సంపాదకీయం
క్లిష్ట సమయాల్లో నమ్మకస్తుడైన నేస్తంగా మనవైపు దృఢంగా నిలబడి తోడ్పాటునందించిన రష్యాతో స్నేహసంబంధాలను మరింత విస్తృతపరుచు కునేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఆ దేశ ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ మరికొన్ని గంటల్లో అధికారిక పర్యటన కోసం రాబోతున్నారు. అరవై ఏళ్లక్రితం అప్పటి సోవియెట్ యూనియన్ అధినేత నికిటా కృశ్చేవ్ రాకతో మొగ్గతొడిగిన ఇరుదేశాల చెలిమి అనంతరకాలంలో శాఖోపశాఖలై విస్తరించింది. గురువారం ప్రారంభమయ్యే ఇరు దేశాధినేతల శిఖరాగ్ర స్థాయి సంభాషణలు అందుకు కొనసాగింపే. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకోవడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు, జీ-20 సదస్సు సందర్భాల్లో పుతిన్‌తో సమావేశమయ్యారు. నిజానికి అంతకు చాలా ముందుగానే అంటే... 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పుతిన్‌ను కలిశారు.
అయితే రెండు దేశాలమధ్యా సంబంధాలు మునుపటి స్థాయిలో లేవన్నది వాస్తవం. వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. పాతికేళ్ల క్రితం సోవియెట్ యూనియన్ కుప్పకూలి అనేక దేశాలుగా విడిపోయాక రష్యాతో చెలిమిని బలపర్చుకోవాలని ఒత్తిడి చేసే లాబీ మన దేశంలో మాయమైంది. అదే సమయంలో పాశ్చాత్య దేశాలతో సాన్నిహిత్యం కోసం కృషిచేసే కార్పొరేట్ సంస్థలది పైచేయి అయింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనకు ఆమడదూరంలో ఉన్న పాశ్చాత్య దేశాలు ప్రపంచీకరణతో దగ్గరయ్యాయి. సరిగ్గా ఆ సమయంలో రష్యాను ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు చుట్టుముట్టాయి. వాటన్నిటినీ అధిగమించి రష్యాలో శాంతిసుస్థిరతలు ఏర్పడ్డాక ఇరుదేశాలమధ్యా సంబంధాలు యథాస్థితికి వచ్చాయి. పుతిన్ పగ్గాలు చేపట్టాక ఆయన ఇంతవరకూ మన దేశంతో పది శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భాల్లో ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. అయితే, అవి కాగితాలపై కనిపించినంత గొప్పగా ఆచరణలో ప్రతిఫలించలేదు. ఉదాహరణకు 2010 నాటికి ఇరు దేశాలమధ్యా వాణిజ్యం వెయ్యి కోట్ల డాలర్లకు చేరుకోవాలని ఒకసారి, 2015నాటికి 2,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలని మరోసారి నిర్ణయించారు. 2010 నాటి లక్ష్యాన్ని ఈమధ్యే చేరుకున్నాం. దాన్ని వచ్చే ఏడాదికల్లా రెట్టింపు చేయడం అసాధ్యం.
