సమాజంలో శాస్త్రీయ సంశోధననూ, వివేచననూ కలిగించడం పౌరులందరి బాధ్యతని భారత రాజ్యాంగంలోని 51 ఏ(హెచ్) అధికరణ చెబుతోంది. ఈ బాధ్యతను గుర్తించి నిర్వర్తించినందుకే పక్షం రోజులక్రితం కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌లో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గిని ఉన్మాదులు కాల్చిచంపారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని చెప్పడం వంటివి అంతిమంగా తమకు ఎసరు తెస్తాయేమోనని...జనంపై తమ పట్టు సడలిపోతుందేమోనని ఉన్మాదులు భావిస్తారు. అందుకే అలాంటి చైతన్యం కలిగించేవారిపై దాడులకు దిగుతారు. బెదిరిస్తారు.
ఈ బాపతు ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఈ నేపథ్యంలో... శాస్త్రీయ ప్రాతిపదికలేని హిందూ మత విలువలను విడనాడాలని రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక సదస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గది. విమర్శలను స్వీకరించడం, లోటుపాట్లున్నప్పుడు సరిదిద్దు కోవడం, తప్పుడు ఆలోచనలను, ఆచరణను గట్టిగా వ్యతిరేకించడం ఎవరైనా చేయవలసిందే. వాస్తవానికి ఆరెస్సెస్ సంస్థ హిందూ మతానికి ప్రతినిధి కాదు. హిందూ మత విశ్వాసాలుండేవారిని సంఘటితపరిచి, జాతీయ భావాలను పెంపొందింపజేసే ఆశయంతో 90 ఏళ్లక్రితం ఆరెస్సెస్ ఆవిర్భవించింది.
వివాదాస్పద అంశాలను స్పృశించడం, వాటికి సంబంధించి తనదైన అభిప్రాయాన్ని చెప్పడం మోహన్ భాగవత్‌కు మొదటినుంచీ అలవాటే. ఆ అభిప్రాయాలు హాస్యాస్పదమైనవని కొట్టిపారేసే వారుండొచ్చు. అందులో తప్పులు వెతికేవారుండొచ్చు. అయితే ఆయన ఆ అంశాలను ప్రస్తావిస్తున్నందుకు, వాటిపై ఒక చర్చ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నందుకూ భాగవత్‌ను అభినందించాలి. మొన్న ఫిబ్రవరిలో ఒక సదస్సులో మాట్లాడుతూ దేశంపై దండయాత్రలకు వచ్చినవారే ఇక్కడి ప్రజలను కుల ప్రాతిపదికన విభజించే కుట్ర చేశారని ఆరోపించారు. దేశంలో అంటరానితనం వంటి దురాచారాలన్నిటికీ ఆ దండయాత్రలే కారణమని చెప్పారు. సమాజంలో ఆధిపత్య సంస్కృతికి, ప్రత్యేకించి కుల వివక్షకు, సాంఘిక దురాచారాలకు ఏ శక్తులు కారణమో, వాటి ప్రయోజనాలేమిటో ఎవరికీ తెలియనిది కాదు.
సమాజం ఇలా చీలి ఉండటం, ఆ మేరకది బలహీనపడటంవల్లే దండెత్తి వచ్చినవారి పని సులభమైందనడం వాస్తవం. కానీ భాగవత్ దీన్ని తలకిందులు చేసి చెప్పారు. అయినా సమాజంలో కుల వివక్ష ఉన్నదని, అంటరానితనం ఉన్నదని అంగీకరించడం, దాని పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయడం హర్షించదగింది. గ్రామాల్లో కొన్ని కులాలను తక్కువగా చూస్తూ ఆ కులాలకు చెందిన పౌరులను దేవాలయాల్లోకి ప్రవేశించనీయకపోవడం, బావుల్లో నుంచి, చెరువుల్లోనుంచి మంచి నీరు తెచ్చుకునేందుకు అనుమతించకపోవడం, ఆఖరికి మరణానంతరం స్మశాన వాటికలను వినియోగించుకోవడానికి కూడా అభ్యంతరం చెప్పడం ఈనాటికీ మన సమాజంలో అమలవుతున్న దురాచారాలు. మారుమూల ప్రాంతాల్లో ఇంత దుర్మార్గంగా అమలయ్యే ఈ బాపతు పద్ధతులు నాగరికత ఉందంటున్న పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో మరో రూపంలో...మరో విధంగా అమలవుతున్నాయి. ఎక్కువ మందిని ప్రభావితం చేయగల ఆరెస్సెస్ వంటి సంస్థ వీటిని ప్రస్తావించి సరిచేయడానికి పూనుకోవడం మంచిదే. ఈ క్రమంలో ఆ దురాచారాల పుట్టుకకు సంబంధించి భాగవత్‌కున్న అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. మతంలోని అశాస్త్రీయమైన విలువలను, ఆచరణను విడనాడాలని తాజాగా ఆయన ఇచ్చిన పిలుపుపైనా భిన్నాభిప్రాయాలుంటాయి. మతం పునాదులే అశాస్త్రీయమైన వని వాదించేవారికి ఈ పిలుపు వింతగా అనిపించవచ్చు.
ఏడేళ్లక్రితం మహారాష్ట్రలోని మాలెగావ్‌లో పేలుళ్లకు పాల్పడి 37మంది ప్రాణాలను బలిగొన్నది అభినవ భారత్ అనే సంస్థ అని తొలిసారి వెల్లడయినప్పుడు అందరూ దిగ్భ్రాంతులయ్యారు.
ఆ సంస్థకు సంబంధించి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌లు అరెస్టయ్యారు. ఆ తర్వాత శ్రీరాంసేన పేరిట కర్ణాటక రాష్ట్రంలో పార్క్‌ల్లో, పబ్‌లలో యువ జంటలపై దాడి చేసి అమానుషంగా కొట్టడంలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన డాక్టర్ దభోల్కర్, పన్సారే వంటివారిని కాల్చిచంపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సంఘ్ పరివార్ నేతలు, కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా...అక్రమ సంతానమా తేల్చుకోవాలంటూ ఒక కేంద్రమంత్రి ఢిల్లీ ప్రజలకు పిలుపునివ్వడం, హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని మరికొందరు నేతలు అనడం, ఘర్‌వాపసీ పేరుమీద మత మార్పిడులకు దిగడంవంటివి అలజడిని రేకెత్తించాయి. ఢిల్లీలోనూ, కొన్ని ఇతరచోట్లా చర్చిలపై దాడులు జరిగాయి.
విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై కఠిన చర్యలుంటాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన తర్వాతనే వీటికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు మోహన్ భాగవత్ శాస్త్రీయ ప్రాతిపదిక గురించి మాట్లాడటం కూడా ఆ తరహా ప్రభావాన్నే చూపుతుంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు తమ మత ప్రయోజనాలను దెబ్బతీస్తాయనుకునే ఉన్మాదులను భాగవత్ చేసిన ప్రకటన ఆలోచింపజేస్తుంది. అబార్షన్లు చేయించుకున్న మహిళలను క్షమించాలని ఈ మధ్య పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపును చాలామంది స్వాగతించారు. అబార్షన్లపై వాటికన్ తన అభిప్రాయాలు మార్చుకొనకపోయినా కనీసం ఇలా పిలుపునివ్వడం మెచ్చదగిందన్నారు. ఇప్పుడు శాస్త్రీయతకు విరుద్ధంగా ఉన్న విలువలను విడనాడాలన్న భాగవత్ పిలుపు కూడా ఎన్ని పరిమితులున్నా హర్షించవలసిందే.
మతం-శాస్త్రీయత
Published Tue, Sep 15 2015 1:49 AM | Last Updated on Mon, Aug 13 2018 7:57 PM
Advertisement
Advertisement