సంపాదకీయం
నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీ పోరాటం జరిగిన ఢిల్లీలో చివరకు ఏ పార్టీ కూడా అధికార పీఠం ఎక్కే స్థితి కనిపించడంలేదు. ఫలితంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు తప్పకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. అధిక సంఖ్యాబలం ఉన్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించడం, అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేయడం, ఒక్కోసారి బొక్క బోర్లాపడటం ఈ దేశం ఎన్నోసార్లు చూసింది. కానీ, ఢిల్లీలో ఇప్పుడు ఏర్పడిన ప్రతిష్టంభన మాత్రం విలక్షణమైనది. 70 స్థానాలున్న అసెంబ్లీలో మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి 32 స్థానాలు సాధించిన బీజేపీగానీ, స్వతంత్రంగా 28 స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)గానీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపుతున్నాయి.
కొద్దో గొప్పో తక్కువైనా ఎలాంటి మొహమాటమూ లేకుండా అధికారం కోసం ఆత్రపడే కాంగ్రెస్‌కు జనం అంటకత్తెరేయడంవల్ల శక్తులన్నీ ఉడిగిపోయి ఆ పార్టీ మౌనంగా మిగిలిపోయింది. ఆప్‌కు బేషరతుగా మద్దతిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాంగ్రెస్ ఇప్పటికే లేఖ అందజేసింది. అయినా దాని మద్దతును స్వీకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా లేరు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులని ఆయన ఇప్పటికే చెప్పి ఉన్నారు. కనుక అందుకు విరుద్ధంగా ఇప్పుడు నిర్ణయం తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. తాము విపక్షంలోనే కూర్చుంటామని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఇప్పటికే తేల్చిచెప్పారు. సంఖ్యా బలంలో రెండో స్థానంలో ఉన్న ఆప్‌తో నజీబ్ శనివారం సమావేశమవుతున్నారు. అయితే, తమ వైఖరేమిటో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలు ప్రకటించారు గనుక దానికి భిన్నంగా ఏదో జరగబోతుందని ఎవరూ ఆశించడంలేదు.
దేశ చరిత్రలో ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి స్థితి ఏర్పడింది. 1965 ఎన్నికల్లో కేరళలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ ఒక్కరూ మరొకరితో కలవడానికి అంగీకరించకపోవడంతో రెండేళ్లపాటు అనిశ్చితి కొనసాగి చివరకు ఒక్క సమావేశమూ జరగకుండానే సభ రద్దయింది. 1967లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటినుంచీ అక్కడ ఏక పార్టీ పాలన ఎప్పుడూ రాలేదు. 2005లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రతిష్టంభనే ఏర్పడింది. అప్పటికి పాలకపక్షంగా ఉన్న ఆర్జేడీ 75 స్థానాలతో ప్రథమ స్థానంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షం జేడీ(యూ) 57 స్థానాలు గెల్చుకున్నా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చింది. చివరకు మద్దతు నిరూపించుకోకుండానే వైదొలగింది. అటు తర్వాత అసెంబ్లీ రద్దయి జేడీ(యూ), బీజేపీ కూటమి అధికారంలోకొచ్చింది. తగిన సంఖ్యాబలం లేకపోయినా జాతీయస్థాయిలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పరిచిన చరణ్‌సింగ్ అయినా, చంద్రశేఖరైనా ఎలాంటి పరిస్థితుల్లో వైదొలగారో అందరూ చూశారు.
లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఆర్నెల్ల వ్యవధి మాత్రమే లేకపోతే ఆప్ మాటేమోగానీ... బీజేపీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరులోనే ఉండేదా అన్నది అనుమానమే. కేంద్రంలోగానీ, యూపీలోగానీ సంఖ్యాబలం లేని సందర్భాల్లో కూడా ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పార్టీ గంభీరంగా మాట్లాడుతోంది. తమది నిజాయితీగల పార్టీ గనుక ప్రజల ఆకాంక్షల మేరకు అధికారానికి దూరంగా ఉండదల్చుకున్నామని చెబుతోంది. ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారుగానీ, తమను పాలించమని తీర్పునివ్వలేదని అంటున్నది. ఆప్ పరిస్థితి అయినా అంతే. అది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దాటి ఆలోచిస్తోంది. అక్కడున్న ఏడు లోక్‌సభ స్థానాలపై ఇప్పుడు గురిపెట్టింది. అంతేకాదు... భవిష్యత్తులో పొరుగునున్న యూపీ అసెంబ్లీలోనూ, దేశంలోని ఇతరచోట్లా అడుగుపెట్టడానికి పథకాలు వేసుకుంటోంది.
అందువల్ల కాంగ్రెస్ మద్దతిస్తాననేసరికి ఎగిరి గంతేసే స్థితిలో ఆ పార్టీ లేదు. ఎన్నికల విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కచోట మినహా మిగిలినచోట్ల బీజేపీతో పోలిస్తే ఆప్ చాలా వెనకబడి ఉంది. అయితే, ఆప్‌పై అభిమానం ఉన్నా అది ఎటూ గెలిచే పార్టీ కాదని భావించి కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీకి ఓటేయడమే సరైందని అనుకున్నవారు ఉండొచ్చు. అలాగే, బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నవారు ఆప్ నెగ్గే పరిస్థితి లేదనుకుని కాంగ్రెస్‌వైపు వెళ్లి ఉండొచ్చు.
అలాంటి ఓటర్లను వదులుకోవడానికి ఆప్ సిద్ధంగా లేదు. ఇప్పుడు సాధించిన విజయాన్ని నిలుపుకోవడమే కాదు... పెంచుకోవాలంటే రెండు పార్టీలకూ దూరంగా ఉండటమే సబబన్న నిర్ణయానికి ఆప్ నేతలు వచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ మద్దతిస్తానన్నప్పుడు కనీసం కొన్ని షరతులు విధించి తీసుకోవచ్చు కదా... తాము ఇచ్చిన హామీలను నిలుపుకొనేలా పాలన సాగించవచ్చు కదానని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నా కాంగ్రెస్ గత చరిత్ర పరిశీలిస్తే ఇచ్చిన మాటకు ఆ పార్టీ ఎన్నాళ్లు కట్టుబడి ఉంటుందో ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.
ఇంతకూ ఢిల్లీ ఓటర్లు స్పష్టంగా ఏ పార్టీకీ మెజారిటీ ఇవ్వలేదు. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలపై తమకు నమ్మకం లేదని నిర్మొహమాటంగా చెప్పారు. అలాంటపుడు ఆప్ ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ప్రమేయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టే అవుతుంది. కనుక ఉద్దేశం ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు దూరంగా ఉండాలన్న ఆప్ నిర్ణయం సమర్ధించదగ్గదే. లోక్‌సభకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గనుక దాంతోపాటే ఢిల్లీ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరపడమే శ్రేయస్కరం. సిద్ధాంతాలూ, విధానాలూ కలవని పార్టీలతో ఏర్పడే కూటములు ఎలాంటి పాలన అందించాయో, ఎంతటి అస్థిరతను సృష్టించాయో ఈ దేశ ప్రజలు చూశారు. ఢిల్లీలో అది పునరావృతం కావడం వారికి ఆమోదయోగ్యం కాదు.