పంజాబ్ మరో నిర్భయ
దేశంలో ఏదో ఒకచోట మహిళలపై ఆగకుండా సాగుతున్న లైంగిక నేరాల పరం పరలో మరో ఉదంతం వచ్చి చేరింది. పంజాబ్‌లోని మోగాలో తల్లితో కలిసి బస్సు లో ప్రయాణిస్తున్న పదమూడేళ్ల బాలికపై బస్సు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించ డమే కాదు...అందుకు అభ్యంతరం చెప్పారన్న కారణంతో వారిద్దరినీ నడుస్తున్న బస్సునుంచి నిర్దాక్షిణ్యంగా తోసేశారు. బాలిక అక్కడికక్కడే మరణించగా, ఆమె తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది. ఏ చట్టాలొచ్చినా, ఎలాంటి చర్యలు తీసు కుంటున్నామని చెప్పినా లైంగిక నేరాలు ఆగకపోవడం ఒకపక్క ఆందోళన కలిగి స్తుంటే...వాటికి సమాంతరంగా నాయకుల వ్యవహరిస్తున్న తీరుతెన్నులు సైతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మోగా ఉదంతం జరిగి నాలుగురోజులైంది. సాధారణంగా అయితే పోలీసులు బస్సు సిబ్బందిని అరెస్టు చేయడంతో ఊరు కోరు. బస్సు యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుంటారు. సిబ్బందిని రిక్రూట్ చేసుకునే విధానంపైనా, వారిపై ఫిర్యాదులొచ్చినప్పుడు వ్యవహరించే తీరుపైనా ఆరా తీస్తారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి ఏమేరకు ఉన్నదో నిర్ధారణకొస్తారు.
దాని ఆధారంగా బస్సు సర్వీసులను నిలుపుచేస్తారు. అవసరమైతే యాజమాన్య ప్రతిని ధులను అరెస్టు చేస్తారు. ఢిల్లీలో ఆర్నెల్లక్రితం ఉబెర్ టాక్సీలో వె ళ్తున్న మహిళపై అత్యాచారం జరిగినప్పుడు పోలీసులు వెనువెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకో వడంతోపాటు ఆ సంస్థ కార్యాలయంపై దాడిచేసి డ్రైవర్ల నియామకంలో వారనుస రిస్తున్న విధానాలెలాంటివో రాబట్టారు. అందులోని లొసుగుల్ని బయటపెట్టడం తోపాటు వాటి ఆధారంగా యాజమాన్యంపై కూడా కేసు పెట్టారు. కానీ, మోగాలో జరిగింది ఇది కాదు. ఆరోపణలొచ్చిన సిబ్బందిని అరెస్టు చేయడం మినహా పోలీసు లు మరెలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ దురంతం చోటుచేసుకున్న బస్సు పంజా బ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ కుటుంబసభ్యులది కావడమే దీనికి కారణం. బాదల్ కుమారుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌కు బస్సు సర్వీసుల్ని నడుపుతున్న ఆర్బిట్ ఎవియేషన్ సంస్థలో భాగస్వామ్యం ఉంది. బాలిక కుటుంబా నికి నష్టపరిహారం ఇవ్వడం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ం ఇవ్వడంలాంటివి ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబం కూడా అందుకు అంగీకరించింది. ఇదంతా బాలిక కుటుంబసభ్యులు నాలుగురోజులు ఆందోళన జరిపాకే...తమకు న్యాయం చేస్తే తప్ప బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని హెచ్చరించాకే సాధ్యమయ్యాయి. ఈలోగా ఆ కుటుంబానికి బెదిరింపులు రావడం, నచ్చజెప్పడం వంటివన్నీ అయ్యాయి.
మోగా బాధితురాలి కుటుంబానికి అండగా విపక్షాలన్నీ రంగంలోకి వచ్చినా ప్రభుత్వం ఆర్బిట్ ఎవియేషన్ సంస్థపై చర్య తీసుకునేలా చేయడం సాధ్యపడలేదు. నిందపడిన సంస్థ రాజకీయ నాయకులకు సంబంధించినదైతే, ఆ నేతలు అధికారం లో ఉంటే మన దేశంలో జరుగుతున్న తంతు ఇదే. ఉబెర్ టాక్సీలో మహిళపై అత్యాచారం జరిగాక సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ సంస్థ టాక్సీ సర్వీసులను నిషేధించాలని అన్ని రాష్ట్రాలనూ కోరారు. ఆ సంస్థ లెసైన్స్‌ల్ని రద్దుచే యాలని, జరిగిన ఘటనలో సంస్థ బాధ్యుల్ని కూడా సహ నిందితులుగా చేర్చాలని పలువురు బీజేపీ ఎంపీలు సైతం సూచించారు. ఇప్పుడు పంజాబ్‌లో అకాలీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నది గనుక వారెవరూ ఆర్బిట్ ఎవియేషన్ గురించి అలాంటి డిమాండ్ చేయలేదు. ఇదే ఘటన రాజకీయ పలుకుబడి లేనివారి వాహ నంలో జరిగుంటే ఈపాటికి బస్సు పర్మిట్ రద్దయి ఉండేది. మోగా ఉదంతం లో కనీసం సంస్థ నియామక నిబంధనలెలా ఉన్నాయో, అందులోని లోటుపాట్లేమి టో తెలుసుకోవడానికైనా పోలీసులు ప్రయత్నించలేదు. అలా చేయడంవల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయొచ్చునన్న స్పృహ వారికి లేకపో యింది. బాలికపై బస్సు సిబ్బంది అలా ప్రవర్తించడానికి ముందు ఆ బస్సును ఇష్టం వచ్చినట్టు నడిపి పాదచారులనూ, ఇతర వాహనచోదకులనూ భీతావహుల్ని చేసినట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయి ఉంది.
ఇలాంటి ఉదంతాలతోపాటే మన నాయకుల బాధ్యతారాహిత్యం కూడా బయ పడుతున్నది. ఈసారి పంజాబ్ మంత్రి సుర్జిత్‌సింగ్ రఖ్రా నోరుపారేసుకున్నారు. దైవేచ్ఛ కారణంగానే ఈ తరహా ఘటనలు జరుగుతాయని...వీటినుంచి తప్పించు కోవడం ఎవరికీ సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం మొద లుకొని ఇంతవరకూ ప్రతి సందర్భంలోనూ నాయకుల మాట తీరు ఇలాగే ఉంటు న్నది. వారు మహిళలైనా, పురుషులైనా ఒకలాగే మాట్లాడుతున్నారు.
షీలా దీక్షిత్ అయినా, ములాయంసింగ్ యాదవ్ అయినా, మమతా బెనర్జీ అయినా బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. సమాజంలో నేరప్రవృత్తిని అరికట్టడం ఒక్క చట్టాలవల్ల మాత్రమే సాధ్యంకాదు. నాయకులుగా ఉంటున్నవారు తమ ప్రవర్తన తో, తమ మాటలతో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇలా నలు గురికి ఆదర్శప్రాయులుగా మెలగవలసినవారు బాధ్యతారహితంగా మాట్లాడటం, ప్రవర్తించడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయి. చిత్రమేమంటే ఇలాంటి నాయకు లు తమ సహచరులకెదురైన అనుభవాలనుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. నోటికొచ్చింది మాట్లాడి చీవాట్లు తింటున్నారు. నలువైపులనుంచీ ఒత్తిళ్లు పెరిగాక క్షమాపణలు కోరుతున్నారు. అప్పటికే వీరి ప్రవర్తనవల్ల జరగాల్సిన నష్టం జరిగిపో తోంది. నేరప్రవృత్తిని పారదోలడానికి కఠినమైన చట్టాలు ఉండటం అవసర మే. కానీ, వాటిని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగం అంతకన్నా ముఖ్యం. నిర్ణీత కాలవ్యవధిలో వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తుండాలని, సిబ్బంది ప్రవర్తన తీరు ఎలా ఉంటున్నదో తెలుసుకోవాలని పోలీసు యంత్రాంగానికి తోచలేదు. అదే జరిగుంటే మోగా ఉదంతంలో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయేది కాదు. కనీసం ఇకనుంచి అయినా ఇలాంటి అంశాలపై శ్రద్ధపెట్టాలని పాలకులు గుర్తించాలి.