సంపాదకీయం
ఈమధ్యే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మన చట్టసభలు చట్టుబండలవుతున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. వాటి నాణ్యతాప్రమాణాలు నానాటికీ దెబ్బతింటున్నాయని ఆందోళనపడ్డారు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు. నిజమే. చట్టసభల్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు చర్చకు రావడం అరుదుగా మారింది.
అరుపులు, కేకలు, కొట్లాటలు, వాయిదాలు, వాకౌట్లతోనే వాటి కాలం పూర్తవుతోంది. దీన్ని చక్కదిద్దడానికి ఏంచేయాలో తెలియక అందరూ తలలు పట్టుకుంటుంటే చట్టసభల సభ్యుల్లో కొందరు అవినీతి మకిలి అంటించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వెబ్ పోర్టల్ కోబ్రా పోస్ట్ రహస్య కెమెరాలకు 11 మంది ఎంపీలు తాజాగా దొరికిన ఉదంతం మన చట్టసభల ప్రమాణాలపై ప్రథమ పౌరుడు వ్యక్తంచేసిన ఆందోళనకు అద్దం పడుతోంది. దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న వైనాన్ని వెల్లడిస్తోంది. తాజా స్టింగ్ ఆపరేషన్‌కు దొరికిపోయినవారిలో అన్ని పార్టీలవారూ ఉన్నారు. కనుక దీన్ని ప్రత్యర్థి పార్టీ కుట్రగా కొట్టిపారేయడానికి ఏపార్టీకీ చాన్స్‌లేదు. ఈ ఎంపీల్లో ఆరుగురు ముడుపులు తీసుకుని సిఫార్సు లేఖలు రాస్తే, మరికొందరు మరింత భారీ మొత్తం ఇస్తేనే లేఖలు అందజేస్తామని చెప్పారు.
ఇప్పుడు కె మెరాకు చిక్కిన ఎంపీల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యూ), అన్నా డీఎంకే, బీఎస్‌పీ పక్షాలవారున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న మెడిటెరేనియన్ చమురు సంస్థ ప్రతినిధిగా చెప్పుకుని, తమకు ఈశాన్య ప్రాంతంలో చమురు వెలికితీతకు అవకాశం కల్పించేలా సిఫార్సుచేయమంటే ఆ సంస్థ అసలుదా, నకిలీదా అని ఈ ఎంపీలెవరూ ఆలోచించలేదు.
వచ్చినవారెవరో, వారి నేపథ్యం ఎలాంటిదో తెలుసుకోకుండా సిఫార్సు చేయడమే కాదు... వారి తరఫున చమురు మంత్రిత్వ శాఖలో లాబీయింగ్ నెరపేందుకు కూడా సిద్ధపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచే యూపీఏ ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిప్పులు చెరుగుతున్న సమయంలోనే ఈ నకిలీ విదేశీ సంస్థ కోసం లాబీయింగ్ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు వెనకాడలేదు. వల్లించే విధానాలకూ, చేసే పనులకూ సంబంధంలేదని వారు నిరూపించారు. 1951లో హెచ్.జి. ముద్గల్ అనే ఎంపీ కొందరు పారిశ్రామికవేత్తల తరఫున లోక్‌సభలో ప్రశ్నలు వేయడానికి ముడుపులు తీసుకున్నారని మీడియా వెల్లడించినప్పుడు దేశంలో కలకలం రేగింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆ సభ్యుణ్ణి బహిష్కరించే తీర్మానాన్ని ప్రతిపాదించాక ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కోబ్రాపోస్టు ముడుపుల వ్యవహారాన్ని బయటపెట్టి గంటలు గడిచినా నిందపడిన ఎంపీలు బయటకొచ్చి తమ వాదనేమిటో చెప్పలేదు. ఆయా పార్టీలూ సంజాయిషీ ఇవ్వలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఉభయసభల్లో ఈ సంగతి ప్రస్తావనకే రాలేదు. ఆరున్నర దశాబ్దాలు గడిచేసరికి అవినీతి విషయంలో మనం చాలా బండబారిపోయామని ఉలకని పలకని మన చట్టసభలు, ఎంపీలు, పార్టీల తీరే చెబుతోంది. ‘ముడుపులిస్తే సిఫార్సు చేశాననడం నిజంకాదు. ఆ ప్రాజెక్టువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని భావించాన’ని బీజేపీ ఎంపీ చెబుతున్నారు. మిగిలిన ఎంపీలు కూడా రేపో, మాపో ఆ మాదిరిగానే చెప్పవచ్చు. అయితే, అలాంటి సమర్ధనలు ఎందుకూ కొరగావు.
ఇక్కడ వెల్లడైంది ఎంపీల అవినీతి వ్యవహారం మాత్రమే కాదు. ఢిల్లీలో వేళ్లూనుకున్న దళారీ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో అది బయటపెట్టింది. మూడేళ ్లక్రితం కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా ఫోన్ సంభాషణలు మీడియాలో వెల్లడై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ సంభాషణల్లో ఆమె ఎవరెవరి ద్వారా ఏ పని చేయించుకోవచ్చునో పూసగుచ్చినట్టు చెప్పారు. దళారుల ఆనుపానులన్నీ తెలియ జేశారు. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తు జరిపి, దోషులెవరో తేల్చాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది కూడా. ఇంకా వెనక్కి వెళ్తే 2005లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుని ఇప్పటిలాగే 11 మంది ఎంపీలు దొరికి పోయారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌ను కూడా కోబ్రా పోస్టు పోర్టల్ మరో హిందీ న్యూస్ చానెల్‌తో కలిసి చేసింది. డబ్బులిస్తామనేసరికల్లా సంస్థ ఎలాంటిదో, దాని కార్య కలాపాలు ఎంతవరకూ సరైనవో తెలుసుకోకుండా ప్రశ్నలు అడగటానికి వారంతా సిద్ధపడ్డారు.
ఆ ఉదంతంపై నిజానిజాలు నిగ్గుదేల్చడానికి అప్పట్లో పార్లమెంటరీ కమిటీని నియమించి ఆ ఎంపీలందరినీ పార్లమెంటు నుంచి బహిష్కరించారు. ఎన్‌డీఏ అధికారంలో ఉండగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, సమతా పార్టీ అధ్యక్షురాలు జయాజైట్లీవంటివారు ముడుపులు తీసు కుంటూ కెమెరాలకు చిక్కారు. ఈ ఉదంతాలన్నీ మన దేశంలో దళారీ వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో వెల్లడిస్తున్నాయి.
ఎవరైనా చొరవచేసి స్టింగ్ ఆపరేషన్ చేస్తేనో, అనర్హులకు మరేదో కట్టబెట్టారని మీడియాలో కథనం వస్తేనో చర్యలు తీసుకుంటున్నట్టు కనబడుతున్నా... మొత్తంగా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు జరగడంలేదని ఈ వరస ఉదంతాలవల్ల అర్ధమవు తోంది. తమది విపక్షమైనా, స్వపక్షమైనా అడ్డగోలుగా పనులు చేయించుకోవడం లో, దళారులుగా వ్యవహరించడంలో ఎవరూ ఎవరికీ తీసిపోరని తాజా ఉదంతం వెల్లడిస్తోంది. ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన ఎంపీలపై చర్య తీసుకోవ డంతో సరిపెట్టకూడదు. మొక్కుబడి ప్రయత్నాలతో అయిందనిపించకూడదు. ఇలాంటివి పదే పదే ఎందుకు పునరావృతమవుతున్నాయో గ్రహించాలి. తమ నిష్క్రియాపరత్వం దేశాన్ని ఎటు తీసుకుపోతున్నదో గుర్తించాలి. దళారీ వ్యవస్థను సంపూర్ణంగా తొలగించేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధం కావాలి. దేన్నయినా పారదర్శకంగా చేసే పరిస్థితులుంటే దళారీ వ్యవస్థ వేళ్లూనుకోవడం సాధ్యంకాదు. అలా లేకపోవడంవల్లే అరాచకం తాండవిస్తున్నదని తెలుసుకోవాలి.