సమస్యల ‘సహజీవనం’! | supreme court supports live - in relationship | Sakshi
Sakshi News home page

సమస్యల ‘సహజీవనం’!

Published Sun, Dec 1 2013 4:01 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

supreme court supports live - in relationship

భిన్న విలువలు సహజీవనం చేసే సమాజంలో కొన్నిటిని మాత్రమే గుర్తించి, మరికొన్నిటి ఉనికే తెలియనట్టుగా ప్రవర్తిస్తే అది కపటత్వం అనిపించుకుంటుంది. మన దురదృష్టం... అలాంటి కపటత్వం అంతటా ఆవరించి ఉంది. స్త్రీ, పురుష సంబంధాలు అనేక రకాలుగా ఉంటున్నప్పుడు, దాదాపు అన్నిటిలోనూ సమస్యలు తలెత్తుతున్నప్పుడు కొన్నిటి గురించే ఆలోచించడం, వాటి విషయంలోనే చట్టాలు చేయడం అలాంటి కపటత్వం పర్యవసానమే. అన్నీ ప్రభుత్వానికి తెలియాలని లేదు. కానీ, సూచనలు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకుని ఏం చేద్దామనే విచికిత్స ఉండాలి. అందునా అలాంటి సూచన చేసింది సర్వోన్నత న్యాయస్థానం అయినప్పుడు దాన్ని పట్టించుకుని తీరాలి. ఆ పని జరగనందువల్లనే సుప్రీంకోర్టు మరొక్కసారి చెప్పాల్సివచ్చింది. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో కాదని... అలాంటి సంబంధాల్లో ఉన్న మహిళలకు, వారి పిల్లలకు సంబంధించి రక్షణ కల్పించేలా ఒక చట్టం అవసరమని గురువారం వెలువరించిన తీర్పులో పార్లమెంటుకు సూచించింది. స్త్రీ, పురుష సంబంధాల విషయంలో గతంలోనూ సుప్రీంకోర్టు కొన్ని విలువైన వ్యాఖ్యలు చేసింది. వివాహమనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని, వారి సంతానాన్ని అక్రమ సంతానంగా పరిగణించరాదని అయిదేళ్లక్రితం ఒక కేసు సందర్భంగా స్పష్టంచేసింది.
 
 దాదాపు మూడేళ్లక్రితం భరణం గురించి వచ్చిన కేసు సందర్భంగా  సుప్రీంకోర్టు ఈ విషయంలో మరింత నేరుగా చెప్పింది. తమిళనాడుకు చెందిన ఒక జంట మధ్య విభేదాలు తలెత్తి, భరణం కోసం ఆమె ఆశ్రయించినప్పుడు ఈ తీర్పునిచ్చింది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆమెకు భరణం ఇప్పించలేమని చెబుతూనే ఆ విషయమై ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరింది. వారిది సహజీవనమే అయినా దాంపత్యంగా పరిగణించలేమని, ప్రస్తుతం ఉన్నచట్టాలు అందుకు అనుగుణంగా లేవని తెలిపింది. 2005 నాటి గృహ హింస చట్టం స్త్రీ, పురుష సంబంధాల్లో కొన్నిటిని మాత్రమే గుర్తించి, వాటిని మాత్రమే దాంపత్యంగా పేర్కొంటున్నదని వివరించింది. ఇతరత్రా సంబంధాల్లోకి వెళ్లిన మహిళలు పురుషుడి చేతిలో హింసకు గురవుతున్నప్పుడు చట్టం ఎలాంటి రక్షణా కల్పించడంలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. నిజానికి ఇది జటిలమైన సమస్య. స్త్రీ, పురుష సహజీవనం వివాహం ద్వారా ఏర్పడాలా, దానితో సంబంధంలేని మరే ఇతర పద్ధతిలోనైనా ఉండవచ్చునా అనే సమస్య ఎప్పుడూ ఉంది. ఫలానా సంబంధం మాత్రమే సరైందని నిర్ధారించడానికి ఎలాంటి తూనిక రాళ్లూ ఉండవు. ఆయా సమాజాలు మొత్తంగా ఆచరించే విలువలను బట్టి అది మారుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న మన సమాజంలో ఏదో ఒకటి మాత్రమే సరైనదని చెప్పడానికి లేదు. గృహహింస చట్టం వివాహబంధానికి వెలుపల ఏర్పడే సంబంధాలను తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నది. ఆ మేరకు అది ప్రగతిశీలమైనదే. కానీ, అది కూడా పరిమితులకు లోనయింది. కొన్ని సంబంధాలను అది గుర్తించ నిరాకరిస్తున్నది. కేవలం ‘వివాహ స్వభావం కలిగిన సంబంధాల’ గురించి మాత్రమే అది మాట్లాడింది. ఉదాహరణకు బహు భార్యత్వాన్ని అది ‘వివాహ సంబంధం’గా పరిగణించదు. చట్టం గుర్తించినా గుర్తించకపోయినా అలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి. తెలిసిగానీ, తెలియకగానీ అలాంటి సంబంధాల్లోకి వెళ్లిన మహిళలు మగవాడి దాష్టీకానికి గురవుతున్నారు. అలాంటి మహిళకు, ఆమె పిల్లలకు ఎలాంటి రక్షణా, ఆధారమూ ఉండటంలేదు. ఆ సంబంధాన్ని గుర్తిస్తే వివాహ సంబంధంలో ఉన్న మహిళకూ, ఆమె పిల్లలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న కారణంతో దాన్ని చట్టం పట్టించుకోవడంలేదు. ఈ బహుభార్యత్వంలో కూడా సాధారణ వివాహ సంబంధాల్లోని మహిళలాగే ఆమె అన్ని రకాల బాధ్యతలనూ నిర్వర్తిస్తుంది. కానీ, పురుషుడికి వ్యామోహం తీరినప్పుడో, అహం దెబ్బతిన్నప్పుడో ఆ మహిళ నిరాశ్రయురాలవుతున్నది.
 
  ఇలాంటి సంబంధాలను ‘వివాహ స్వభావంగల సంబంధాలు’గా పరిగణించడానికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించింది. ఆ స్త్రీ, పురుషులిద్దరూ ఒకే ఆవాసాన్ని పంచుకోవడం, కలిసివున్న కాలం, వారిమధ్య ఏర్పడిన లైంగిక సంబంధాల స్వభావం, వారికుండే సంతానం, వారి ఆదాయ వనరులు, వాటిని ఖర్చుపెట్టే తీరు వంటివి గమనంలోకి తీసుకుని బాధిత మహిళకు రక్షణ కల్పించే విధంగా చట్టం చేయాలని పేర్కొంది. వివాహం కాకపోయినా దీర్ఘకాలంగా కలిసి ఉంటున్నప్పుడు దాన్ని వివాహంగా గుర్తించవచ్చని అయిదేళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగని, ఈ చట్టం అక్రమ పద్ధతుల్లో ఏర్పడే సంబంధాలకు, చేరదీయడం వంటి సంబంధాలకు ఆటవిడుపు ఇచ్చేదిగా ఉండకూడదని కూడా తెలిపింది. మన సమాజం ఎంతగా పురోగమిస్తున్నదనుకున్నా దీనికుండే భూస్వామ్య పెత్తందారీ పోకడలు మౌలికంగా మారలేదు. పురుషుడి ఆధిపత్య భావజాలం అందులో నుంచి వచ్చిందే. స్త్రీ, పురుష సంబంధాల్లో ఇది అప్రజాస్వామికతను పెంచుతున్నది. తెలిసో, తెలియకో వివాహ పరిధి వెలుపల ఏర్పర్చుకునే సంబంధాలవల్ల ఇబ్బందులు పడుతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సహజీవనంలో ఉండి విడిపోయే మహిళలకు విదేశాల్లో ‘పాలీమనీ’ పేరిట భరణం ఇవ్వడమనే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం ఆ తరహా మహిళలకు ఎలాంటి రక్షణా ఉండటం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వమూ, పార్లమెంటూ ఆలోచించాలి. తగిన చట్టం తీసుకొచ్చి నిస్సహాయులుగా మిగులుతున్న మహిళలను ఆదుకునేందుకు ప్రయత్నించాలి. సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం, పరిష్కారానికి పూనుకోవడం అవసరం. ఆ సంగతి సుప్రీంకోర్టు చెబితేగానీ తెలుసుకోలేని స్థాయిలో ఉండటం మంచిది కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement