భారత్-రష్యాల మధ్య చెలిమి ఈనాటిది కాదు. అర్ధ శతాబ్దిగా కొనసాగుతున్న ఇరు దేశాల స్నేహసంబంధాలూ కాలపరీక్షకు నిలిచినవి. సాధారణ సమయాల్లో మాత్రమే కాదు...కష్టకాలంలో కూడా ఆ దేశం భారత్ వెనక దృఢంగా నిలబడింది. రక్షణావసరాలన్నిటికీ మన దేశం ఆనాటి సోవియెట్ యూనియన్‌పైనే ప్రధానంగా ఆధారపడేది. అయితే ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిశాక ఇదంతా ఎక్కడో గాడి తప్పింది. ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రం కావడం ప్రారంభమైంది. రెండు దేశాలమధ్యా స్నేహ, సహకార ఒడంబడిక కొనసాగినా ద్వైపాక్షిక, ఆర్ధిక రంగాల్లో సంబంధాలు క్రమేపీ క్షీణించాయి. అమెరికా, యూరప్ తదితర దేశాలతో మన దేశానికున్న వాణిజ్య సంబంధాలతో పోలిస్తే భారత్-రష్యా వాణిజ్య బంధం దరిదాపుల్లో కూడా ఉండదు.
ఆయా దేశాలతో దాదాపు పదివేల కోట్ల డాలర్లమేర వాణిజ్యం జరుగుతుంటే రష్యాతో అది వేయి కోట్ల డాలర్లు మించదు. మధ్యలో ఇరు దేశాల అధినేతలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవ డానికి ప్రయత్నించకపోలేదు. అయినా పెద్దగా ఫలవంతం కాలేదు. వీటిని మళ్లీ పట్టాలెక్కించే ఉద్దేశంతో కావొచ్చు... ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రష్యా వెళ్లారు. అంతర్జాతీయంగా భారత్‌కు దృఢై మెన, నమ్మదగ్గ నేస్తంగా రష్యా పాత్ర మరువలేనిదని నరేంద్రమోదీ అన్నమాటల్లో అతిశయోక్తేమీ లేదు. మోదీ బాధ్యతలు చేపట్టాక మన విదేశాంగ విధానానికి జవజీవాలొచ్చాయి. గత ఏడాదిన్నరకాలంగా ఆయన జరిపిన పర్యటనలు ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు దోహదపడ్డాయి. అయితే ఆయన సైతం రష్యా వెళ్లడానికి ఇంత సమయం పట్టింది. గత కొన్ని నెలలుగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌లు రష్యా ఉప ప్రధాని దిమిత్రి రోగోజిన్‌తో వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపాక ప్రస్తుత పర్యటన ఖరారైంది.
భారత్-రష్యా సంబంధాల్లో వేగం తగ్గాక ఆ లోటును అనేక దేశాలు భర్తీ చేశాయి. గతంలో అణు పరీక్షల సాకు చూపి భారత్‌పై ఆంక్షలు విధించిన అమెరికా తన విధానాన్ని సవరించుకుని మనతో 2005లో పౌర అణు సహకార ఒప్పందంపై సంతకం చేసింది. ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి తహతహలాడింది. ఇదే తరహాలో బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలు కూడా దగ్గరయ్యాయి. 700 కోట్ల డాలర్ల విలువైన మధ్యశ్రేణి బహుళవిధ యుద్ధ విమానాల కాంట్రాక్టును ఫ్రాన్స్ చేజిక్కించుకుంది. యుద్ధ సమయాల్లో దళాలు, ఆయుధాలు, ఇతర సామగ్రి చేరేయడంలో కీలకపాత్ర పోషించే గ్లోబ్‌మాస్టర్-3 యుద్ధ విమానాలు, నావికాదళ గస్తీ విమానాల అమ్మకాన్ని అమెరికా చేజిక్కించుకుంది. మన దేశానికి సంబంధించి రక్షణ టెండర్లలో పాల్గొన్నా రష్యాకు అవేమీ కలిసిరాలేదు. దీన్నంతటినీ గమనిం చాక తన దోవ తాను చూసుకోవడం మేలని ఆ దేశం భావించింది. అందుకే ఈమధ్య ఎంఐ-35 సైనిక హెలికాప్టర్లను పాకిస్థాన్‌కు విక్రయించాలని నిర్ణయిం చింది. కొందరు విశ్లేషకులు అభివర్ణించినట్టు ఇది రష్యా విధానాల్లో వచ్చిన పెను మార్పే. భారత్‌తో 1971లో స్నేహ, సహకార ఒడంబడిక కుదిరాక ఈ ప్రాంతంలో వేరే దేశానికి రక్షణ విక్రయాలు చేయడం ఇదే ప్రథమం.
