సహజీవనం నేరం కాదు.. పాపం కాదు: సుప్రీంకోర్టు
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినంత మాత్రాన అది నేరం గానీ, పాపం కానీ కానే కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సంబంధాలు పెట్టుకుని, వాటి వల్ల పిల్లలను కనే మహిళల రోణకు చట్టం చేయాలని పార్లమెంటుకు సూచించింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ తరహా సంబంధాలు పెళ్లి లాంటివి కావు, చట్టంలో వాటికి గుర్తింపు లేదు కాబట్టి వీటిని నియంత్రించేందుకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చారిత్రక తీర్పు వెలువరించింది.
''సహజీవనం కూడా పెళ్లి లాంటిదే'' అనే అర్థం వచ్చేలా సూచనలు తయారుచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పార్లమెంటు ఈ అంశాలపై స్పందించాలని, తగిన చట్టం చేయడం లేదా ఉన్న చట్టాలకే సవరణ చేయడం ద్వారా మహిళలు, వాళ్ల పిల్లలకు రక్షణ కల్పించాలని తెలిపింది. ఇలాంటి సంబంధాలు పెళ్లిలాంటివి కాకపోయినా, ఈ రక్షణ మాత్రం వారికి అవసరమని ధర్మాసనం చెప్పింది.