పేదరికం గురించి లెక్కలేయడం మన దేశంలో చీకట్లో తడుములా టలా తయారవుతున్నదని అప్పుడప్పుడు విడుదలచేసే అధికారిక నివే దికలను చూస్తే అర్ధమవుతుంది. ఈ తొట్రుపాటు పేదలను లెక్కేయడా నికి ఎలాంటి ఉపకరణాలను వాడాలో తెలియక పోవడంవల్లనా లేక పాలకుల అభీష్టానికి అనుగుణంగా కుదించడానికి చేసే విన్యాసంలో విఫలం కావడంవల్లనా అనేది ఎవరికీ అర్ధంకాని విషయం. ప్రధాని ఆర్ధిక సలహా మండలి మాజీ చైర్మన్ రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ తాజాగా విడుదల చేసిన నివేదికను గమనిస్తే నిపుణుల్లో సైతం వాస్తవ పరిస్థితులపై అవగాహనాలోపం ఎంతగా ఉన్నదో తెలుస్తుంది. ఆ కమిటీ చెప్పిన ప్రకారం దేశంలో 36కోట్ల 30 లక్షలమంది పేదలు న్నారు. అంటే దేశ జనాభా 120 కోట్లలో పేదలు 29.6శాతం అన్న మాట. అంటే ప్రతి పదిమందిలోనూ ముగ్గురు పేదలు. గతంలోని గణాంకాలను ఒకసారి నెమరేసుకుంటే దారిద్య్రరేఖ చుట్టూ నిపుణులు గిరికీలు కొడుతున్న తీరు కళ్లకు కడుతుంది. నిరుడు ప్రణాళికా సంఘం పేదల లెక్కలు విడుదల చేసింది. 2004-05తో పోలిస్తే 2011-12 నాటికి పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పింది. యూపీఏ ప్రభుత్వ తొలినాళ్లతో పోలిస్తే పేదరికం 15 శాతానికిపైగా తగ్గిందని వివరిం చింది. ఈ పేదరికం కొలమానానికి తీసుకునే ప్రాతిపదికలు చిత్రంగా ఉంటాయి. పేదరికాన్ని ఎలా లెక్కేస్తున్నారని 2010లో సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రణాళికా సంఘం ఇచ్చిన జవాబు న్యాయమూర్తు లనే ఆశ్చర్యపరిచింది. 2004-05 ధరల సూచీ ఆధారంగా లెక్కేసి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 20(నెలకు రూ. 578), గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 15(నెలకు రూ. 450) మాత్రమే ఖర్చుచేసే వారు పేదలని చెప్పింది. ఈ లెక్కలకు న్యాయమూర్తులు తెల్లబో యారు. ఇంత స్వల్ప మొత్తంతో ఏ వ్యక్తయినా బతకగలరా అని ప్రశ్నిం చారు. ఈ లెక్కలను కట్టిబెట్టి తాజా ధరల సూచీ ఆధారంగా కొత్త గణాంకాలు రూపొందించాలని సూచించారు. ఆ తర్వాతనైనా వారేమీ మెరుగైన లెక్కలు తీసుకురాలేదు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 33.30 (నెలకు రూ. 1,000), పల్లెసీమల్లో రోజుకు రూ. 27.20(నెలకు రూ. 816) ఖర్చుచేసేవారే పేదలని ఇంకో అంచ నాను సర్వోన్నత న్యాయస్థానానికి అందించారు. దాని ప్రకారం ప్రతి పదిమంది భారతీయుల్లో ఇద్దరు నిరుపేదలు. ఒక మనిషి బతకడం అంటే ఏమిటో అర్ధం చేసుకుంటే ఈ లెక్కల్లోని గారడీ ఏమిటో తెలు స్తుంది. అవసరమైన తిండి, బట్ట, గూడు, విద్య, ఆరోగ్యంవంటివన్నీ దీనితోనే సమకూరాలి. అది ఎక్కడైనా సాధ్యమయ్యే పనేనా?!
రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47కన్నా తక్కువ మొత్తంతో రోజు గడిపేవారంతా పేదలకింద లెక్క. ఇంతక్రితం ప్రణాళికా సంఘం చెప్పిన లెక్కకూ, రంగరాజన్ కమిటీ ఇచ్చిన లెక్కకూ కాస్త వ్యత్యాసమున్నమాట వాస్తవమే. కానీ, ఈ కమిటీ చెప్పిన లెక్కలు కూడా గతంలోని గణాంకాలవలే తప్పుల తడకేనని అర్ధం చేసుకోవడానికి మేధావిత్వ ప్రకర్ష ఏమీ అవసరం లేదు. నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వర్తమాన పరిస్థితుల్లో ఆ డబ్బుతో బతకడం అసాధ్యమని ఎవరికైనా తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తానున్న చోటు నుంచి పనిచేసే ప్రాంతానికి, అటునుంచి తిరిగిరావడానికి అయ్యే మొత్తమే రూ. 30 దాటుతుంది. అదిపోగా మిగిలేది కేవలం రూ. 17 మాత్రమే అయినప్పుడు మనిషి ఇక ఏం తిని బతకాలి? ఎక్కడ బత కాలి? నిరుడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆదాయంతోపాటు పోషకా హారం, చదువు, పారిశుద్ధ్యంవంటి ఇతరేతర అంశాలను కూడా కొల మానంగా తీసుకుని ఒక నివేదిక రూపొందించింది. దాని ప్రకారం పేద రిక నిర్మూలనలో మన దేశం చాలా వర్ధమాన దేశాలకంటే వెనకబడి ఉంది.
అసలు దారిద్య్ర రేఖను నిర్ధారించడంలో నిపుణులు ఇన్ని పిల్లి మొగ్గలు వేయడానికి కారణమేమిటి? పేదరికాన్ని అంచనావేయడానికి తీసుకునే ప్రాతిపదికలేమిటి? కేవలం ఆదాయాన్ని మాత్రమే లెక్కేసి, దాన్ని ధరలసూచీతో పోల్చిచూసే విధానం ఒకటైతే...పోషకాహార లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనావేసే విధా నం మరోటి. బ్రిటన్‌లో ఒక కుటుంబ ఆదాయం జాతీయ సగటులో 60 శాతంకన్నా తక్కువగా ఉంటే పేదలుగా లెక్కేస్తారు. అమెరికాలో ఒక కుటుంబానికయ్యే ఆహార వ్యయాన్ని లెక్కేసి దాన్ని మూడుతో హెచ్చిస్తారు. మన దేశంలో ఏవో కాకిలెక్కలే తప్ప నిర్దిష్టమైన విధానం ఉన్నట్టు తోచదు. ఉదాహరణకు జాతీయ పోషకాహార సంస్థ సూచన ప్రకారం ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రోజుకు 400 గ్రాముల తృణధాన్యాలు, 300 గ్రాముల కాయగూరలు, 80 గ్రాముల కాయధా న్యాలు, 100 గ్రాముల తాజా పండ్లు అవసరం. రంగరాజన్ సూచించే 47 రూపాయలతో ఒక మనిషి ఇన్నిటిని కొనుక్కోగలుగుతాడా? ఒక వేళ అవన్నీ లభిస్తాయనుకున్నా ఉండటానికి, కట్టుకోవడానికి, విద్యకు డబ్బులు ఎక్కడ పుట్టిస్తాడు? తాము అమలు చేస్తున్న పేదరిక నిర్మూ లనా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పుకోవడానికో, అలాంటి పథకాలకు మరింతగా ఖర్చుపెట్టే బాదరబందీనుంచి తప్పిం చుకోవడానికో మాత్రమే ప్రభుత్వాలు ఇలాంటి విచిత్ర గణాంకాలను తీసుకొస్తున్నాయి. సుప్రసిద్ధులైన ఆర్ధికవేత్తలు ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా ఈ మాయా గణాంకాలను పరిచి దారిద్య్రం పరారవుతు న్నదని నమ్మించాలని చూడటం దురదృష్టకరం. కనీసం ఎన్డీయే ప్రభుత్వమైనా ప్రతిష్టకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రాతిప దికలను నిర్ణయించి, వాటి ఆధారంగా పేదల సంఖ్యను లెక్కేస్తే, దాని ఆధారంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తే ప్రజలు సంతోషిస్తారు
మాయదారి లెక్కలు!
Published Thu, Jul 10 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement