
మళ్లీ అదే దుర్మార్గం
(సాక్షి సంపాదకీయం)
దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం చోటు చేసుకుని సరిగ్గా రెండేళ్లవుతున్నది. ఆ సమయంలో వెనువెంటనే రెండు నెలల వ్యవధిలో హడావుడి ఆర్డినెన్స్... అటు తర్వాత నిర్భయ చట్టమూ అమల్లోకి వచ్చాయి. లైంగిక నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు కఠినంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. అప్పటినుంచీ ఆ స్థాయి దుర్మార్గం జరిగినట్టు మీడియాలో రాలేదు గనుక ఆ చట్టం ప్రభావం గట్టిగానే ఉన్నదని...అంతా సవ్యంగా సాగుతున్నదని పాలకులు, అధికార యంత్రాంగమూ, పోలీసులు అనుకుని ఉంటారు. కానీ న్యూఢిల్లీలో ఎప్పటిలానే అరాచకం అలముకుని ఉన్నదని, మహిళల భద్రత కోసం అమల్లోకి తెచ్చిన సర్వ వ్యవస్థలూ మొద్దు నిద్రపోతున్నా యని రెండురోజుల క్రితం జరిగిన మరో అత్యాచార ఘటన రుజువుచేసింది. రాత్రి 9గంటల సమయంలో క్యాబ్ ఎక్కిన మహిళ ఆ మహా నగరంలో సురక్షితంగా గమ్యస్థానం చేరుకోలేక పోయిందంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది.
ఆమె ఏదో నాసిరకం సర్వీసుకు సంబంధించిన క్యాబ్ ఎక్కలేదు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన ఉబెర్ సంస్థ మొబైల్ యాప్ ద్వారా ఆమె క్యాబ్ మాట్లాడుకున్నారు. ప్రతి క్యాబ్‌కూ జీపీఎస్ అనుసంధానమై ఉండాలని, దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనించి అవసరమైతే డ్రైవర్‌తో మాట్లాడే వ్యవస్థ 24 గంటలూ పనిచేయాలని నిబంధనలున్నాయి. కానీ అవన్నీ సక్రమంగా అమలవుతున్నాయో, లేదో చూసే నాథుడు లేడు. ఉబెర్ సంస్థ సొంతంగా అమలు చేస్తున్న నిబంధన వేరు. డ్రైవర్ దగ్గరున్న సెల్‌ఫోన్‌లో ఉబెర్ యాప్ ఉంటే సరిపోతుంది. దానితో జీపీఎస్ అనుసంధానమై ఉంటుంది. నేర స్వభావం ఉన్న ఏ డ్రైవరైనా తన ఫోన్‌ను స్విచాఫ్ చేస్తే అతని ఆచూకీ తెలిసే అవకాశం లేదు. ఇక ఏ సంస్థ అయినా డ్రైవర్‌ను చేర్చుకునేటపుడు పోలీసుల సాయంతో అతని పూర్వాపరాలను ఆరా తీయాలని కూడా నిబంధన ఉన్నది. అలా ఆరా తీయడం మాట అటుంచి అతనికి ఢిల్లీలో వాహనం నడిపేందుకు అవసరమైన లెసైన్స్ కూడా లేదు.
పోలీసుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు... రెండు గంటల నామమాత్ర శిక్షణనిచ్చి చేర్చుకుంటోంది. ఇదే సంస్థ అమెరికాలో అమలు చేస్తున్న నిబంధన వేరు. పోలీసులిచ్చే నివేదికలకు తోడు తాము సొంతంగా క్యాబ్ డ్రైవర్ల పూర్వాపరాలను తెలుసుకుని, అన్నీ సక్రమంగా ఉన్నవారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నామని అక్కడి వినియోగదారులకు హామీ ఇస్తోంది. అందుకు అదనంగా మరో డాలర్ చార్జి చేస్తుంది. కానీ, మన దేశం వచ్చేసరికి ఇలాంటి ఏర్పాటు లేదు. ఒకే సంస్థ ఇలా రెండు దేశాల్లో వేర్వేరు ప్రమాణాలను పాటిస్తున్నదంటే ఇక్కడి పౌరుల భద్రతపై ఆ సంస్థకున్న నిర్లక్ష్యం ఏపాటో అర్థమవుతుంది. పైగా తాము క్యాబ్ సర్వీస్ నిర్వాహకులం కాదని...క్యాబ్‌లో వెళ్లదల్చుకున్నవారికి, క్యాబ్ డ్రైవర్లకూ సంధానకర్తలం మాత్రమేనని ఉబెర్ చెబుతోంది. అనుకోని ఘటన ఏదైనా సంభవిస్తే తప్పించుకోవడానికి అన్ని మార్గాలను సిద్ధం చేసుకున్నదని దీన్నిబట్టే అర్థమవుతుంది. కానీ, అర్థంకానిది ఢిల్లీ పోలీసు యంత్రాంగానికే.
ఇప్పుడు ఢిల్లీ ఉదంతంలో అరెస్టయిన శివ్‌కుమార్ యాదవ్ పాత నేరస్తుడు. రెండేళ్లక్రితం జరిగిన అత్యాచారం కేసులో అతను నిందితుడు. ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, విచారణ ఏ స్థాయిలో ఉందో ఎవరికీ తెలియదు. కనీసం ఢిల్లీ పోలీసులు కూడా దాని సంగతి చెప్పలేకపోతున్నారు. ఆ తర్వాత ఎంతమందిపై ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడో తెలియదు. ఎందుకంటే బాధితులు ధైర్యంగా బయటకొచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఈ తరహా కేసులు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. ఢిల్లీ పోలీసులు ఇచ్చినట్టు చెబుతున్న ధ్రువీకరణపత్రం శివ్‌కుమార్ యాదవ్ సత్ప్రవర్తనగలవాడని చెబుతోంది. అయితే, అది తాము ఇచ్చింది కాదని, ఫోర్జరీదని పోలీసులంటున్నారు. నిర్భయ ఉదంతం జరిగిన ఢిల్లీ మహానగరంలోనే నేర స్వభావం గల ఒక వ్యక్తి అసలైనదో, ఫోర్జరీదో ధ్రువీకరణ పత్రం తెచ్చుకుని ఒక సంస్థ పేరిట ఇన్నాళ్లపాటు క్యాబ్‌ను నడిపాడంటే సమస్త యంత్రాంగమూ ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదో తెలుస్తుంది. అటు పోలీసులుగానీ, ఇటు రవాణా విభాగంగానీ జవాబుదారీ తనంతో వ్యవహరించివుంటే... బాధ్యతను గుర్తెరిగితే ఈ ఘటన జరిగేది కాదు. నిర్భయ ఉదంతం అనంతరం ఏర్పాటుచేసిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ మహిళల భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పింది. ముఖ్యంగా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ణీత కాలవ్యవధిలో తనిఖీ చేస్తుండాలని, అలసత్వాన్ని ప్రదర్శించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ, ఏ స్థాయిలోనూ దాన్ని అమలు చేసిన దాఖలా లేదు. నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వేలాదిమంది నిరసన ప్రదర్శనలు జరిపారు.
ఢిల్లీలో అయితే అలాంటి ప్రదర్శనలు రోజుల తరబడి సాగాయి. కానీ అవన్నీ ఢిల్లీలో ఒక పార్టీని అధికారం నుంచి దించడానికి ఉపయోగపడినట్టుగా అధికార యంత్రాంగం ఆలోచనా సరళిని మార్చడానికి తోడ్పడలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా మహిళల భద్రత చుట్టూ తిరిగాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఢిల్లీ ఏ కొంచెమూ మారలేదని తాజా ఘటన రుజువు చేస్తున్నది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 24,923 అత్యాచారాలు జరిగితే గత ఏడాది వాటి సంఖ్య 33,707కు చేరుకున్నది. కఠిన చట్టాలు మాత్రమే పరిస్థితిని మార్చలేవు. నిరంతరం అప్రమత్తంగా, జవాబుదారీతనంతో వ్యవహరించే అధికార యంత్రాంగమూ, సత్వర విచారణ జరిపి నేరస్తులను దండించగలిగే వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితా లుంటాయి.