అప్పటిదాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు రద్దవుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి... ఇప్పటికి సరిగ్గా ఏడాది. ఆ తరవాత కొన్ని నెలలపాటు జరిగిన సంఘటనల్ని బహుశా... దేశం ఎన్నటికీ మరిచిపోలేదేమో!! డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరటం... బ్యాంకుల్లో కొట్లాడుకోవటం... పెళ్లిళ్ల వంటి కార్యాల్ని కూడా వాయిదా వేసుకోవటం... ఇలా చెప్పలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి.
ఇదే అవకాశంగా డిజిటల్ మనీ విజృంభించింది. కొత్త వాలెట్లు పుట్టుకొచ్చాయి. డిజిటల్ లావాదేవీలూ పెరిగాయి. కాకపోతే మెల్లగా డబ్బులు అందుబాటులోకి వచ్చేసరికి పరిస్థితి సర్దుమణిగింది. మరి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల వాస్తవంగా ఒనగూరిన లాభనష్టాలేంటి? ప్రధాని కార్యాలయం ఏం చెబుతోంది? వివిధ కంపెనీలు, వాటి ప్రతినిధులు ఏం చెబుతున్నారు? ఒకసారి చూద్దాం... – న్యూఢిల్లీ
నోట్ల రద్దుకు ఏడాదైన సందర్భంగా ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. దాన్లో పేర్కొన్నదాని ప్రకారం...
⇒ డీమోనిటైజేషన్ తరువాత బ్యాంకులు ఒక శాతం వడ్డీతగ్గించాయి. ఇది దేశాభివృద్ధికి దోహపడే అంశం.
⇒ నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన భారీ నగదు డిపాజిట్లు– బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపునకు దారితీశాయి.
⇒ జనవరి 1న ఎస్‌బీఐ అనూహ్యంగా ఎంసీఎల్‌ఆర్‌ను 0.9 శాతం తగ్గించింది. ఇతర బ్యాంకులూ దీనిని అనుసరించాయి.
⇒ నవంబర్ 8 నాటికి చెలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ రూ.15,44 లక్షల కోట్లు. దాదాపు రూ.15.28 లక్షల కోట్లు (దాదాపు 99%) వెనక్కు వచ్చేశాయి.
రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి.
దేశ వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్‌బీ) ఆదాయాలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. తమ బకాయిలను వినియోగదారులు పాత నోట్లతో తీర్చేయటం దీనికొక కారణం. ఈ తరహా ఆదాయాలు 4 రెట్లు పెరగ్గా, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఈ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు.
డిజిటల్ పేమెంట్ల గణనీయ వృద్ధి...
డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. డెబిట్ కార్డ్ లావాదేవీల సంఖ్య వృద్ధి రేటు ఆగస్టులో 50 శాతం పెరిగి 26.55 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఆగస్టులో డెబిట్ కార్డ్ లావాదేవీల వృద్ధి కేవలం 13.05 శాతం. లావాదేవీల విలువ సైతం 48 శాతం పెరిగి, రూ.35,413 కోట్లకు ఎగసింది.
బ్యాంకులు మహా హ్యాపీ...
భారత్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే బ్యాంకులకు నోట్ల రద్దు తగిన సానుకూల ఫలితాలనే అందించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం తమకు లాభం కలిగించిందని, డిపాజిట్లు పెరగడంతోపాటు, డిజిటలైజేషన్ వేగం పుంజుకుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఎంతో ధనం అధికారిక వ్యవస్థలోకి వచ్చిందని, డిపాజిట్లు 2.5–3 శాతం పెరిగాయని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్, బీమా రంగాల్లోకి నిధుల వెల్లువ పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్ చెప్పారు.
రెండు స్థానంలో నాలుగు కొత్తవి...
నోట్ల రద్దు తరువాత పాత రూ.500, రూ.1,000 నోట్లు వ్యవస్థలోంచి బయటకు వెళ్లిపోయాయి. కొత్త రూపురేఖలతో నాలుగు కొత్తనోట్లు ఆర్థికవ్యవస్థలోకి వచ్చాయి. డీమోనిటైజేషన్ తరువాత కేంద్రం తక్షణం కొత్త రూ.2,000 రూ.500 నోట్లను ఆవిష్కరించింది. ఎనిమిది నెలల తర్వాత కొత్తగా రూ.50, రూ.200 నోట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి.
విమర్శలూ ఉన్నాయ్...
నోట్ల రద్దు నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకూ దారితీసింది. అవి చూస్తే...
⇒ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగమనంలోకి జారిపోయింది. నోట్ల రరద్దు జరిగిన తొలి రెండు నెలల కాలంలో ఏటీఎంలు పనిచేయక, చేతుల్లో డబ్బులేక ప్రజలు, వినియోగదారులు త్రీవ కష్టాలు పడ్డారు. చిన్న వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయి.
⇒ మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయ వృద్ధి రేటు (ఏప్రిల్–జూన్) ఆందోళనకరమైన స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి 5.7 శాతానికి పడిపోయింది. త్రైమాసిక పరంగా చూస్తే, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ తిరిగి చైనాకు కోల్పోయింది.
⇒ పలు ఆర్థిక, రేటింగ్, బ్యాంకింగ్ సంస్థలు దేశ వృద్ధిరేటు అంచనాలను దాదాపు 7 శాతానికి కుదించేశాయి. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ నిర్ణయం మంచిదని పేర్కొంటూనే తక్షణ అంశాల ప్రాతిపదికన దేశానికి ప్రతికూల ఆర్థిక సంకేతాలను ఇచ్చాయి.
⇒ రద్దయిన నోట్లలో 99 శాతానికి పైగా ఆర్‌బీఐకి చేరిపోవడం కూడా చర్చనీయాంశమైంది. దేశంలో ఇంతకీ నల్లధనం ఉన్నట్లా, లేనట్లా అన్న సందేహాలు విస్తృతమయ్యాయి. బ్యాంకుల్లో జమైన డబ్బు మొత్తం సక్రమమైనదేననుకుంటే పొరపాటేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తూ వస్తున్నాయి.
రియల్టీకి వచ్చే 18 నెలలూ కీలకం...
నోట్ల రద్దుతో రియల్టీపై పిడుగు పడినట్లయింది. తరవాత వచ్చిన రెరా, జీఎస్‌టీ కూడా తొలుత ప్రతికూల ప్రభావాలే చూపించాయి. అయితే ఈ రంగం పురోగతిపై మాత్రం అన్ని వర్గాలూ విశ్వాసంతో ఉన్నాయి. ఇందుకు వచ్చే 12 – 18 నెలలు కీలకమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ సెంటిమెండ్ ఇండెక్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి కొంత మెరుగుపడటం ఊరటనిచ్చింది.
– శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా
ఆన్‌లైన్ సేవలు మెరుగయ్యాయి...
నోట్ల రద్దుతో చాలా మంది కస్టమర్లు ఆన్‌లైన్ సేవలవైపు ఉత్సాహం చూపించారు. బ్యాంక్ రుణ మంజూరీలో మందగమనం ఆన్‌లైన్ లెండింగ్ పురోగతికి కూడా దోహదపడింది. మా సంస్థ ఇపుడు నెలకు దాదాపు 400 రుణాలను ప్రాసెసింగ్ చేస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో మేం నెలకు 130 రుణాలను మాత్రమే ప్రాసెసింగ్ చేసేవారం.
– రజత్ గాంధీ, ఫెయిర్‌సెంట్.కామ్ సీఈఓ
ఆర్థిక వ్యవస్థకు మేలే...
భారత ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల ఫలితాలే అందించింది. ప్రతికూలతలు క్రమంగా సడలిపోయాయి. అసంఘటిత రిటైలర్లు కూడా ఆన్‌లైన్ వైపు మళ్లారు. దీనితో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత మెరుగుపడింది. డిజిటల్ పేమెంట్లు ఆర్థిక వ్యవస్థపై వ్యయ భారాన్ని తగ్గిస్తాయి. ఇక మా వ్యాపారానికి సంబంధించి చూసినా, ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెట్ వార్షికంగా 220 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోంది. –సందీప్ అగర్వాల్, సీఈఓ ఆన్‌లైన్ ఆటోమొబైస్ స్టోర్ డ్రూమ్
Comments
Please login to add a commentAdd a comment