ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. దానికి విచక్షణాజ్ఞానం ఉండదు. అది ఎక్కడ తలెత్తుతుందో, ఎప్పుడు కాటేస్తుందో అంచనా వేయడం కూడా అసాధ్యం.
ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. దానికి విచక్షణాజ్ఞానం ఉండదు. అది ఎక్కడ తలెత్తుతుందో, ఎప్పుడు కాటేస్తుందో అంచనా వేయడం కూడా అసాధ్యం. అయినా నిరంతర అప్రమత్తత, పటిష్టమైన నిఘా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే తీరు దాన్ని కాస్తయినా నియంత్రించడానికి ఉపకరిస్తాయి. ఇలాంటివన్నీ లోపిం చిన కారణంగానే మంగళవారం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న పాఠశాల నెత్తుటి మడుగైంది. ఆటోమేటిక్ రైఫిళ్లు, గ్రెనేడ్లు ధరించి వచ్చిన ఆరుగురు ముష్కరుల కిరాతకానికి 140మంది బలైపోయారు. వీరిలో దాదాపు 130మంది పదహారేళ్లు దాటని పసిమొగ్గలు.
ఏడు గంటలపాటు పాఠశాల మొత్తాన్ని స్వాధీనంలో ఉంచు కుని ఉగ్రవాదులు సాగించిన నరమేథం మాటలకందనిది. వారు ప్రతి తరగతి గదికీ వెళ్లి పిల్లలను గురిచూసి పొట్టనబెట్టుకున్న వైనం ప్రపంచ పౌరులందరినీ విస్మయపరిచింది. అత్యంత హృదయవిదారకమైన ఈ ఉదంతంలో టీచర్లతోసహా మరో 245మంది పిల్లలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. సైన్యం దాదాపు వేయిమంది విద్యార్థులను కాపాడగలిగింది. పొద్దుటే హడావుడిగా నిద్ర లేచి త్వరత్వరగా తయారై వెళ్లిన పిల్లలు ఇలా బళ్లోనే నెత్తుటి ముద్దలై బతుకు చాలిస్తారని వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు.
ఉగ్రవాదం అంటే ఏమిటో, అది జడలు విప్పి తాండవించడానికి కారణాలే మిటో బడి ఈడు పిల్లలకు తెలియదు. వారి లోకం వేరు. వారి సమస్యలు వేరు. బయటి ప్రపంచపు కల్మషాలను దరిదాపులకైనా రానీయని ఆ పసి పిల్లలపై ఉగ్రవాదం పంజా విసరగలదని ఎవరూ ఊహించలేరు. కానీ, చుట్టూ కాటేసే కాల నాగులున్నప్పుడు అడుగడుగునా జాగ్రత్త అవసరం. ప్రభుత్వమైనా, పౌరులైనా ప్రతి క్షణమూ ఆ ఎరుకతో ఉండటం ముఖ్యం. పెషావర్ ఉదంతంలో ముష్కరులు ఆర్మీ యూనిఫాం ధరించి సులభంగా పాఠశాలలోకి చొరబడగలిగారు.
వారు హఠాత్తుగా ఆకాశంనుంచి ఊడిపడినవారేమీ కాదు. ఎంతో దూరం ప్రయాణించి, ఎన్నో నిఘా నేత్రాలను తప్పించుకుని...అనేకమైన తనిఖీలను దాటుకుని అక్కడికొచ్చి ఉంటారు. ఇన్నిటిని అధిగమించి సెంట్రల్ పెషావర్‌లో పాకిస్థాన్ సైన్యం కోసం కేటాయించిన హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న పాఠశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోగలిగారంటే ఎవరి వైఫల్యం ఎంతనో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నది. పెషావర్‌కు ఉగ్రవాద దాడులు కొత్తేమీ కాదు. అక్కడ గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పంజా విసురుతూనే ఉన్నారు. ఇప్పుడు పెషావర్ ఘోరకలికి బాధ్యులమని ప్రకటించుకున్న తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ఉగ్రవాదులు గతంలో కూడా పెషావర్‌లో పలు దాడులు జరిపి వేలాదిమంది పౌరుల ఉసురుతీశారు.
ఉగ్రవాద ముఠాల విషయంలో పాకిస్థాన్ సైన్యమూ, ప్రభుత్వమూ అనుస రిస్తున్న వైఖరి కూడా ఉగ్రవాదం పెరగడానికి దోహదపడుతున్నది. బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం హతమార్చాక అల్ కాయిదా దాదాపు కోరలు తీసిన పామైంది. దాని ప్రాపకంలో ఖ్వాదత్ అల్ జిహాద్ అనే సంస్థ ఇటీవల పురుడుపోసుకుంది. ఇక ఎప్పటినుంచో మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలన్నిటికీ చాటుమాటు సాయం చేయడంలో, భారత్‌పై దాడులకు పురిగొల్పడంలో ఖ్యాతిగడించిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ ఐ, అక్కడి సైన్యం ఉత్తర వజీరిస్థాన్‌లో ఉన్న టీటీపీపై మాత్రం ఒంటికాలిమీద లేస్తున్నాయి.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలను ఆసరా చేసుకుని, 11 ఉగ్రవాద బృందాల కలయికగా ఏర్పడిన టీటీపీని అంతం చేయడం కోసం పాకిస్థాన్ సైన్యం నాటో సేనల అండతో తరచుగా దాడులు చేస్తున్నది. జర్బ్-ఎ-అజ్బ్ పేరిట పాక్ సైన్యం మొన్నటి జూన్‌లో ప్రారంభించిన ఆపరేషన్‌లో ఇంతవరకూ దాదాపు 1,300మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈమధ్యకాలం లో ఖైబర్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో కూడా టీటీపీకి చెందిన 179మందిని హతమార్చింది. ఈ దాడులకు ప్రతీకారంగానే తాము పాక్ సైనికుల పిల్లలు చదు వుకుంటున్న పాఠశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని టీటీపీ ప్రకటించింది. 2008 సెప్టెంబర్‌లో ముంబైలో దాడుల్లో 170మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు పాక్ గడ్డపైనుంచే వచ్చారు. ఉగ్రవాద ముఠాల విషయంలో పాటించే ద్వంద్వ ప్రమాణాలవల్ల అంతిమంగా దాని పెరుగుదలకే దోహదపడుతున్నామని ఇప్పటికైనా పాకిస్థాన్ గుర్తించాలి.
ఈ ఉదంతం జాతీయ విషాదమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఉగ్రవాదంపై చర్య తీసుకునే విషయంలో ఏకాభిప్రాయ సాధనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఇదొక సానుకూల పరిణామం. పాక్‌లో ఉగ్రవాదం విషయంలో పార్టీలన్నిటిదీ తలోదారి. అసలు ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్యే భిన్న దృక్పథాలున్నప్పుడు ఇదేమంత వింత కాదు. ప్రస్తుత ఘటన చోటుచేసుకున్న ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సా ఫ్ పార్టీ(పీటీఐ) అధికారంలో ఉంది. టీటీపీ ఉగ్రవాదులకు ఆ పార్టీ సహాయ సహకారాలున్నాయన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.
ఇలాంటివన్నీ పరిష్క రించుకుని దృఢ సంకల్పంతో ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఉగ్రవాదం అంతం కావడం అసాధ్యం. ఉగ్రవాదం ఏమి చెప్పుకున్నా, ఏ మతం పేరు పెట్టుకున్నా దానికి జాతి, మత, ప్రాంతాలనేవి ఉండవు. విచక్షణాజ్ఞానం అసలే ఉండదు. మాన వీయ విలువలనూ, నాగరిక సమాజ పునాదులనూ కూకటివేళ్లతో పెకిలిద్దామని చూస్తున్న ఉగ్రవాదాన్ని ఏరిపారేయకపోతే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉండగలవో చెప్పడానికి పెషావర్ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నుంచి గుణపాఠం గ్రహించి అన్ని దేశాలూ సమష్టిగా పోరాడటం ఒక్కటే ఆ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు అర్పించగల నిజమైన నివాళి అవుతుంది.