గతంతో పోలిస్తే అంతర్జాతీయ రంగంలో రష్యా ప్రభావం తగ్గిన మాట వాస్తవం. ఉక్రెయిన్, క్రిమియాల్లోని పరిణామాలు ఆ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవడం, పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలువంటివి రష్యా ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఐఎస్ ఉగ్రవాదులనుంచి ఒకపక్కా, పాశ్చాత్య దేశాల అండదండలున్న తిరుగుబాటుదార్లనుంచి మరోపక్కా దాడులను ఎదుర్కొంటున్న చిరకాల మిత్ర దేశం సిరియాను ఆదుకోవడం కోసం రష్యా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పర్యవసానంగా ఆర్థిక ఇబ్బందులు మరింతగా పెరిగాయి. చైనాతో ఆర్ధికంగా, రాజకీయంగా మంచి అనుబంధమే ఏర్పడినా అందులో సైతం తనది తమ్ముడి పాత్రే! మరోపక్క మన దేశం ఆర్థికంగా బలపడుతున్న దేశం. అమెరికా మొదలుకొని అనేక దేశాలు మనతో భాగస్వామ్యం కోసం అర్రులు చాస్తున్నాయి. ప్రపంచంలో భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-రష్యాల చెలిమి ఉభయతారకమవుతుంది. ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రష్యా ఆర్థిక వ్యవస్థ ఎంతోకొంత కుదుటపడుతుంది. పాశ్చాత్య దేశాలతో బేరసా రాలాడే స్థితి మనకు ఏర్పడుతుంది.
మోదీ పర్యటనలో రక్షణ, ఇంధన తదితర రంగాల్లో ప్రధాన ఒప్పందాలపై రెండు దేశాలూ దృష్టిసారించాయి. ఇరు దేశాల అధినేతలమధ్యా శిఖరాగ్ర సమావేశం కూడా జరిగింది. ఇప్పుడున్న వేయికోట్ల డాలర్ల వాణిజ్యాన్ని వచ్చే పదేళ్లలో 3,000 కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నేతలిద్దరూ నిర్ణయించారు. అలాగే ఉమ్మడి భాగస్వామ్యంతో భారత్‌లో 226 సైనిక హెలికాప్టర్ల ఉత్పత్తికి, 12 అణు విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడానికి ఇరు దేశాలమధ్యా అంగీకారం కుదిరింది. మొత్తంగా 16 ఒడంబడికలపై సంతకాలయ్యాయి. మన దేశం తరహాలోనే రష్యా కూడా ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతోంది. ఇటీవల ఈజిప్టులో రష్యా విమానాన్ని కూల్చేసిన ఘటనలో ఎందరో రష్యా పౌరులు మరణించారు. కనుక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో మనతో కలసివచ్చే దేశాల్లో రష్యా ముందుంటుంది. నిరుడు డిసెంబర్‌లో మన దేశంలో పర్యటిం చిన సందర్భంగా పుతిన్ ఈమేరకు హామీ ఇచ్చారు. ఆసియాలో ముఖ్యమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న మన దేశాన్ని రష్యా ఉపేక్షించలేదు. అలాగే అపారమైన సహజవాయు నిక్షేపాలున్న రష్యాను మనం విస్మరించలేం. ఇలా పరస్పర ప్రయోజనాలున్న ఇరు దేశాల బంధమూ మోదీ పర్యటనతో మరింత బలపడటం ఖాయం.
చెలిమిలో కొత్త శకం
Published Fri, Dec 25 2015 12:58 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement