దళిత వర్గాల రక్షణకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టంలోని కొన్ని నిబంధన లను పునరుద్ధరిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడుతూ, దాన్ని నివారించటం కోసమని మొన్న మార్చిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ లలిత్‌ల నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినప్పటినుంచీ దళిత వర్గాల్లో ఆందోళన ఏర్పడింది. ఈ మార్గదర్శకాలు చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీసి, దాన్ని నీరుగారుస్తున్నా యన్నది ఆ వర్గాల ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో దళితుల్లో ఏ స్థాయిలో ఆగ్రహావేశాలున్నాయో ఏప్రిల్ 2న జరిగిన దేశవ్యాప్త బంద్ నిరూపించింది. అందులో హింస చెలరేగి 9మంది ప్రాణాలు కోల్పోవటంతోపాటు భారీయెత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఆదేశాలను వెంటనే నిలుపుదల చేయటం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పటంతో ఈ విషయంలో ఆర్డినెన్స్ లేదా సవరణ బిల్లు తీసుకురావాలన్న డిమాండు బయల్దేరింది. అయితే తీర్పు వెలువరించినవారిలో ఒకరైన జస్టిస్ ఏకే గోయెల్‌కు రిటైరయ్యాక జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) చీఫ్ పదవి అప్పగించటంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని, చట్టంలోని నిబంధనలు పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్త బంద్ పాటించాలని దళిత సంఘాలు నిర్ణ యించాయి. బహుశా ఈ ఏడాది చివరిలో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సవరణ బిల్లు తీసుకురావటం తప్పనిసరని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా భావించి ఉండొచ్చు.
దళిత సంఘాల డిమాండ్లు, బీజేపీ రాజకీయ అవసరాల సంగతలా ఉంచి సుప్రీంకోర్టు అభిప్రా యపడినట్టు చట్టం నిజంగా దుర్వినియోగం అవుతున్నదా అన్న సంగతిని చూడాల్సి ఉంది. తన ముందుకొచ్చిన కేసును విచారిస్తూ ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందులో అవాస్తవ మేమీ లేకపోవచ్చు. ఇలాంటి దుర్వినియోగం ఆరోపణలు చాలా చట్టాల విషయంలో తరచు వస్తూనే ఉన్నాయి. అయితే అత్యాచారాల నిరోధక చట్టం కింద పడే శిక్షల శాతాన్నిబట్టి మాత్రమే ఆ నిర్ణయా నికి రావటం అహేతుకం. సుప్రీంకోర్టు ఆ నిర్ణయానికి రావటంతోపాటు ఫిర్యాదులొస్తే నిందితులను వెనువెంటనే అరెస్టు చేయరాదని సూచించింది. ప్రభుత్వోద్యోగులపై అయితే వారి నియామక అధి కారి నుంచి, ప్రైవేటు ఉద్యోగుల విషయంలో అయితే సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎ స్‌పీ)నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. అంతేకాదు... కేసు నమోదు చేసే ముందు ఆ ఫిర్యాదు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్నది పరిశీలించాలని కోరింది.
తొలిసారిగా 1955లో అమల్లోకొచ్చిన అంటరానితనం(నేరాల) చట్టం, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ 1976లో తీసుకొచ్చిన పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఆ చట్టం స్థానంలో 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం, దానికి చేర్పుగా 1995లో జారీ అయిన నిబంధ నలు.. ఇవేవీ దళిత కులాలపై, ఆదివాసీలపై సాగుతున్న దురంతాలను నివారించలేకపోయాయి. దళితులపై ఏదైనా జరిగాక చర్య తీసుకోవటం కాక, అవి చోటుచేసుకోకుండా చూడటమే చట్టం ప్రధానోద్దేశమని ప్రభుత్వం అప్పట్లో చెప్పినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అఘా యిత్యాలు ఏటికేడాదీ పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఏటా వెలువరించే నివేదికలే ఇందుకు సాక్ష్యం. ఇవిగాక ఎఫ్‌ఐఆర్ నమోదు వరకూ రాకుండా పోతున్న కేసులు మరెన్నో ఉంటున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్‌లలో 2016లో దళితులను హత్య చేసిన ఘటనలు అధికంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఒకపక్క దురంతాలిలా పెరుగుతుంటే మరోపక్క అత్యాచారాల నిరోధక చట్టం కింద దాఖలైన కేసుల్లో శిక్షల శాతం తగ్గుతోంది. 2016లో ఎస్సీ కేసుల్లో 25.7 శాతం, ఎస్టీ కేసుల్లో 20.8 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. భారత శిక్షాస్మృతి(ఐపీసీ) కింద పడుతున్న శిక్షల శాతం గత దశాబ్దకాలంలో పెరగ్గా... అత్యాచారాల నిరోధక చట్టం కేసుల్లో మాత్రం శిక్షలు తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి ఆధిపత్య కులాలవారు అతిగా ప్రవర్తిం చినా దళిత కులాలవారు కేసు పెట్టడానికి జంకుతారు. వారితో గొడవ పడితే తమకు రోజు గడవటం కష్టమని జరిగిన అవమానాలను దిగమింగుకుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు కేసును రిజిస్టర్ చేయకుండా అవతలిపక్షానికి కబురంపి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు.
తప్పనిసరై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక కూడా దళితులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి కేసు నిజమైనదే అయినా తగిన సాక్ష్యాలు దొరకలేదని, పొరపాటున చేసిన ఫిర్యాదన్న సాకు చూపి బుట్టదాఖలా చేస్తుంటారు. అన్నీ దాటుకుని న్యాయస్థానం వరకూ వెళ్లినా ‘కోర్టు వెలుపల పరిష్కరించుకోమ’ని ఒత్తిళ్లు వస్తుంటాయి. దళితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు జరిగిన ఘటనకు దళితేతరులు ఇద్దరు సాక్ష్యమిస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీస్‌స్టేషన్లలో చెబుతుంటారు. చట్టంలో ఇందుకు సంబంధించిన నిబంధనేదీ లేకపోయినా ఇదొక సంప్రదాయంగా అమలవుతోంది. పైగా పోలీసులకు అవగాహన లేకనో, మరే కారణం చేతనో ఫిర్యాదు ఎంత తీవ్రమైనదైనా... ఉద్దేశపూర్వకంగా అవమానించటం, చిన్నబుచ్చటం, భయపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించే చట్టంలోని సెక్షన్ 3(1)(10)కింద మాత్రమే కేసు నమోదు చేస్తుంటారని అహ్మదాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం అధ్యయ నంలో వెల్లడైంది. ఇప్పుడు కేంద్రం సవరణ బిల్లు తీసుకురావటం మాత్రమే కాదు... క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇలాంటి పెడ ధోరణులను అరికట్టడానికి ఏం చేయాలో కూడా ఆలోచించాలి. దళి తులు, ఆదివాసీ వర్గాల్లో అభద్రతా భావన తొలగించటమే ధ్యేయం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment