
అరుణగ్రహంపై నీటి జాడ
అంగారకుడిగా, కుజుడిగా, ధరణీగర్భ సంభూతుడిగా పేర్లున్న అరుణగ్రహం ఉపరితలంపై నీటి జాడ కనుగొన్నారు.
ఎన్నాళ్లుగానో పోటీపడుతున్న ఊహలూ, అంచనాలూ ఒక్కటైన సందర్భమిది. అంగారకుడిగా, కుజుడిగా, ధరణీగర్భ సంభూతుడిగా పేర్లున్న అరుణగ్రహం ఉపరితలంపై నీటి జాడ కనుగొన్నారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేసిన ప్రకటన...ఆ సందర్భంగా విడుదల చేసిన ఛాయాచిత్రాలూ అందరినీ సంతోషపరిచాయి.
నిర్మలాకాశంలో నిప్పుల బంతిలా, నిత్యం జ్వలిస్తూ కనబడే అరుణగ్ర హం దశాబ్దాలుగా అటు శాస్త్రవేత్తలనూ, ఇటు రచయితలనూ సమంగా ఆకర్షిస్తున్నది. ఆ గ్రహం ప్రధానాంశంగా ఎన్నెన్నో సైన్స్ ఫిక్షన్ నవలలు వచ్చాయి. ఇటు అంతరిక్ష శాస్త్రం విస్తరిస్తున్నకొద్దీ...టెలిస్కోప్‌ల శక్తి పెరుగుతున్న కొద్దీ ఆ గ్రహంపై ఉన్నదేమిటో అంచనా వేసే సామర్థ్యం పెరిగింది. అక్కడ గీతలుగా కనిపిస్తున్నవి కాల్వలేనని, ఒకనాడు అక్కడ నీరు ప్రవహించిందని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత సముద్రంలా కనబడే ప్రాంతం కూడా వారి కంట పడింది. కనుక కోట్ల సంవత్సరాలక్రితం అంగారక గ్రహంపై జీవరాశి ఉండేదన్న అంచనాకొచ్చారు. అయితే ఇప్పుడు నాసా విడుదల చేసిన చిత్రాలు ఈ క్రమంలో మరో ముందడుగు. గతంలో ఎప్పుడో అక్కడ నీరు పారిందని చెబుతూ వస్తున్న శాస్త్రవేత్తలు ఈసారి అక్కడ నీటి జాడ ఉన్నదని...అది ద్రవరూపంలోనే నిక్షిప్తమై ఉన్నదని స్పష్టంగా చెబుతున్నారు.
తొలిసారి 70వ దశకంలో వెలువరించిన ఛాయా చిత్రాల్లో ఇంకిపోయిన నదులు, సరస్సులు, మైదానాలు కనబడ్డాయి. అంగారకుడి ఉత్తరార్ధ గోళంపై పూర్తిగా వట్టిపోయినట్టు కనబడుతున్న మహా సముద్రం ఆనవాళ్లు కనుగొన్నామని ఈ ఏడాది మొదట్లో నాసా తెలిపింది. ఆ పరంపరలో తాజా సమాచారం ఒక ముందడుగు. వేసవి సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 23 సెల్సియస్ కన్నా పెరిగినప్పుడు ఇది ప్రవహిస్తుందని, అంతకన్నా పడిపోయినప్పుడు మాయమవుతుందని శాస్త్రవేత్తలు అంచనాకొస్తున్నారు. ఒక ఏటవాలు ప్రాంతంలో కనబడిన నీరంతా అతి సన్నని పొర మాదిరి విస్తరించి ఉన్నదని, దీన్ని కరిగిస్తే ఒక స్విమ్మింగ్ పూల్‌కు సరిపడా నీరు వచ్చే అవకాశం ఉన్నదని అంతరిక్ష నౌక పంపిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ణయానికొచ్చారు.
మన సౌర కుటుంబంలో నీరుండటానికి ఆస్కారమున్న గ్రహంగా భావించింది ఒక్క అంగారకుణ్ణి మాత్రమే. అందుకు సంబంధించి ఎంతో కొంత సమాచారం లభిస్తున్నా శాస్త్రవేత్తలను అది పూర్తిగా సంతృప్తిపరచలేదు. ఒకప్పుడు ఉండేదన్న సమాచారం వారి జ్ఞానతృష్ణను తీర్చలేకపోయింది. ఇప్పుడు ఏటవాలు ప్రాంతంలో ప్రవాహజాడ కనబడింది గనుక దాని పుట్టుక ఎక్కడన్న అంశంపై వారు దృష్టి సారించారు. అలాగే ఎంతో సూక్ష్మ స్థాయిలోనైనా సరే జీవరాశి మనుగడకు ఆ ప్రవాహాలు ఆస్కారం కల్పించి ఉండొచ్చునని వారు విశ్వసిస్తున్నారు. మన భూమ్మీద నీటి వనరులు అసలే లేని అటకామా ఎడారిలో అతి సూక్ష్మ జీవికి నీటిలోఎన్నడో కరిగి నిక్షిప్తమై ఉన్న లవణాలే జీవనాధారం. ఇప్పుడు అంగారకుడిపై కూడా ఇలా లవణరూపంలోని ఖనిజాలు కనబడ్డాయి గనుక ఏదో ఒక రూపంలో సూక్ష్మజీవులు ఉండొచ్చునన్నది శాస్త్రవేత్తల ఆలోచన.
అంగారక గ్రహంపై రెండేళ్లక్రితం మన దేశం పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)తో సహా ప్రస్తుతం అయిదు అంతరిక్ష నౌకలు అన్వేషణ సాగిస్తున్నాయి. 18 వ శతాబ్దంలో విలియం హెర్షెల్ తొలిసారి టెలిస్కోప్ ద్వారా అక్కడి ధ్రువాల్లో మంచు పేరుకుపోయి ఉన్నట్టు కనుగొన్నాడు. ఆ తర్వాతి కాలాల్లో అక్కడికి అంతరిక్ష నౌకను పంపాలని శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరారు. 2000 సంవత్సరంలో మార్స్ ఆర్బిటర్ కెమెరా అక్కడి ఆకాశంలో తిరుగుతూ పంపిన ఛాయా చిత్రాలు అత్యంత సమీపంనుంచి తీసినవి. ఆ చిత్రాల్లో ఎండిపోయిన కాలువలు, బిలాలున్నట్టు వెల్లడైంది. 2008లో ఫీనిక్స్ పంపిన చిత్రాలు మరింత స్పష్టతనిచ్చాయి. ఫీనిక్స్ అక్కడి ఉపరితలంపై దిగి కొన్ని సెంటీమీటర్ల లోతున తవ్వింది. అక్కడి ఉష్ణోగ్రత గరిష్టంగా మైనస్ 140 డిగ్రీల సెల్సియస్...కనిష్టంగా మైనస్ 63 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చునని ఆ సమయంలో నిర్ధారించారు.
ప్రాణాంతకమైన రేడియేషన్ ఉన్నట్టు కూడా కనుగొన్నారు. 2011లో మార్స్ రికనాయిజెన్స్ ఆర్బిటర్(ఎమ్మార్వో) పంపిన ఛాయా చిత్రాలవల్ల అక్కడ గీతలు కనిపిస్తున్న రూపురేఖల్లో మార్పులు వస్తున్నాయని గ్రహించారు. ఇవి కాలాలను బట్టి మారుతుండవచ్చునని అంచనావేశారు. ఈ మార్పుల్లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నదని కూడా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం పంపిన ఛాయాచిత్రాల వల్ల ఆ విషయంలో శాస్త్రవేత్తలకు మరింత స్పష్టత వచ్చింది. వాస్తవానికి ఆర్బిటర్ పంపిన ఛాయా చిత్రాలు దానికున్న స్పెక్ట్రోమీటర్ ద్వారా తీసినవి. కెమెరాతో తీసే చిత్రాల్లా ఇవి స్పష్టతతో ఉండవు. పెద్దగా చేసి నిశితంగా పరిశీలించడం సాధ్యం కాదు. కానీ ఆ చిత్రాల్లోని రంగులను విశ్లేషించి వాటి ఆధారంగా ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుంది.
నాసా 2020లో మరో అంతరిక్ష నౌకను అంగారకుడిపైకి పంపాలని భావిస్తోంది. ప్రస్తుతం నీటి జాడ కనుగొన్నారు గనుక ఆ అంతరిక్ష నౌక విషయంలో శాస్త్రవేత్తలకు కాస్త బెంగ ఉంది. ఎలాంటి సూక్ష్మ జీవులకూ తావులేకుండా అత్యంత పరిశుభ్రమైన రీతిలో అది లేనట్టయితే పరిశోధనల్లో గందరగోళం ఏర్పడుతుంది. భూమినుంచి అది మోసుకెళ్లిన సూక్ష్మజీవులు అక్కడి నీటి పొరల్లో కలిస్తే పరిశోధన దారీతెన్నూ లేకుండా మారుతుంది. అలాగని రక్షణ చర్యలకు ఉపక్రమిస్తే ఆ నౌకలో అమర్చే ఎలక్ట్రానిక్ వ్యవస్థలూ, ఇతర పరికరాలూ మరింత సంక్లిష్టమైన డిజైన్లతో రూపొందించాల్సి ఉంటుంది. ఆ పనికి పూనుకుంటే ఆ ప్రయోగం ఇంకా ఆలస్యమైనా కావొచ్చు. అందుకే 2020లో పంపే అంతరిక్ష నౌకను ఇప్పుడు నీటి జాడ కనుగొన్న ప్రాంతంవైపు దింపకూడదని ఆ సంస్థ నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే అక్కడున్న క్యూరియాసిటీ అంతరిక్ష నౌకను కూడా ఆ ప్రాంతాలకు దూరంగా ఉండి ఛాయాచిత్రాలు పంపేలా నిర్దేశించారు.
మొత్తానికి తాజాగా వెల్లడైన సంగతులు అరుణగ్రహంపై మనకున్న అవగాహనను మరింత పెంచే దిశలో ఒక ముందడుగనే చెప్పాలి. ఒకప్పుడక్కడ అగ్ని పర్వతాలు బద్దలై ఉండొచ్చు...లావాలు ప్రవహించి ఉండొచ్చు. కానీ ఇప్పుడది గడ్డ కట్టుకుపోయి ఉన్న ప్రాంతం. కనుక మానవుడి మజిలీకి ఇంకా చాలా సమయం పట్టొచ్చు.