మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కూటమి కట్టి, రాష్ట్రంలో ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎట్టకేలకు సిద్ధపడ్డాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అయిదేళ్లూ ఉంటారని... ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవీ వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఇంత వివరంగా చెప్పడానికి సిద్ధపడకపోయినా...అన్ని అంశాలూ చర్చించామని, రేపు మరింత స్పష్టత వస్తుందని శివసేన, కాంగ్రెస్ నేతలు కూడా తెలిపారు. ముగ్గురి మధ్యా ఇంకా తేల్చుకోవాల్సిన లెక్కలు... మంత్రిత్వ శాఖల పంపకాలు చాలానే ఉన్నాయని అర్ధమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 25 రోజులు దాటిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ సిద్ధపడలేదన్న కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు.
మరోపక్క సాగు సంక్షోభం తీవ్రంగా ఉన్నదని వివిధ కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంతంలో ఈ నెల రోజుల్లో 68మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం ఎత్తులు, పైయెత్తులు వేయడంలో క్షణం తీరిక లేకుండా ఉంటే... తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో రైతులకు తెలియడం లేదు.అయితే, సైద్ధాంతికంగా భిన్న ధ్రువాలైన పార్టీలు కలవడానికి ప్రయత్నించినప్పుడు ఈమాత్రం జాప్యం చోటుచేసుకోవడం సహజమేనని కొందరు చెబుతున్నారు. ఇందులో అర్ధసత్యం మాత్రమే ఉంది. విశ్వాసాలకు కట్టుబడి ఉండటం కంటే అవకాశాలనూ, అనుకూలతలనూ వెదుక్కోవడమే ఈమధ్య అందరికీ ప్రధానమైపోయింది. చెప్పాలంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు సైద్ధాంతిక గుంజాటన పెద్దగా లేదు.
రాష్ట్రాల్లో వీలైనన్నిచోట్ల బీజేపీకి అధికారం దక్కకుండా చేసి, తాము అధికార పీఠాలకు దగ్గరకావడం ఎలాగన్నదే కాంగ్రెస్‌ను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. అందుకోసమే కర్ణాటకలో అలాంటి ప్రయత్నం చేసి, తనకంటే చాలా తక్కువ స్థానాలొచ్చిన జేడీఎస్‌కు ముఖ్య మంత్రి పగ్గాలు అప్పజెప్పింది. ఆ ప్రయోగం విఫలమై, చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో అది ఖంగుతింది. చివరకు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన హెచ్‌డీ కుమారస్వామి నుంచి సైతం ఆ పార్టీ మంచి మార్కులు పొందలేకపోయింది. మహారాష్ట్ర పరిస్థితి కాస్త భిన్నం. అక్కడ శివసేన హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రవచించడంతోపాటు మరాఠాల ప్రయోజనాలు కాపాడు తున్నామన్న పేరిట పలు సందర్భాల్లో పొట్టకూటి కోసం వలస వచ్చేవారిపై దుందుడుకుతనాన్ని ప్రదర్శించిన పార్టీ.
అలాంటి పార్టీతో పొత్తుకు సిద్ధపడితే వెంటనే జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందోనన్న శంక కాంగ్రెస్‌కు ఉంది. అలాగే అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ప్రస్తుతం అధి కారంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి పాలన అంతమై, తన నేతృత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం వస్తుందన్న ఆశ కాంగ్రెస్‌కు ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనతో చెలిమి చేస్తే కేరళపై దాని ప్రభావం పడి ఈసారి ఫలితం తారుమారవుతుందన్న శంక ఆ పార్టీని పీడించింది. అంత మాత్రం చేత శివసేనతో కలిసే ప్రసక్తి లేదని చెప్పేంత ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. అలా ప్రకటించాక పార్టీలో ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో చెప్పడం కష్టం.
అధికారానికి చేరువయ్యే అవకాశం వచ్చి నప్పుడు సిద్ధాంతాల పేరు చెప్పి దాన్ని చేజార్చుకోవడం వారికి ససేమిరా మింగుడుపడని విషయం. వేరే రాష్ట్రాల్లో సమస్యలొస్తాయన్న అంచనాతో తమ అవకాశాలకు అడ్డుపడటం వారు సహించలేరు! కాంగ్రెస్‌కు ఇన్ని సమస్యలు ఉండబట్టే మహారాష్ట్రలో జాప్యం తప్పలేదు.
హిందుత్వ ఛత్రఛాయలో ఒక్కటిగా ఉంటున్నామని ఇన్నాళ్లూ చెప్పుకున్న బీజేపీ, శివసేనల తీరు కూడా మహారాష్ట్రలో బట్టబయలైంది. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్‌ను కాదని శివసేన కాంగ్రెస్‌తో చెలిమి చేసిన సందర్భాలు గతంలో ఉన్నా... 80వ దశకం నుంచి బీజేపీ, శివసేనలు రెండూ సమష్టిగా ఉద్యమాలు నడుపుతున్నాయి, కలిసి పోటీ చేస్తున్నాయి.
వాజపేయి హయాంలో బీజేపీ మితవాద ధోరణిని ప్రదర్శిస్తున్నప్పుడు బాల్ ఠాక్రే హిందుత్వకు సంబంధించిన పలు అంశాల్లో దూకుడుగా ఉండేవారు. అయినా బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం, 370 అధికరణ రద్దు, రామజన్మభూమి తదితర అంశాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న వర్తమానంలో శివసేన ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్, ఎన్సీపీలకు చేరువ కావడం గమనించదగిన విషయం. శివసేనతో తమకు సైద్ధాంతిక సామీప్యత ఉన్నదని బీజేపీ నిజంగా భావిస్తే... శివసేన కోరుకున్నట్టు సీఎం పదవిని రెండున్నరేళ్లు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ లేకపోయింది? అందుకు అడ్డుపడిన అంశాలేమిటి? అలాగే ఇన్ని దశాబ్దాలుగా హిందుత్వ గురించి అంతగా పరితపిస్తున్న శివసేన ఈ సమయంలో బీజేపీకి ఎందుకు దూరం కావాల్సివచ్చిందో చెప్పాలి.
కేవలం ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే ఏకైక కారణమా? అయితే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలవడం సాధ్యపడినా... ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఆ కూటమికి వస్తుందో రాదో చెప్పడం సులభమేమీ కాదు. రెండేసి పార్టీలు రెండు ప్రత్యర్థి కూటములుగా ఎన్నికల్లో జనం ముందుకెళ్లగా... ఒక కూటమిలోని పార్టీ ఇప్పుడు ఒంటరిగా మిగి లింది. రెండు పార్టీలున్న మరో కూటమి ప్రస్తుతం మూడు పార్టీల కూటమిగా రూపాంతరం చెందింది.
ఈ సరికొత్త కూటమి శనివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ లేఖ ఇచ్చాక ఏ పార్టీల్లో ఎలాంటి కుదుపులుంటాయో... గవర్నర్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. పార్లమెంటరీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తీసుకునే నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రజల శ్రేయస్సును, వారి ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవడం ప్రధానమని అందరూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment