సంపాదకీయం: నిర్భయ చట్టంలాంటి కఠినమైన చట్టం తెచ్చాం గనుక ఇక మన బాధ్యత తీరిందని పాలకులు భావిస్తున్న దాఖలాలు కనిపిస్తుండగా మహిళలపై అత్యాచారాలు మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తిన దేశ రాజధానిలోనే అవి ఆగలేదు. ఇక ఇతరచోట్ల అంతకన్నా మెరుగైన పరిస్థితి ఉంటుందని భావించడం అత్యాశే అవుతుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్‌భూమ్ జిల్లా సుబల్‌పూర్‌లో ఆదివాసీ యువతిపై అక్కడి తెగ పంచాయతీ ఆదేశం మేరకు జరిగిందని చెబుతున్న సామూహిక అత్యాచారం ఈ పరంపరలో అత్యంత భయానకమైనది. ఒంటరిగా ఉన్న యువతిపైనో, నిస్సహాయ స్థితిలో ఉన్న మరొకరిపైనో జరిగే నేరాలను అదుపు చేయడం ఒక ఎత్తయితే... ఇలా కుల పంచాయతీలు, తెగ పంచాయతీలు కొనసాగి స్తున్న దుశ్శాసనపర్వాలు మరో ఎత్తు. హర్యానాలోనూ, యూపీలోనూ ఖాప్ పంచాయతీల వంటివి మహిళలపైనా, బాలికలపైనా తరచు చేసే తీర్మానాలు, తీసుకునే చర్యలు మధ్యయుగాల జాడలను తలపిస్తుంటే... ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఘటన వాటికేమాత్రం తీసిపోకుండా ఉన్నది.
బెంగాల్ ఘటన అనేకవిధాల ఆందోళనకరమైనది. ఎందుకంటే, ఎంతో నాగరికమని మనమంతా అనుకునే వెలుపలి సమాజంతో పోలిస్తే ఆదివాసీల్లో ప్రజాస్వామిక వాతావరణం హెచ్చు. స్త్రీ, పురుష వివక్ష కూడా తక్కువ. పైగా, ఈ ఘటన చోటుచేసుకున్న బీర్‌భూమ్ ఆదినుంచీ వామపక్ష ఉద్యమాల ప్రభావానికి లోనైన ప్రాంతం. ఇలాంటిచోట ఇంతటి దుర్మార్గం చోటుచేసుకోవడమంటే బయటి సమాజంలోని తెగుళ్లు దానికి కూడా సోకుతున్నాయని అర్ధం. బాధితురాలిపైనే నిందలు వేసే సంస్కృతి కూడా పెరిగింది. స్థానిక మహిళలు కొందరిని ప్రశ్నించిన ప్పుడు ఆ యువతి ప్రవర్తన సరైనది కాదని వారు చెప్పారట!
అంటే ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ‘నాగరికత’ బాగానే వేళ్లూనుకుంటున్నదన్న మాట! ఇంతకూ ఆ యువతి చేసిన నేరమేమిటి? 20 ఏళ్ల వయసులోనే ఆమె ఢిల్లీ వెళ్లి కూలి పనిచేసి డబ్బులు సంపాదించింది. స్థానికంగా రోజుకు రూ. 180 వస్తుండగా ఆమె రోజుకు రూ. 450 సంపాదించింది. ఇంటికి డబ్బులు పంపి ఉన్నంతలో పక్కా ఇల్లు కట్టుకుంది. చిన్న టీవీ, మ్యూజిక్ సిస్టం కొనుక్కుంది. వీటన్నిటివల్లా వచ్చిన స్వతంత్ర వ్యక్తిత్వం కూడా ఆమెకు ఉన్నది. ఈ కారణాలన్నీ తెగలోని కొందరిలో అసూయకు, ఆగ్రహానికి దారితీశాయని అంటు న్నారు. ఫలితంగా ఆమెకు మరొకరితో సంబంధం అంటగట్టి, అందుకు శిక్షగా జరిమానా విధించి, చివరకు ఈ దారుణానికి ప్రేరేపించారని స్థానికులు చెబుతున్నారు. 13మంది యువకులు సాగించిన ఈ దౌష్ట్యంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆదివాసీ సమాజంలో ఈ తెగల పంచాయతీలు ఇప్పటివి కాదు. బ్రిటిష్ పాలనకు ముందునుంచీ అవి సమాంతరంగా కొనసాగుతున్నాయి.
ఈ పంచాయతీల ప్రాబల్యం ఆదివాసీల్లో బలంగానే ఉన్నా అవి జరిమానాలు విధించడం, సాంఘిక బిహ ష్కరణవంటి తీర్పులివ్వడం తప్ప ఇలాంటి దారుణానికి ఎప్పుడూ పాల్పడలేదని అంటారు. పరస్పరం దాడులు చేసుకునే, బురదజల్లుకునే రాజకీయాలు ఆదివాసీ సమాజంలోకి ప్రవేశించాక ఆ రాజకీయాలను ఆశ్రయించుకుని ఉండే నేరాలు కూడా అక్కడికి వ్యాప్తి చెందుతున్నాయి. సుబల్‌పూర్ ఉదంతంలో తెగ పంచాయతీ సభ్యుల్లో కొందరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారని కాంగ్రెస్, సీసీఎం ఆరోపిస్తున్నాయి. ఆమధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఏకగ్రీవంగా తృణమూల్‌కే దక్కిందన్నది వాస్తవం. స్థానికంగా తెగ పంచాయతీ ఇలా చేస్తుంటే గ్రామ పంచాయతీ అధ్యక్షుడైనా, ఇతర సభ్యులైనా ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. పల్లెసీమల్లో స్వపరిపాలన వేళ్లూనుకుని అక్కడ ప్రజాస్వామిక భావనలు పెరిగితే అది దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని అనుకుంటారు. కానీ, గ్రామాల్లో అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సంస్థలు సమస్యలను పరిష్కరించడం అటుంచి, ఆ వైపరీత్యాలను మౌనంగా చూస్తూ ఊరుకోవడమో, అందులో భాగంకావడమో జరుగుతున్నది.
కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపిస్తున్నట్టు ఘటన వెనక తృణమూల్ సభ్యులు ఉన్నారో, లేదో ఇంకా తేలవలసి ఉన్నా ఆ రాష్ట్రంలో ఇటీవలికాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగాయన్నది మాత్రం వాస్తవం. గత రెండేళ్లలో రాష్ట్రం మహిళలపై నేరాల విషయంలో అగ్రస్థానంలో ఉన్నదని జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తున్నది. అత్యాచారం ఘటన చోటుచేసుకున్నప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా సరిగాలేదు. బాధితురాలినే దోషిగా చూపే ప్రయత్నాలు ఒకటికి రెండు సందర్బాల్లో చోటుచేసుకున్నాయి. రెండేళ్లక్రితం కోల్‌కతా నగరంలో సామూహిక అత్యాచారం జరిగినప్పుడు ఇదంతా అబద్ధమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టిపారేశాక మిగిలినవాటికి కూడా అదే గతి పట్టించడానికి అక్కడి పోలీసులు వెనకాడలేదు.
ప్రస్తుత ఘటనలో నిందితులందరినీ అరెస్టుచేసినా, అత్యాచారం కేసుల్లో అనుసరించాల్సిన విధానాలకు తిలోదకాలిచ్చారు. కఠిన చట్టాలు అందుబాటులోకొచ్చినా వాటిని సక్రమంగా వినియోగించడంలో విఫలమైతే నిందితుల్లో భరోసా పెరుగుతుంది. దానివల్ల మరిన్ని నేరాలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తరహా అనాగరిక ప్రవృత్తిని అరికట్టడానికి అవసరమైన చైతన్యాన్ని తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయడంలేదు సరికదా...తమ నిర్లిప్త ధోరణితోనో, తప్పుడు వైఖరితోనో అలాంటి నేరాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీన్ని సరిచేసుకోవలసిన అవసరం ఉన్నదని బీర్‌భూమ్ ఘటన తెలియజెబుతోంది.
బెంగాల్‌లో మరో దారుణం!
Published Sun, Jan 26 2014 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement