హక్కుల పరిరక్షణకు సైనికుల్లా పనిచేయండి
సాక్షి, బెంగళూరు: ప్రజల హక్కులు, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు సైనికుల్లా పనిచేయాలని యువ న్యాయవాదులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)లో ఆదివారం నిర్వహించిన 24వ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్నాతకోత్సవంలో ప్రణబ్ మాట్లాడుతూ ‘ప్రభుత్వ, పాలనా వ్యవహారాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా వ్యవస్థలో మార్పునకు కృషి చేయాలి. అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి’ అని పేర్కొన్నారు. అవినీతిపై మాట్లాడుతూ ‘ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే, ఇవ్వం అని ధైర్యంగా చెప్పండి ’ అని చెప్పారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.