తుత యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రముఖ టెక్ దిగ్గజాల భేటీకి టిమ్ కూడా హాజరయ్యారు. ఒక్కొక్కరితో దాదాపు 15 నిమిషాలపాటు విడివిడిగా సాగిన సమావేశంలో ఈ మేరకు టిమ్ తన మనోభావాలను మోదీతో పంచుకున్నారు.
'మోదీతో భేటీ బ్రహ్మాండంగా సాగింది' అని సమావేశం అనంతరం టిమ్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, క్వాల్కమ్ ప్రతినిధి పాల్ జాకబ్, సిస్కో సీఈవో జాన్ చాంబర్స్, అడోబ్ సీఈవో శాంతను నారాయెణ్, టైస్ వెంక్ శుక్లాలు కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
భారత్ ను నూతన ఆవిష్కరణలకు వేదికగా మలిచే ప్రక్రియలో నరేంద్ర మోదీ అతివేగంగా దూసుకుపోతున్నారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. 'గతేడాది నేను ఇండియాలోనే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ కచ్చితంగా మార్పు జరిగింది. భారత్ లో లాగే సిలికాన్ వ్యాలీలోనూ ఏదో సాధించాలని తపన పడే ఔత్సాహికులను కలిశా' అని పిచాయ్ పేర్కొన్నారు.