షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు తక్షణం అరెస్టు చేయొద్దని, దాఖలైన కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తొలుత పరిశీలించాలని గత ఆదేశాల్లో సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని, ప్రైవేటు ఉద్యోగుల విషయంలోనైతే సీనియర్ సూపరింటెండెంట్(ఎస్‌ఎస్‌పీ) అనుమతి తీసుకోవాలని కూడా నిర్దేశించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకున్న పక్షంలో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ భూషణ్ గవాయ్‌ల నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మార్గదర్శక సూత్రాల్లో ముందస్తు బెయిల్ అంశం మినహా మిగిలినవాటిని వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టు నిరుడు ఇచ్చిన తీర్పు దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటికీ అంటరానితనం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పు తమ మనుగడకు చేటు కలిగిస్తుందని ఆ వర్గాలు కలవరపడ్డాయి.
ఆ తీర్పును నిరసిస్తూ నిరుడు ఏప్రిల్ 2న దేశవ్యాప్త బంద్ జరగడం, అందులో హింస చెలరేగి 11మంది ప్రాణాలు కోల్పోవడం, విధ్వంసం చోటుచేసుకోవడం అందరికీ గుర్తుంది. పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు పలు సంస్థలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధిపత్యకులాల్లో కులదురహంకారం బలంగా ఉన్నదని, దళితులను తోటి మనుషులుగా పరిగణించే మనస్తత్వం కరువైందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1955లో తొలిసారి ఈ వివక్షను అంతమొందించేందుకు అంటరాని తనం(నేరాల)చట్టం తీసుకొచ్చింది. 1976లో దానికి ఎన్నో మార్పులు, చేర్పులు చేసి పౌరహక్కుల చట్టంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆచరణలో లోటుపాట్లను గుర్తించాక 1995లో దానికి మరికొన్ని నిబంధనలు జోడించారు. కానీ ఎన్ని మార్పులు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. దళితులకు కనీస హక్కులు నిరాకరించడం, వారి ప్రాణాలు తీయడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి ఉన్నకొద్దీ పెరుగుతూ పోయాయి. దేశంలోని పలుప్రాంతాల్లో దళితుల ఊచకోతలు యధేచ్ఛగా సాగాయి. ఈ తీరు గమనించాక 1989లో మరింత పకడ్బందీ నిబంధనలతో షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కేవలం చట్టాల వల్ల మనుషుల్లో మార్పు రాదు. అవి సక్రమంగా అమలైనప్పుడే, నిందితులకు సత్వరం శిక్షలు పడే వ్యవస్థ ఉన్నప్పుడే ఎంతోకొంత ఫలితం వస్తుంది. దాన్ని చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో అసలు చట్టాన్నే నీరుగారిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని సుప్రీంకోర్టు గమనించలేకపోయింది.
అయితే ఈ చట్టం దుర్వినియోగం కావడం లేదని చెప్పడం అసత్యమే అవుతుంది. కానీ ఆ నిర్ధా రణకు రావడానికి సుప్రీంకోర్టు చూపిన కారణాలు సబబుగా లేవు. ఈ చట్టం కింద దాఖలవుతున్న కేసుల్లో శిక్షల శాతం తక్కువ గనుక అది దుర్వినియోగమవుతున్నట్టేనని భావించడం సహేతుకం కాదు. అదే గీటురాయి అన్ని చట్టాలకీ వర్తింపజేస్తే వాటిలో ఎన్ని మిగులుతాయో చెప్పడం కష్టం. కేవలం తప్పుడు కేసులు పెట్టడం ఎక్కువగనకే ఫలానా చట్టంకింద శిక్షలు పడటం తక్కువన్న నిర్ధారణకు రాలేం. అందునా వివక్షను అంతమొందించడానికి ఉద్దేశించిన షెడ్యూల్ కులాల, తెగల చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు పోలీసులు వాటిని వెంటనే స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకుంటారని ఆశించలేం. ఎందుకంటే ఇలాంటి నేరాలకు పాల్పడేవారంతా సమాజంలో ఎంతో పలుకుబడిగలవారు అయి ఉంటారు. ఎవరినైనా కొనగల స్థాయిలో ఉంటారు. తమనెవరూ ఏం చేయలేరనే భరోసాతో ఉంటారు.
అలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగడం అంత సులభం కాదు. ఎవరి ఒత్తిళ్లకూ, ఏ ప్రలోభాలకూ లొంగని వ్యక్తిత్వం ఉండే అధికారులు మాత్రమే నిష్పక్షపాతంగా వ్యవహరించగలుగుతారు. ఇవేమీ లేనప్పుడు ఫిర్యాదు చేయడానికెళ్లిన దళితులకు బెదిరింపులు ఎదురవుతాయి. కొన్నిసార్లు వారికి డబ్బు ఆశ చూపి రాజీ పడమని చెబుతారు. ‘పెద్దవాళ్ల’తో పెట్టుకుంటే ముందూమునుపూ ముప్పు కలుగుతుందంటారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడినా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో తాత్సారం చేస్తారు. చివరకు కేసు పెట్టినా అందులో దర్యాప్తు సక్రమంగా ఉండదు. న్యాయస్థానాల వరకూ వెళ్లాక సాక్షుల్ని బెదిరిస్తారు. విచారణ ఏళ్ల తరబడి సాగడం వల్ల దళితులే నిరాశకులోనై ఆసక్తిని కోల్పోతారు. ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నిందితులకు శిక్ష పడుతుంది. ఎస్సీ, ఎస్టీ చట్టంకింద వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం వరకూ న్యాయస్థానాలముందుకే పోవని నాలుగేళ్లక్రితం ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ జరిపిన అధ్యయనంలో తేలింది. కనుక శిక్షల శాతం తక్కువుండటాన్ని బట్టి దాని దుర్వినియోగాన్ని నిర్ధారించడం పొరపాటు. దీనికితోడు దేశవ్యాప్తంగా దళితులపై వేధింపుల ఉదంతాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక చెబుతోంది.
ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడం స్వాగతించదగ్గది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు జరపడం పోలీసుల విధి అని సుప్రీంకోర్టు తాజా తీర్పులో తెలియజేసింది. అయితే ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేదని తేలినపక్షంలో బాధ్యులైనవారిపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉండాలి. ఎందుకంటే దాన్నిబట్టే నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరవుతుంది. కనుక ఈ విషయంలో తగిన దృష్టి పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment