దాగుడుమూతలు చెల్లవు! | Supreme Court Warns To Reserve Bank Of India | Sakshi
Sakshi News home page

దాగుడుమూతలు చెల్లవు!

Published Sat, Apr 27 2019 12:31 AM | Last Updated on Sat, Apr 27 2019 12:34 AM

Supreme Court Warns To Reserve Bank Of India - Sakshi

అప్పు ఇచ్చినవారెవరైనా దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి చూస్తారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తారు. కానీ మన బ్యాంకులు అందుకు విరుద్ధం. చిన్న మొత్తాల్లో అప్పులు తీసు కున్నవారు సకాలంలో చెల్లించకపోతే వారిని కోర్టుకీడ్చడంతోసహా రకరకాల మార్గాలు అనుసరి స్తాయి. కానీ భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నవారి జోలికి మాత్రం వెళ్లవు. సరికదా వారి పేర్లు బయటపెట్టడానికి కూడా ససేమిరా అంటున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు వైఖరిని తప్పు బడుతూ తక్షణం ఎగవేతదార్ల జాబితాను బహిరంగపరచాలని, బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించటం హర్షించదగ్గది. అంతేకాదు... బ్యాంకుల గురించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద ఎవరు ఏ మాదిరి సమాచారం అడిగినా ఇవ్వరాదని నిర్దేశిస్తూ నాలుగేళ్ల క్రితం రూపొందించిన విధానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేనట్టయితే కోర్టు ధిక్కార నేరం కింద విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల్ని బ్యాంకింగ్‌ పరిభాషలో ‘నిర ర్థక ఆస్తులు’(ఎన్‌పీఏ) అంటారు. ఈ మొండి బకాయిలు కొండల్లా పెరిగిపోవడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ చతికిలబడుతోంది. తరచు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లక్షల కోట్ల రూపాయలిచ్చి ఆదుకుంటే తప్ప రోజులు గడవని స్థితి ఏర్పడుతోంది. నిరుడు మార్చినాటికి వివిధ బ్యాంకులకు రావాల్సిన మొండి బకాయిలు స్థూలంగా 10.35 లక్షల కోట్లని ఒక అంచనా. ఇందులో 85 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవే. ఆ అంచనా ప్రకారం ఒక్క స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యాకున్న ఎన్‌పీఏలే రూ. 2.23 లక్షల కోట్లు! 2008లో మొత్తం రుణాల్లో ఈ మొండి బకాయిల శాతం 2.3 శాతం ఉంటే 2017నాటికి వాటి వాటా 9.3 శాతానికి చేరుకుంది. ఈ మొండి బకాయిల వ్యవ హారంలో తగిన చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2005లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను విచారించి రూ. 500 కోట్లకు మించి బకాయిపడ్డ కంపెనీల జాబి తాను తమ ముందుంచాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఎగవేతదార్ల జాబితాను సీల్డ్‌ కవర్‌లో తమకు అందించాలని, అంత భారీ మొత్తంలో రుణాలెందుకు ఇవ్వాల్సి వచ్చిందో బ్యాంకులు వివరించాలని ఉత్తర్వులిచ్చింది. అయినా మన బ్యాంకింగ్‌ విధానంలో చెప్పు కోదగిన మార్పు రాలేదు.

వాస్తవానికి బ్యాంకుల తీరుతెన్నుల్ని పరిశీలించి అంచనా వేయడం కోసం ఏటా ఆర్‌బీఐ తని ఖీలు నిర్వహిస్తుంది. నివేదికలు రూపొందిస్తుంది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 35 కింద దానికి ఆ అధికారం ఉంది. నిబంధనల్ని బ్యాంకులు పాటిస్తున్నాయో లేదో చూడటం దీని ప్రధాన ఉద్దే శం. రుణం కోరుతున్న సంస్థ ఉత్పత్తులకు, వ్యాపారానికి మార్కెట్‌ ఆదరణ లభిస్తుందా, అది రుణాన్ని తిరిగి చెల్లించగలదా, దాని నిర్వహణా సామర్థ్యం ఎలా ఉంది, వీటన్నిటిలో పొంచి ఉన్న ప్రమా దాలు... తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాలిస్తాయి. వాటికి ఏపాటి ఆస్తు లున్నాయో చూస్తాయి. ఒక సంస్థకు భారీగా రుణం ఇచ్చినప్పుడు ఇవన్నీ సక్రమంగా పరిశీలించారో లేదో చూడటంతోపాటు మొండి బకాయిల స్థితి, వాటికిగల కారణాలు ఆరా తీయడం ఈ తనిఖీల్లోని ప్రధానాంశం. తనిఖీ అనంతరం సంబంధిత బ్యాంకు చీఫ్‌తో చర్చించి నివేదిక రూపొందిస్తారు. ఏ బ్యాంకైనా ప్రజలు తన దగ్గర కూడబెట్టుకున్న సొమ్ముతోనే వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం లొసు గుల మయమై, బ్యాంకులు దివాళా తీస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కను కనే ఈ తనిఖీలు తప్పనిసరి. కానీ విచిత్రంగా వీటి నివేదికల్ని మాత్రం బయటపెట్టకూడదని ఆర్‌బీఐ నియమం పెట్టుకుంది.

సాధారణ వినియోగదారులు తమ నివేదికల్ని సరిగా అవగాహన చేసుకోలేక తప్పుడు నిర్ధారణలకొచ్చే ప్రమాదం ఉన్నదని వాదిస్తోంది. నివేదిక సారాంశమేమిటో, అది నిర్ధారిస్తున్న అంశా లేమిటో చెప్పడానికి, బ్యాంకింగ్‌ వినియోగదారులకు అవగాహన కలిగించేందుకు ఆర్థికరంగ నిపుణు లుంటారు. ఈ విషయంలో ఆర్‌బీఐ ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమేమిటో అర్ధంకాదు. బ్యాంకులు ఎన్ని అక్రమాలు చేస్తున్నా వినియోగదారులు వాటిని అమాయకంగా నమ్మా లని అది భావిస్తున్నట్టు కనబడుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం ఏ వ్యవస్థకైనా ప్రాణం. అవి లోపించి నప్పుడే అక్రమార్కులు పుట్టుకొస్తారు. ఫలితంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. తమ నిర్వాకం బయటపడటం ఖాయమని అర్ధమైతేనే వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉంటారు. ఎగవేతదార్ల నుంచి బకాయిల్ని త్వరగా వసూలు చేసేందుకు వీలుకల్పిస్తూ రెండేళ్లక్రితం దివాలా కోడ్‌ తీసుకొచ్చారు.

కంపెనీ కోసం రుణాలు తీసుకున్నప్పుడు చూపిన ఆస్తుల్ని అనంతరకాలంలో బదలాయించుకుని, కంపెనీ పేరిట తక్కువ ఆస్తులు చూపి వంచించేవారిని  కఠినంగా శిక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్పింది. ఇది అమల్లోకొచ్చాక ఎన్‌పీఏలు స్వల్పంగానైనా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని మొన్న జనవరినాటి ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది. మంచిదే. కానీ అది ఎగవేతదార్ల భరతం పట్టడానికి ఉద్దేశించింది. దాంతోపాటు బ్యాంకుల నిర్వాకం ఎలా ఉంటున్నదో, అవి తమ డబ్బుతో ఎలా వ్యాపారం చేస్తున్నాయో తెలుసుకునే హక్కు కూడా విని యోగదారులకుంటుందని ఆర్‌బీఐ గ్రహించడం అవసరం. అది బ్యాంకులపై వినియోగదారుల్లో ఉండే విశ్వాసాన్ని సడలింపజేయదు సరిగదా దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ పెను గండాల బారిన పడకుండా కాపాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉండాలన్నా, ఉపాధి అవ కాశాలు ముమ్మరం కావాలన్నా బ్యాంకులు రుణాలివ్వడం అవసరమే. అదే సమయంలో కేవలం ఎగ్గొట్టే ఉద్దేశంతో వేలాది కోట్లు అప్పులు చేసే విజయ్‌ మాల్యా, నీరవ్‌మోదీ లాంటివారిని అరి కట్టడం తప్పనిసరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అందుకు దోహదపడతాయి. ఇప్పటికైనా రిజర్వ్‌ బ్యాంకు కళ్లు తెరవాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement