ప్రపంచాన్ని శాసించే సంపన్న దేశాల సంస్థ ఆదరించి రమ్మని ఆహ్వానిస్తే, సభ్యత్వం తీసుకోమని అర్థిస్తే వద్దనే దేశం ఏముంటుంది? 45 ఏళ్లనాడు జీ–6గా ఏర్పడి, అనంతరం జీ–7గా, మధ్యలో కొన్నాళ్లు జీ–8గా వున్న ఏడు పారిశ్రామికాభివృద్ధి దేశాల కూటమిలోకి రావాలని మన దేశానికి అమెరికా నుంచి ఆహ్వానం అందింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను కూడా పిలిచారు. సహజంగానే భారత్ దాన్ని అంగీకరించింది. అయితే ఇప్పుడున్న సంక్షుభిత పరిస్థితుల్లో ఏ పిలుపుల వెనకైనా ఉద్దేశాలుండక తప్పదని, వాటిని అంగీకరిస్తే ముద్రలు పడక తప్పదని ఆహ్వాన స్వీకర్తలు గ్రహించాల్సివుంటుంది. జీ–7ను విస్తృతపరచాలని నిర్ణయించడంలో ట్రంప్‌కు రెండు ఉద్దేశాలున్నాయి. అందులో యధాప్రకారం చైనాను కట్టడిచేయడం ఒకటి కాగా, రెండోది–మౌలికంగా ఆ సంస్థ సభ్యదేశాల తీరుతెన్నులపైనే ఆయనకు ఆగ్రహం కలగడం. అటు సంస్థలోని సభ్య దేశాలు కూడా ట్రంప్‌ను సమస్యగానే పరిగణిస్తున్నాయి. అందువల్లే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీ–7 ఆహ్వానంపై ఆలోచించి అడుగేయమని మన పాలకులకు నిపుణులు సూచిస్తున్నారు.
ఏ కూటమి అయినా నిర్దిష్టమైన వ్యూహంతో, స్పష్టమైన ప్రయోజనాలతో ఆవిర్భవిస్తుంది. జీ–7 కూడా అలా ఏర్పడిందే. ప్రపంచ పరిణామాలపై ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించుకోవడం, పరస్పరం ముడిపడివుండే ప్రయోజనాలపై దృష్టి పెట్టడం, ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేయడం ఈ సంస్థ ధ్యేయాలని మొదట్లో చెప్పుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలను 1973లో చమురు సంక్షోభం ముంచెత్తినప్పుడు, దాన్నుంచి బయటపడటం కోసం ఇది ఆవిర్భవించింది. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలకు గుణపాఠం నేర్పాలన్న చమురు ఉత్పత్తి దేశాల సంస్థ ఒపెక్ నిర్ణయంతో అప్పట్లో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థికవ్యవస్థలు గజగజలాడాయి. 1920నాటికి ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో మూడింట రెండువంతుల భాగాన్ని ఆక్రమించిన అమెరికా 70వ దశకంలో ఒపెక్ నిర్ణయంతో బెంబేలెత్తింది. అప్పటికి తన దగ్గరున్న చమురు నిల్వలు తగ్గడం, దేశంలో డిమాండ్ అమాంతం పెరగడం వంటి పరిణామాలు దాన్ని ఇరుకునపెట్టాయి. లీటరు 3 డాలర్లుండే చమురు కాస్తా ఒక్కసారి నాలుగు రెట్లు పెరిగి 12 డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాల ఆర్థిక వ్యవస్థలు పల్టీలు కొట్టడం మొదలైంది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం చుట్టుముట్టాయి. ఆ సంక్షోభానికి జవాబుగా తీసుకున్న పలు నిర్ణయాల్లో జీ–7 ఒకటి. 1975లో ఆవిర్భవించినప్పుడు ఇందులో ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా మాత్రమే వున్నాయి. మరుసటి ఏడాదికి కెనడా వచ్చి చేరింది. అనంతరకాలంలో ఒపెక్ దేశాల్లో చీలిక వచ్చిన పర్యవసానంగా చమురు సంక్షోభాన్ని పాశ్చాత్య దేశాలు అధిగమించాయి. దాంతో జీ–7కు విదేశాంగ విధానం, భద్రత, ఇరాన్–ఇరాక్ ఘర్షణలు, అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ సైన్యం తిష్ట వంటివి ప్రధానాంశాలయ్యాయి. సోవియెట్ చరమాంకంలో ఆ దేశాధ్యక్షుడిగా వున్న మిఖాయిల్ గోర్బచెవ్‌ను జీ–7 ఆహ్వానించింది. సోవియెట్ కుప్పకూలాక రష్యా అందులో కొనసాగుతోంది. కానీ 2013 లో రష్యా క్రిమియాను విలీనం చేసుకున్నాక దాన్ని బహిష్కరించారు.
రష్యాను చేర్చుకోవడాన్ని ఇతర సభ్య దేశాలు వ్యతిరేకిస్తున్నా ట్రంప్ బేఖాతరు చేస్తున్నారు. దీనికి దాదాపు పోటీగా వుంటున్న చైనా ఆధ్వర్యంలోని షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో మనతోపాటు రష్యా, పాకిస్తాన్‌లకు కూడా సభ్యత్వం వుంది. రెండేళ్లక్రితం కెనడాలోని క్యుబెక్‌లో జీ–7, చైనాలోని చింగ్‌దాన్‌లో ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. వాటి తీరుతెన్నులు గమనిస్తే జీ–7కూ, ఎస్‌సీఓకూ మధ్య వున్న వ్యత్యాసాలు తెలుస్తాయి. జీ–7 పరస్పర కలహాలతో ముగిసింది. అధినేతల మధ్య అవగాహన కుదిరిందంటూ ఆ సంస్థ అప్పటి అధ్యక్షుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటన చేస్తే, ట్రంప్ అది అబద్ధమని ప్రకటించి జీ–7 పరువు తీశారు. దేశాధ్యక్షుడైననాటినుంచీ ‘అమెరికాకే అగ్రప్రాధాన్యం’ అంటూ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సంస్థలోని ఇతరులకు మింగుడు పడలేదు. సన్నిహిత దేశాలుగా వుంటున్నా తమ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించారని కెనడా, మెక్సికో, యూరప్ యూనియన్(ఈయూ) దేశాలు ఆగ్రహించాయి. వాటిని సముదాయించకపోగా, రష్యాను మళ్లీ చేర్చుకోవాలంటూ ట్రంప్ పేచీకి దిగారు. ఉక్రెయిన్‌కు సమస్య పరిష్కారం కాకుండా అదెలా సాధ్యమంటూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ మొత్తుకున్నా ఆయన వినలేదు. అప్పుడు సాధ్యం కాని తన ప్రతిపాదనను ఇప్పుడు సంస్థ అధ్యక్ష హోదాలో సాకారం చేసుకునేందుకు ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌కూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో సాన్నిహిత్యం వుంది. జీ–7లో భారత్‌ను చేర్చుకోవాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు కూడా. అయితే ప్రపంచంలో మనం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్నందుకే ఈ ఆహ్వానం అందిందని అనుకోనవసరం లేదు. తాను ప్రతిపాదిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహంలో భారత్ అత్యంత కీలకమైన దేశమని అమెరికా భావిస్తోంది. ఈ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి భారత్ ఉపయోగపడుతుందనుకుంటోంది. జీ–7లో చేరడం ద్వారా చైనాకు ఒక సందేశం పంపినట్టవుతుందని మన వ్యూహకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ దేనిపైనా నిలకడలేని ట్రంప్ వంటి నేతలను ఏమేరకు విశ్వసించవచ్చునో ఆలోచించాలి. అమెరికా ఇంకా పాకిస్తాన్‌కు వంతపాడటం ఆపలేదు. అఫ్గాన్‌లో అది తీసుకుంటున్న నిర్ణయాలు పాక్‌కు అనుకూలంగా, మన ప్రయోజనాలకు చేటు తెచ్చేలావున్నాయి. అదీగాక సరిహద్దు సమస్యతోసహా చైనాతో మనం తేల్చుకోవాల్సినవి చాలావున్నాయి. వీటిపై స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఇప్పటికైతే అనవసరం. స్వీయ ప్రయోజనాల సాధనే గీటురాయిగా మన విధానాలు రూపుదిద్దుకోవడమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment