తీరుమారని సీబీఐ | no change in cbi working style | Sakshi
Sakshi News home page

తీరుమారని సీబీఐ

Published Sat, Aug 15 2015 5:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

తీరుమారని సీబీఐ

తీరుమారని సీబీఐ

మందలింపులతోనే అందరూ మారతారనుకుంటే పొరపాటు. కొందరు అలాంటి మందలింపులకు క్రమేణా అలవాటు పడి బండబారతారు. ఆ తర్వాత తీరు మార్చు కోవడం వారివల్ల కాదు. సీబీఐ ఇప్పుడు అలాంటి అవస్థలోనే ఉంది. ఈమధ్య రెండు కేసుల విషయంలో సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టు సీబీఐని నిశితంగా విమర్శించిన తీరుతో ఆ సంస్థ వ్యవహార శైలి మళ్లీ చర్చకొచ్చింది.

తన నివాసంలో అక్రమంగా టెలిఫోన్ ఎక్ఛేంజ్‌ను నెలకొల్పి ఖజానాకు నష్టం చేకూర్చిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్ అరెస్టు ప్రయత్నం... విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టాన్ని(ఎఫ్‌సీఆర్‌ఏ) ఉల్లంఘించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను అదుపులోకి తీసుకునే యత్నానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ అత్యుత్సాహాన్ని న్యాయమూర్తులు తప్పు బట్టారు. ఆ సంస్థ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేంద్రంలో అధికారం చేతులు మారింది. యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీయే సర్కారు వచ్చింది. కానీ సీబీఐ తీరు మాత్రం ఎప్పటిలానే ఉంది. బొగ్గు కుంభకోణం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు ఇప్పటికీ అది ‘పంజరంలో చిలుక’లాగే ప్రవర్తిస్తోంది. సంస్థ నిర్వాహకులు సున్నిత మనస్కులైతే, అంకితభావంతో పనిచేసేవారైతే, ప్రజలపట్ల తమకు జవాబుదారీతనం ఉంటుందని విశ్వసించేవారైతే సుప్రీంకోర్టు వ్యాఖ్య తర్వాతనైనా మారాలి. మరోసారి ఆ మాట అనిపించుకోకూడదన్న పట్టుదల ఉండాలి. ‘పంజరంలో చిలుక’ వ్యాఖ్యకు అప్పుడే రెండేళ్లొచ్చాయి. కానీ సీబీఐ ఇంకా అలాగే ఉన్నదని న్యాయస్థానాలు అభిప్రాయపడక తప్పలేదు.

సీబీఐ ఉన్నత శ్రేణి దర్యాప్తు సంస్థ. దేశంలో ఏమూల ఏం జరిగినా, ఎవరిపై ఆరోపణలు వచ్చినా ఎవరైనా కోరేది సీబీఐ దర్యాప్తు జరిపించాలనే. ఆ సంస్థ కేసుల దర్యాప్తులో చూపిస్తున్న సామర్థ్యంవల్లే అందరూ అలా కోరుతున్నారని అనుకోనవసరం లేదు. వారికంతకన్నా గత్యంతరం లేదు. దేశంలో దాన్ని మించిన దర్యాప్తు సంస్థ లేదు మరి! ఏ కారణం చేత అయితేనేమి జనం కోరుతున్నారు గనుక కాస్తయినా మారాలని, సరిగా ప్రవర్తించాలని దాని నిర్వాహకులు ఎప్పుడైనా అను కున్న దాఖలాలు కనబడవు. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉండగా వరసబెట్టి అనేక కుంభకోణాలు వెలుగులోకొచ్చాయి.

కామన్వెల్త్ క్రీడల కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ఎన్నో స్కాంలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. వీటిలో కొన్నిటి పర్యవేక్షణను స్వయంగా సుప్రీంకోర్టే స్వీకరించింది. అయినా సరే సీబీఐకి నదురూ బెదురూ లేదు. ‘పంజరంలో చిలుక’ గా అభివర్ణించినప్పుడు ఆనాటి డెరైక్టర్ రంజిత్‌సిన్హా ఎంతో నొచ్చుకున్నారు. ‘ఏ శుభ కార్యానికెళ్లినా న న్ను చూసి చిలకొచ్చిందని వెటకారం చేస్తున్నార ’ని వాపోయారు. కానీ అనంతర కాలంలో ఆయన ఆ పాత్ర పోషణలోనే తరించారు. ఇది శ్రుతి మించి వివిధ కుంభ కోణాల్లోని నిందితులు ఆయన్ను ఇంటికొచ్చి కలిసే స్థితి ఏర్పడే సరికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఇకనుంచి జోక్యం చేసుకోరాదని హుకుం జారీచేసింది. ఆయనపై దర్యాప్తునకు ఆదేశించింది. అదింకా కొనసాగుతోంది.

ఇంత జరిగినా దయానిధి మారన్, తీస్తా సెతల్వాడ్ కేసుల్లో సీబీఐని న్యాయస్థానాలు మళ్లీ తప్పుబట్టాల్సివచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో మారన్ చట్టవిరుద్ధంగా 360 లైన్ల టెలిఫోన్ ఎక్ఛేంజ్‌ను ఏర్పాటు చేయించుకున్నారని, ఆయన కుటుంబానికి చెందిన సన్ టీవీ ఆ లైన్లను వాణిజ్యపరంగా వినియోగించుకున్నదనీ...ఇందువల్ల ఖజానాకు రూ. 1.20 కోట్లు నష్టం వచ్చిందని సీబీఐ ఆరోపిస్తున్నది. ఇందుకు సంబంధించి 2013లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.  ఈలోగా మారన్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఈ కేసులో ఆయనకు సహకరించిన అధికారులెవరినీ అరెస్టు చేయని సీబీఐ మారన్‌పైనే ఎందుకు శ్రద్ధ చూపుతున్నదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకు రాజకీయ కారణాలు లేవా అని నిలదీసింది. మీరే దర్యాప్తు చేస్తున్న యూపీ జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కుంభకోణంలో రూ. 8,000 కోట్ల నష్టం వాటిల్లినా ఇంతవరకూ ఒక్క నిందితుణ్ణయినా ఎందుకు అరెస్టు చేయలేదని అడిగింది. రూ. 1.20 కోట్ల స్కాంలో అరెస్టు కోసం తహతహలాడుతున్నవారు అంత పెద్ద కుంభ కోణంపై మౌనంగా ఉండిపోయారేమని ప్రశ్నించింది.

తీస్తా సెతల్వాడ్ కేసులోనూ బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి నచ్చని అభిప్రాయం కలిగి ఉన్నంతమాత్రాన అలాంటివారిని జాతీయ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ ప్రమాదకారులుగా చిత్రించడం తగదని చెప్పింది. తీస్తా దంపతులను అరెస్టు చేసి ప్రశ్నించాలన్న సీబీఐ వాదనను తోసిపుచ్చింది. ఆమె ఆధ్వర్యంలోని సంస్థలు సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, సబ్‌రంగ్ ట్రస్టులు పొందిన విరాళాలను నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రంగ్ కమ్యూనికేషన్స్, పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. ప్రచురణ  రంగంలోని సంస్థలు విదేశీ విరాళాలు స్వీకరించకూడదన్న నిబంధనను తీస్తా దంపతులు ఉల్లంఘించారని సీబీఐ చేస్తున్న ఆరోపణను న్యాయమూర్తి తోసిపుచ్చలేదు. అందుకు సంబంధించి వారిస్తున్న సంజాయిషీ ఏమిటో వారు దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే తెలుసుకో వచ్చునని, చట్టపరంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.  

2002నాటి గుజరాత్ నరమేథానికి సంబంధించి కొన్ని కేసులు కీలక దశకు చేరుకున్న తరుణంలో తాము వెలుపల ఉండరాదని కేంద్రం భావిస్తున్నదని...అందుకు అనుగుణంగా సీబీఐ పనిచేస్తున్నదని తీస్తా దంపతులు చేసిన ఆరోపణను న్యాయ స్థానం పరిగణనలోకి తీసుకుంది. అధికారంలో ఉన్నవారి ఆదేశాలను పాటించడం తప్ప సొంతంగా ఆలోచించే అలవాటు లేనందువల్లే ఈ రెండు కేసుల్లోనూ సీబీఐ ఇరకాటంలో పడాల్సివచ్చింది.

ఇలా కొన్ని కేసుల్లో అనవసర శ్రద్ధ చూపుతూ అతిగా వ్యవహరిస్తున్న సీబీఐ... వ్యాపం కుంభకోణంలో మాత్రం దర్యాప్తు తనవల్ల కాదని చేతులెత్తేసింది. తనవద్ద సిబ్బంది లేరని, అంత పెద్ద స్కాం దర్యాప్తు సాధ్యపడదని చెప్పింది.  ఇప్పటికైనా సీబీఐ తన వ్యవహార శైలిని సమీక్షించుకోవాలి. ఈ దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలో, నిరర్ధక సంస్థగా మిగిలి పోవాలో తేల్చుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement