నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు భేష్‌! | Surgical strikes were a 'fitting reply' to incursions: Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు భేష్‌!

Published Wed, Feb 1 2017 3:09 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు భేష్‌! - Sakshi

నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు భేష్‌!

అవినీతి, నల్లధనంపై కేంద్రం సాహసోపేత నిర్ణయం
► సంయుక్త పార్లమెంటు భేటీలో రాష్ట్రపతి ప్రశంస
► ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలన్న ప్రణబ్‌


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్‌ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్‌హాల్లో ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, సమాజంలో మార్పుకోసం తెచ్చిన పథకాలను అభినందించారు. ‘దేశం ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి అంశాలపై దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాద చొరబాట్లపై సర్జికల్‌దాడులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. దీన్ని విజయవంతంగా అమలుచేసిన సైన్యం ధైర్య సాహసాలను ప్రణబ్‌ ప్రత్యేకంగా అభినందించారు.   

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
► లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకమేర్పడుతుంది. దీంతోపాటు అత్యవసర సేవలకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలనే అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీలకు నిధులివ్వటం ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకూ ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చొరవ అభినందనీయం.

►  నాలుగు దశాబ్దాలుగా భారత్‌కు సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. భారత్‌లో విధ్వంసానికి ప్రయత్నించిన చొరబాటుదారులకు సరైన సమాధానమిచ్చేలా వారి స్థావరాలపై సెప్టెంబర్‌ 29న భారత ఆర్మీ సర్జికల్‌దాడులు చేపట్టింది. ఈ దాడులను విజయవంతంగా పూర్తిచేయటంలో భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలు అభినందనీయం.

► బలమైన భారత స్థూల ఆర్థిక విధానాల వల్ల సుస్థిర అభివృద్ధికి వేదిక ఏర్పడింది. దీనివల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ ఓ వెలుగుదివ్వెలా మారింది. ఈ దిశగా నల్ల ధనాన్ని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం భేష్‌. కేంద్రం నిర్ణయాల కారణంగా 2014 నుంచి ద్రవ్బోల్బణం రేటు, చెల్లింపులు, కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యలోటు వంటివి మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

►  డిసెంబర్‌ 30న ప్రధాని ప్రారంభించిన భీమ్‌ యాప్‌ చాలా ప్రాచుర్యం (జనవరి 15 వరకు 1.1 కోట్ల మంది డౌన్ లోడ్‌ చేసుకున్నారు) పొందింది. త్వరలో ఆవిష్కరించనున్న ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ చెల్లింపు వ్యవస్థ దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేయనుంది.

►  యువతే మన దేశానికి బలం. ఈ యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా 50 భారత–అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను కేంద్రం ప్రారంభించింది. కేంద్రం రూ.6 వేల కోట్లతో చేపట్టిన పథకాల వల్ల 1.1 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది.

► భవిష్యత్‌ భారతం కోసం అత్యాధునిక మౌలికవసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయం. సాగరమాల, గ్రామీణ భారతంలో వెలుగులు తీసుకురావటం, స్మార్ట్‌ సిటీలు, హైవేలు, రైల్వేలు, గ్యాస్‌ పైప్‌లైన్లు, ఐ–వేల (కంప్యూటర్‌ అనుసంధానం) వంటి పలు అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. మావోయిస్టులప్రభావం ఉన్న 44 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకోసం 5వేల కి.మీ. రోడ్లు వేస్తున్నారు. మౌలికవసతుల కల్పన కోసం ఇప్పటికే రూ. లక్షకోట్ల విలువైన కార్యక్రమాలు అమలవుతున్నాయి.

►దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే యత్నంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్రం ‘అష్టలక్ష్మి’గా భావిస్తోంది. ఆగ్నేయాసియాతో భారత్‌ను కలిపే ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ
రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనే కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ యూనియన్  ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఎంపీ ఈ.అహ్మద్‌ (78) గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను రామ్‌ మనోహర్‌ లోహి యా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

పార్లమెంట్‌ సైడ్‌లైన్స్
రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రసంగంలో పెద్ద నోట్లరద్దు, సర్జికల్‌ దాడులను ప్రస్తావించినప్పుడు అధికార ఎన్డీఏ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశారు.
గతంలో ఉమ్మడి సమావేశాలకు పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌ నిండి, అదనపు కుర్చీలు వినియోగించేవారు. చాలా మంది ఎంపీలు నిలబడి రాష్ట్రపతి ప్రసంగాన్ని వినేవారు. మంగళవారం మాత్రం అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఈసారి సభ్యుల హాజరు కూడా తక్కువగా నమోదైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సమావేశాలకు హాజరుకాలేదు.   
గంట సేపు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సమయంలో పలువురు ఎంపీలు తమ మొబైల్‌ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. 
మాజీ ప్రధానులు మన్మోహన్  సింగ్, హెచ్‌డీ దేవెగౌడలు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కలసి మొదటి వరుసలో కూర్చున్నారు.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు సభ నుంచి వెళ్తుంటే రాహుల్‌ గాంధీ మాత్రం మల్లికార్జున ఖర్గే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్లువాలియాతో సంభాషిస్తూ కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement