ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్!
⇒ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ
⇒ తాజా విజయాల ఊపులో బీజేపీ.. ఆప్‌కు విషమ పరీక్ష?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
దేశ రాజధానిలో మరో రాజకీయ సమరానికి తెరలేస్తోంది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉత్కంఠకు తెరపడిన వెంటనే మరో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తిని రేకిస్తోంది. అది ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మరో నెల రోజుల్లో జరుగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆమ్ ఆద్మీ పార్టీకి – భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగనుంది. ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ.. మూడు నగర పాలక సంస్థలూ ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమేమో ఆప్‌ది. ఇక్కడ రెండున్నరేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించిన ఆప్ హవా ఇంకా కొనసాగుతోందా.. బీజేపీ నుంచి నగరపాలక సంస్థలను గెలుచుకోగలుగుతుందా అన్నది ఆసక్తికరమైన అంశం. పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ఆ పార్టీకి ఇది సవాలేనని పరిశీలకుల అంచనా. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తాజా భారీ విజయాలతో పాటు మణిపూర్, గోవాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసి మంచి ఊపుమీదున్న బీజేపీ.. ఢిల్లీ పురపాలికల్లో తన పట్టును నిలుపుకుంటుందా అన్నదీ ఉత్కంఠ కలిగిస్తోంది.
మూడు సంస్థలు... నాలుగు పార్టీలు..: పాత ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను 2012లో విభజించి ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ పేర్లతో మూడు కార్పొరేషన్లుగా చేశారు. చిన్న నగర పాలక సంస్థలు మరింత సమర్థవంతంగా, మరింత సౌకర్యవంతంగా పనిచేస్తాయన్నది ఈ విభజనకు కారణం. మూడు కార్పొరేషన్లలో మొత్తం 272 మునిసిపల్ కౌన్సిలర్ సీట్లు ( ఉత్తర ఢిల్లీ - 104, దక్షిణ ఢిల్లీ - 104, తూర్పు ఢిల్లీ - 64) ఉన్నాయి. ఇందులో 114 సీట్లు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఒక్కో వార్డులో సుమారు 60 వేల మంది ఓటర్లు ఉన్నారు. 2012 ఎన్నికల్లో ఈ మూడు నగర పాలక సంస్థల్లోనూ బీజేపీ గెలిచింది. తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. దక్షిణ ఢిల్లీలో మాత్రం కొందరు స్వతంత్ర కౌన్సిలర్ల సాయంతో అధికార పీఠం దక్కించుకుంది.
మూడు చోట్లా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీఎస్‌పీ అతి తక్కువ సీట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మూడు నగర పాలక సంస్థలకు వచ్చే నెల 22వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పార్టీ హోదాలో ఆప్ పూర్తిస్థాయిలో పోటీ చేయబోతోంది. కేంద్రంలో అధికార పార్టీ హోదాతో పాటు.. మూడు నగరపాలికల్లోనూ అధికార పార్టీగా బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్, బీఎస్‌పీలు కూడా తమ బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. అలాగే.. కేజ్రీవాల్ నుంచి వేరుపడిన యోగేంద్రయాదవ్ స్థాపించిన స్వరాజ్ ఇండియా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. మూడు కార్పొరేషన్ల మీదా తన పట్టును నిలుపుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. పార్టీ సిటింగ్ కౌన్సిలర్లను మళ్లీ పోటీకి దించకూడదని నిర్ణయించింది. తద్వారా నగరపాలక సంస్థపై ఓటర్లలో ఉన్న వ్యతిరేకత ప్రభావాన్ని తగ్గించవచ్చునన్నది బీజేపీ ఆలోచన. కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా పార్టీ తాజాగా కనిపిస్తుందని భావిస్తోంది.
ఈవీఎంలతోనే పోలింగ్..: ఏప్రిల్ 22వ తేదీన మూడు నగర పాలక సంస్థలకూ 13,234 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుంది. అదే నెల 25వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తుంది. పంజాబ్, గోవా ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) మాయేనని ఆరోపించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కానీ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్.కె.శ్రీవాస్తవ ఆ అవకాశం లేదని కొట్టివేశారు. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరుగుతుందని స్పష్టంచేశారు. అయితే.. ఢిల్లీ నగర ఓటర్లు తొలిసారిగా నోటా (పైవారెవరూ కాదు) ఓటు కూడా వేసే అవకాశాన్ని ఈ ఎన్నికల్లో కల్పించారు.
‘సూపర్ బాస్’ నిర్ణయమే అంతిమం..!
రోడ్లను ఊడ్వడం వంటి పారిశుధ్య పనులు, ప్రాధమిక పాఠశాలల నిర్వహణ, భవన నిర్మాణ నిబంధనల అమలు, నగరపాలక ఆస్పత్రుల నిర్వహణ, దోమల నివారణ వంటి విధులు ఈ నగరపాలక సంస్థలు నిర్వర్తిస్తాయి. అయితే.. లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యంలోని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)కు.. దేశ రాజధాని నగరంలో ఇళ్ల డిమాండ్లకు సంబంధించిన ప్రణాళికను రచించడం, కేంద్రం కోసం భూమి సేకరించడం, నిర్వహించడంతో పాటు నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే అధికారం ఉంటుంది. ఢిల్లీ నగర పాలక సంస్థలు ఢిల్లీ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా పనిచేస్తాయి. నగర పాలక సంస్థకు లభించే ఆదాయాలకు అదనంగా ఢిల్లీ ప్రభుత్వం ద్వారా పురపాలక నిధులు అందుతాయి. అయినప్పటికీ.. ఢిల్లీకి ‘సూపర్ బాస్’గా పరిగణించే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే అంతిమవుతుంది.