- ప్రణబ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వినతిపత్రం
- పట్టిసీమలో 21శాతం ఎక్సెస్ వేసిన వారికే పనులిచ్చారు
- భారీ ముడుపులు తీసుకుని డిస్టిలరీలకు అనుమతులిచ్చారు
- బెరైటీస్ కనీసధరను తగ్గించడంవల్ల ఖజానాకు భారీ నష్టం
- ఇసుక రీచ్‌లతో టీడీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారు
- సంక్రాంతి పండుగ నిత్యావసరాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు
- వీటన్నింటిపై విచారణ జరిపించండి... ఏపీ ప్రజలకు న్యాయం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ సందర్భంగా రెండు వినతిపత్రాలు ఇచ్చారు.
అందులో అవినీతిపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ..
- ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అత్యున్నత స్థాయి లో నిరాటంకంగా కొనసాగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారం తమ బాస్ చంద్రబాబు సూచనల మేరకే చేస్తున్నానని పదేపదే చెప్పడం వీడియో టేపుల్లో రికార్డయింది.
నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చిన చంద్రబాబును ఏ-1గా చేర్చాలి. లంచం ఇవ్వజూపిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలి. ఈ డబ్బంతా ఏడాదికాలంగా ఏపీలో పాల్పడిన అవినీతినుంచే తీసుకొచ్చారు. ఉదాహరణకు...
- పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు తమవారికే దక్కేలా వ్యవహరించారు. 21.9 శాతానికి ఎక్సెస్ వేసినా టెండర్‌ను ఆమోదించారు.
- ఈపీసీ కోడ్‌లో లేని మెటీరియల్‌కు కూడా ధరలు పెంచుకునే నిబంధన పొందుపరుస్తూ జీవో నెంబరు 22 జారీచేశారు.
- భారీగా ముడుపులు తీసుకుని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు.
- రాష్ట్రంలో పలు పరిశ్రమలు పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూస్తుండగా.. అడగని పరిశ్రమలకు రాయితీలు విడుదల చేశారు.
- వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 200 బెరైటీస్ యూనిట్లకు ఖనిజం ఇవ్వడం ఆపివేసి 40 వేల మంది పొట్టగొట్టారు. పైగా కనీస బేసిక్ ధరను తగ్గిస్తూ టెండర్లను పిలిచారు. దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది.
- టీడీపీ నేతల బినామీలకు ఇసుక రీచ్‌లు కేటాయించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. దీంతో ఇసుక ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
- రాజధాని అభివృద్ధి కోసమంటూ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంచుకుని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారుతున్నాయి.
- విద్యుదుత్పత్తి దారులకు మేలు చేకూర్చేలా కొనుగోలు నిబంధనలు మార్చారు. విద్యుత్తు తీసుకోని పక్షంలో పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. విద్యుత్తు కొనుగోలుకు రేట్లను కూడా అధికంగా పొందుపరిచారు.
- అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గినప్పటికీ గడిచిన ఏడాదిగా కొంతమంది బొగ్గు సరఫరాదారులకు మేలు చేకూర్చేలా అధిక రేట్లకు బొగ్గును కొనుగోలు చేస్తున్నారు.
- సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన పథకంలో కూ డా అవినీతి చోటు చేసుకుంది. టెండర్లు పిలవకుండా, తమకు నచ్చినవారికి అధిక రేట్లు చె ల్లించి నాసిరకం సరుకులు కొనుగోలు చేశారు.
- రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందనడానికి ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే. అందువల్ల చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి, అవినీతిపై సంబంధిత అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించండి. ఏపీ ప్రజలకు న్యాయం చేయండి.