వాస్తవానికి వర్తమాన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రష్యా ఏటికి ఎదురీదుతున్నది. ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియాను సొంతం చేసుకోవడంతోపాటు ఆ దేశంపై పట్టుబిగించడానికి రష్యా ప్రయత్నించడం వంటి చర్యల తర్వాత పాశ్చాత్య దేశాలు ఒక్కటై దానిపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. రష్యా సమాఖ్యలో భాగంగా ఉంటామన్న క్రిమియా ద్వీపకల్పం తీర్పును గుర్తించనిరాకరించాయి. జీ-8నుంచి రష్యాను సస్పెండ్‌చేశాయి. అపారమైన ఇంధన నిల్వలున్న దేశంగా ఎంతో భరోసాతో ఉండే రష్యా... అంతర్జాతీయ మార్కెట్‌లో నానాటికీ పల్టీలు కొడుతున్న ముడి చమురు ధరలను చూసి కుదేలవుతున్నది. 90వ దశకంలో చమురు ధరల పతనం వెనక సోవియెట్ విచ్ఛిన్నమనే ఎజెండా ఉంటే...ఇప్పటి లక్ష్యం రష్యాను లొంగదీసుకోవడమని పుతిన్ అంచనా. ఇదే స్థితి కొనసాగితే వచ్చే ఏడాదికల్లా రష్యా ఆర్థికమాంద్యంలోకి జారుకోవచ్చునని ఆయన భావిస్తున్నారు. తామిచ్చే ఇంధనం అవసరం లేదని యూరోప్ దేశాలు ముఖం చాటేస్తున్న ప్రస్తుత తరుణంలో దానికి ప్రత్యామ్నాయాలు వెదకాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే పుతిన్ ఆసియాలోని రెండు పెద్ద దేశాలైన భారత, చైనాలపై దృష్టిసారించారు. అదే సమయంలో ఎన్నడూ లేనిది పాకిస్థాన్‌తో కూడా సన్నిహితం కావాలని చూస్తున్నారు. గత నెలలో రష్యా రక్షణ మంత్రి ఆ దేశంలో పర్యటించారు. రష్యా దిగ్బంధనానికి పాశ్చాత్య ప్రపంచం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయాలన్నదే పుతిన్ సంకల్పమైనా...చైనా, పాకిస్థాన్‌తో మనకున్న పొరపొచ్చాల వల్ల ఆయన ప్రయత్నాలపై మనకు సహజంగానే అనుమానాలు కలుగుతాయి. మరోపక్క మనం అమెరికాకు ఒకింత దగ్గరవుతున్నామన్న శంక రష్యాకు ఉండనే ఉంది.
మన ఆయుధ కొనుగోళ్లలో ఇప్పటికీ సింహభాగం రష్యాదే. 1992-2013 మధ్య రష్యానుంచి మనం కొనుగోలు చేసిన ఆయుధాల విలువ 3,200 కోట్ల డాలర్లు. మొత్తం ఆయుధాల దిగుమతుల్లో ఇది 73 శాతం. రక్షణ కొనుగోళ్ల విషయంలో అమెరికా తదితర దేశాల వైఖరితో పోలిస్తే రష్యా విధానం మనకు అనుకూలమైనది. అది కేవలం అమ్మకాలతో సరిపెట్టదు. అందుకు సంబంధించిన సాంకేతికతను కూడా బదిలీచేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు, యుద్ధ విమానాలు, బహుళవిధ రవాణా విమానాలు, టి-90 ట్యాంకులు రష్యా సాంకేతిక సాయంతో ఇక్కడే తయారవుతున్నాయి. అదీగాక సైబీరియాలోని చమురు క్షేత్రాల్లో మన ఓఎన్‌జీసీకి చోటు కల్పించేందుకు సైతం రష్యా సిద్ధపడింది. ఉగ్రవాద నియంత్రణలో, అంతరిక్షం, అణుశక్తి, విద్య తదితర రంగాల్లో రష్యా సహకారం మన దేశానికి ఎంతో ఉపకరిస్తుంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలతో వచ్చిన వివాదం కారణంగా తన ఇంధన నిల్వలను చవక ధరలకు ఆసియావైపు మళ్లించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నది. కొన్నేళ్లక్రితం ైచైనా అడిగిన ధరకు గ్యాస్‌ను ఇవ్వడానికి నిరాకరించిన రష్యా ఇప్పుడు అందుకు సిద్ధపడి ఒప్పందం కుదుర్చుకుంది. పొటాష్ విషయంలోనూ 25 శాతం ధరను తగ్గించింది. ఈ నేపథ్యంలో రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యం మనకు ఎంతగానో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సుదీర్ఘకాలంగా స్నేహసంబంధాలున్న దేశాలుగా భారత-రష్యాలు తమ మైత్రిని పునర్నిర్వచించుకుని మారిన కాలానికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకుంటాయని, అందుకు పుతిన్ పర్యటన దోహదపడుతుందని భావించాలి.