సుస్థిర పాలనకు పట్టం కట్టండి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పిలుపు
బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వండి
గతంలో గద్దెనెక్కినవారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
ఢిల్లీని కిరణ్ బేడీ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఢిల్లీకి సుస్థిర ప్రభుత్వం అవసరం. పాలనా అనుభవం ఉన్నవారికి పగ్గాలివ్వండి. కిరణ్ బేడీ దక్షత కలవారు. ఆమె నేతృత్వంలో నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తాం. ప్రజల జీవితాల్లో మార్పు కోసం మమ్ముల్ని ఆశీర్వదించండి’’ అని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీవాసులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కొద్ది సీట్ల తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని, ఈసారి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టి, ఆ లోటును తీర్చాలని కోరారు. ఇంతకుముందు గద్దెనెక్కినవారు ఢిల్లీవాసులకు వెన్నుపోటు పొడిచారంటూ పరోక్షంగా ఆప్‌ను విమర్శించారు. ఒకసారి చేసిన పొరపాటును మరోసారి పునరావృతం చేయరాదని ఓటర్లకు విన్నవించారు. శనివారమిక్కడ కడ్కడుమాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘కిరణ్‌బేడీకి ఢిల్లీ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు తెలుసు. పరిపాలదక్షురాలైన ఆమె ఢిల్లీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. గతంలో ఢిల్లీలో, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా.. తాగునీటి సమస్యను పరిష్కరించలేదు.
ఇప్పుడు హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఢిల్లీ నీటి సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని పేర్కొన్నారు. మాయమాటలతో ప్రజలను పదేపదే మోసగించలేరంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ధరావతు కోల్పోయిన పార్టీ మళ్లీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోందని, వారి మాటలు నమ్మొద్దన్నారు. నినాదాలతో పేదల సమస్యలు తీరవన్నారు. గత 15 ఏళ్ల పాలనలో ఢిల్లీని నాశనం చేశారంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించినా.. కుర్చీ కోసం కొనుగోళ్ల ఆట ఆడలేదని చెప్పారు. ఇంకో ఐదు సీట్లు ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఏర్పాటయ్యేదని, ఆ లోటును పూడ్చటానికి లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను గెలిపించారన్నారు. ఈసారి ఎన్నికల్లో కృష్ణానగర్ సీటు నుంచి ముఖ్యమంత్రి లభిస్తారన్నారు. ఢిల్లీ ద్వారా భారత్‌కు ప్రపంచంలో గుర్తింపు లభిస్తుందని, ప్రపంచం భారత్‌ను ఎలా గుర్తిస్తుందనేది ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయని చెప్పారు.తాము అధికారంలోకి వస్తే.. మురికివాడల్లో ఇళ్లులేనివారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద తమ ప్రభుత్వం పేదల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచి బీమా సదుపాయం అందిస్తోందని, యువతకు ఉపాధి కల్పించేందుకు మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఒబామా పర్యటనపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఆయన పర్యటనలో ఏమాత్రం లోపం ఉన్నా.. ప్రతిపక్షాలు నిందలు వేసేవని, కానీ వారికి ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.
‘కేజ్రీవాల్ ఇంటిముందు విమానం..’
ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే అరవింద్ కేజ్రీవాల్ తన ఇంటి ముందు విమానం పార్కు చేస్తారని బీజేపీ అధినేత అమిత్‌షా అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు మెట్రో, ఆటోల్లో ప్రయాణించిన కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు ఆ తర్వాత వాటిలో ఎందుకు ప్రయాణించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ బంగళా తీసుకోబోనని చెప్పి, తర్వాత ప్రభుత్వ సదుపాయాలన్నీ వినియోగించుకున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ చెప్పారు. పాఠశాలల్లో ఆత్మరక్షణ శిక్షణ ఇప్పిస్తామని, కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజాసేవ చేసేవారికి ‘సేవా అవార్డులు’ అందజేస్తామన్నారు. మోదీ ‘మన్‌కీ బాత్’లా తానూ ‘దిల్‌కీ బాత్’ పేరిట ప్రతినెలా రేడియో సందేశం ఇస్తానన్నారు.